రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్: అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి, సిఈఓ శ్రీనివాస్
రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్: అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి
రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంకు ఉందని బ్యాంకు అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యొక్క సర్వ సభ్య సమావేశం జరిగింది.
ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు స్థాపించిన 24 సంవత్సరాల కాలంలోనే, 7 లక్షల 25 వేల మంది వినియోగదారులను కలిగి 2843.44 కోట్ల వ్యాపారాన్ని కలిగి మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుగా అవతరించిందని వెల్లడించారు. ఈ అభివృద్ధికి కారణమైన బ్యాంకు ఖాతాదారులకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
బ్యాంకుకు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆధార్ అనుసంధాన పేమెంట్ సేవలను (AePS) ప్రారంభించామని, అలాగే UPI (Unified Payment Inter- face) సేవలు కూడా ప్రారంభించామని వివరించారు. మరియు 344 బ్యాంకింగ్ కరెప్పాండెంట్స్ ను నియమించి వినియోగదారుల చెంతకే బ్యాంకు సేవలను తీసుకొచ్చామని అన్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రూ. 22 కోట్ల 44 లక్షల నికర లాభాన్ని నమోదు చేసుకొని స్టాట్యుటరీ ఆడిటర్లచే A క్లాస్ బ్యాంక్ గా వర్గీకరించబడిందన్నారు.ఈ ఆర్ధిక సంవత్సరాంతానికి రూ. 3,500 కోట్ల వ్యాపార లక్షాన్ని, 1 లక్ష నూతన ఖాతాదారులను సేకరించే సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు.
అలాగే,భారతీయ రిజర్వు బ్యాంకు వారి అనుమతితో ఆరు బ్రాంచీలు గల యాదగిరి లక్ష్మి నరసింహస్వామి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకును గాయత్రి బ్యాంక్ యందు గత జూన్ 10 నుండి విలీనం చేసుకోవడం జరిగిందని వెల్లడించారు.
అంతే కాకుండా నూతనంగా ఇప్పటి వరకు 16 బ్రాంచీలు ప్రారంబించుకోవడం జరిగిందనీ… ఇందులో 8 బ్రాంచీలు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో, మిగతా 8 బ్రాంచీలను తెలంగాణలోని పలు పట్టణాలలో ప్రారంబించుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలలో మరో 21 బ్రాంచీలను ప్రారంబించుటకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తద్వారా మొత్తం 66 బ్రాంచీల నెట్వర్క్ కు గాయత్రి బ్యాంకు చేరుకోబోతుందని వివరించారు.
మరిన్ని నూతన బ్యాంకింగ్ సేవలు అనగా, డైరెక్ట్ RTGS, ఇంటర్ నెట్ బ్యాంకింగ్ వంటి సేవలను అందుబాటులోకి తేనున్నామని తెలిపారు.
బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం మార్చి 31 నాటికి ఆడిటెడ్ జమ-ఖర్చు, ఆస్థి-అప్పుల, లాభనష్టముల నివేదికలను సమర్పించారు.
గత 24 సంవత్సరాల కాలంలో తమదైన శైలిలో వినియోగదారులకు అనుకూలమైన వేళలలో పారదర్శకమైన సత్వర సేవలందిస్తూ ఈ సంవత్సరం మార్చి 31 నాటికి బ్యాంకు డిపాజిట్లలో 11.67% వృద్ధి సాధించి, రూ. 1475 కోట్ల 95 లక్షల డిపాజిట్లను కలిగి ఉందని వెల్లడించారు.
అలాగే ఋణాలలో 10.91% వృద్దితో రూ. 1050 కోట్ల 81 లక్షల ఋణ నిలువ, రూ. 433 కోట్ల 53 లక్షల పెట్టుబడులను కలిగి, రూ. 22 కోట్ల 44 లక్షల నికర లాభాన్ని ఆర్జించి రూ. 116 కోట్ల 28 లక్షల నెట్వర్త్ కలిగి ఉన్నామని తెలిపారు.
బ్యాంకు ఖాతాదారుల సేవే లక్ష్యంగా AePS, UPI, Mobile Banking, Tollfree Banking, IMPS వంటిసేవలను అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 344 బ్యాంకింగ్ కరెప్పాండెంట్ (బి.సి)లను నియమించామని,త్వరలో మరిన్ని గ్రామాలకు బి.సి సేవలను విస్తరింపజేస్తామని తెలిపారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో 90 ఆన్సైట్ ఏటిఎంల ద్వారా రూ.1342.74 కోట్ల ఏటిఎం లావాదేవీలను, 462.39 లక్షల సంఖ్యలో యు.పి.ఐ లావాదేవీలను నమోదు చేశామని తెలియజేశారు.
సేవింగ్ ఖాతాపై 1 లక్ష రూపాయల ప్రమాద భీమా: తమ వంతు సామాజిక బాధ్యతగా బ్యాంకు యందు సేవింగ్ ఖాతాపై 1 లక్ష రూపాయల ప్రమాద భీమా సౌకర్యాన్ని అందించడం జరుగుతుందని వివరించారు.
ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు మరణించిన 566 మంది ఖాతాదారుల కుటుంబాలకు 1 లక్ష రూపాయల చొప్పున అందించి వారి కుటుంబాలకు ఆసరాగా గాయత్రి బ్యాంక్ నిలవడం జరిగిందని అన్నారు.
ఈ సమావేశంలో ప్రమాదవశాత్తు మరణించిన గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతాదారులైన బొమ్మకంటి గణపతి, ఆమందు గంగాధర్, పోటువత్తిని శంకరయ్య ల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున ప్రమాదబీమా చెక్కులను ఈ సమావేశంలో అందించారు.
బ్యాంకు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు బ్యాంకు అభివృద్ధి పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉపాద్యక్షులు మన్నె సౌజన్య, డైరెక్టర్ లు ఎ. రాజిరెడ్డి, ఎ. సత్యం, వై. అశోక్, కె. శ్రీనాథ్, బి. విజయ్, వాసాల మాధవి, ఎస్. రవి కుమార్, ఆర్. సతీష్ మరియు ఇతర సభ్యులు, ఖాతాదారులు, సహకార అధికారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.