# Tags
#తెలంగాణ

ఆలోచించండి! నిజమా,కాదా! 

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు… తెలంగాణా మోడల్ ను యావత్తు ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప వేదికలు…నిజమే, ఇందులో ఎలాంటి సందేహం లేదు…అక్షరాలా వాస్తవం.

కానీ, తెలంగాణ గుండె చప్పుడును, ప్రజల ఆవేదనా, ఆకాంక్షలనూ, ఆశయాలను ప్రపంచం ముందు ఎప్పటికప్పుడు సజీవంగా ఉంచిన మీడియా పాత్ర ఈ దశాబ్ది ఉత్సవాలలో ఎక్కడా కనబడకపోవడం నిజంగా విచారకరం…

తెలంగాణ రాష్ట్ర సాధనలో..సకలజనుల సమ్మెలో మీడియా పాత్ర గురించి అధికార బిఆర్ఎస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ముక్త కంఠంతో ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నాయి. 

కానీ, ఫోర్త్ పిల్లర్ అంటూనే…ఆ పిల్లర్ ను పూర్తిగా బలహీనపరుస్తున్నదీ వాస్తవం కాదా!.. అని ఒక్కసారి అన్ని వర్గాల వారూ ఆలోచించాల్సిన సమయం ఇది..

సకల జనుల సమ్మెలో…ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, ఆత్మహత్య జరిగినా,…అది తెలంగాణ కోసమే..అన్నట్టుగా ప్రచారం, ప్రసారం చేసింది మీడియా కాదా? 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కొన్ని సందర్భాల్లో కొన్ని పత్రికా యాజమాన్యాల హుకుంలను సైతం ధిక్కరించి వార్తలు పంపించింది నిజం కాదా?  ఇప్పుడు అవే మీడియాలను అక్కున చేర్చుకుని, మీడియా రంగాన్నే నీరు గారుస్తున్నది నిజం కాదా?

అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులైనా…అధికార గణమైనా మీడియా పట్ల అనుసరిస్తున్న వైఖరి, వారి కనుసన్నల్లో ఉన్న మీడియాను మాత్రమే “కవరింగ్” చేస్తూన్నది నిజం కాదా!

చిన్న పత్రికల పట్ల తనకు ఎంతో నమ్మకముందనీ, తెలంగాణ సాధనలో వారి కృషీ అమోఘమని ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనా విధానాలను క్రింది స్థాయి ప్రజాప్రతినిధులు,అధికార గణం నీరు గారుస్తున్నది నిజం కాదా!

తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులే సారథులు అంటూ…వారి సారథ్యానికి అర్థం లేకుండా చేస్తున్నది ఎవరు.? ప్రభుత్వమా? జర్నలిస్టు సంఘాలా? పత్రికా యాజమాన్యాలా?  ఆలోచించాల్సిన సమయమిది…

దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకునే వేళ మీడియాను కూడా భాగస్వామ్యం చేసి, మీడియా రంగం అభివృద్ధి కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఏమిటో కూడా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అంతేకాదు, ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కేవలం బడా మీడియాకే పెద్దపీట వేసి, ఆర్థిక వనరులు సమకూర్చకుండా, చిన్న, మధ్యతరహా మీడియా పట్ల, గ్రామీణ విలేఖరుల పట్ల కూడా ఉదాసీనత వైఖరి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికార గణంతో పాటుగా ప్రతిపక్ష పార్టీలూ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

ఆలోచించండి! నిజమా,కాదా! 

దశాబ్ది ఉత్సవాల తెలంగాణ విజయోత్సాహాన్ని ప్రపంచం ముందుంచే సమయంలో తెలంగాణ మీడియా అభివృద్ధి ప్రగతి నివేదికను సైతం పొందుపరిస్తే…కనీసం ప్రగతి నివేదికల ఆనందమైనా ఉంటుందని అధికార గణం, సమాచార పౌర సంబంధాల శాఖ అధికార గణం గుర్తించాలని కోరుతూ!….తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర ప్రధానమన్న ఒక్క వాక్యమైనా ప్రగతి నివేదికలో పొందు పరచాలని ఆకాంక్ష…

జర్నలిస్టుల, గ్రామీణ విలేఖరుల పరిస్థితి ఏమిటో…అందరికన్నా ఎక్కువగా తెలంగాణ రాష్ట్ర సారథి, ముఖ్యమంత్రి కెసిఆర్ కే తెలుసన్నది నా స్వీయ అనుభవం…కరీంనగర్ తెలంగాణ భవన్ లో ఉద్యమసమయంలో ఆయన ఆలోచనా విధానాలు, వాటిపై చర్చించిన తీరు ఇప్పటికీ మరచిపోలేను..కానీ, ఎందుకో మీడియా విషయంలో తెలంగాణ రాష్ట్ర సారథి, ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారా? లేదా ఆయననే తప్పుదారిపట్టిస్తున్నారా అర్థం గావడం లేదు.

కనుక, ఒక్కటే ఆకాంక్ష, రోటీ-కప్డా-ఔర్ మకాన్ ఈ అంశాల్లో ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా ఆలోచించి, యూనియన్ ల పరంగా కాకుండా, జర్నలిస్టుల, గ్రామీణ విలేఖరుల “బంధు”వుగా వర్కింగ్ జర్నలిస్టుల, గ్రామీణ విలేఖరుల పట్ల అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ!…దశాబ్ది ఉత్సవాలలో ఉత్సాహం చూపేలా చర్యలు తీసుకోవాలనీ కోరుకుంటూ…

సిరిసిల్ల శ్రీనివాస్ , సీనియర్ జర్నలిస్ట్, 

తెలంగాణ రిపోర్టర్ డైలీ,

www.telanganareportnews.com

Telangana Report News

9849162111