#అంతర్జాతీయం

ఎంపీ అభ్యర్థి టి.జీవన్ రెడ్డితో జూమ్ ద్వారా దుబాయి ప్రవాసుల ఆత్మీయ సమావేశం

దుబాయి

ఎంపీ అభ్యర్థి టి. జీవన్ రెడ్డితో జూమ్ ద్వారా
దుబాయి ప్రవాసుల ఆత్మీయ సమావేశం

-దుబాయి సందర్శించిన ఎమ్మెల్సీ మహేష్ గౌడ్

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం దుబాయిలో ఒక హోటల్ లో జరిగిన తెలంగాణ ప్రవాసుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి జూమ్ ద్వారా ఆన్ లైన్ లో ఈ సమావేశంలో పాల్గొన్నారు.

1970 నుంచి ప్రారంభం అయిన గల్ఫ్ వలసల వలన తెలంగాణ రూపు రేఖలు మారాయని, ప్రతి గ్రామంలో 5 శాతం ప్రజలు వలస వెళుతున్నారని మహేష్ గౌడ్ అన్నారు. గల్ఫ్ కార్మికుల కష్టాలను కాంగ్రెస్ పార్టీ అధ్యయనం చేసి, విశ్లేషించిందని ఆయన అన్నారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణాలో కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని అన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మహేష్ గౌడ్ అన్నారు.

ఆన్ లైన్ లో పాల్గొన్న టి. జీవన్ రెడ్డి మాట్లాడుతూ స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక కట్టుకున్న భార్య, కన్న పిల్లలను, స్వంత ఊరును వదిలి బతుకుదెరువు కోసం మనవారు గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్నారని అన్నారు. గల్ఫ్ దేశాలలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రారంభించారని అన్నారు. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాల లలో కొన్ని సీట్లు కేటాయించడం, ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కొంతమేర ప్రాధాన్యత ఇవ్వడానికి కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం పోరాడానని గుర్తు చేశారు. గల్ఫ్ కార్మికుల సమస్యలను జాతీయ స్థాయిలో లేవనెత్తడానికి తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని
టి. జీవన్ రెడ్డి కోరారు.

గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక (జిడబ్ల్యూఏసి) సంస్థ నాయకులు కట్కం రవి నేతృత్వంలో ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కు ఒక వినతిపత్రం సమర్పించారు. కోరేపు మల్లేష్ అనుసంధానకర్తగా వ్యవహరించారు. దుబాయి లోని తెలంగాణ వ్యాపారవేత్త తోట రాంకుమార్ మాట్లాడుతూ గల్ఫ్ ప్రవాసులు పంపిన విదేశీ మారకద్రవ్యం వలన మన దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అవుతున్నదని అన్నారు.

ఈ పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డిని బలపరచాలని టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ కోరారు. కేరళ లోని ‘నోర్కా’ లాంటి ప్రవాసి విధానంతో తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ బోర్డు త్వరితగతిన ఏర్పాటు చేయాలని నంగి దేవేందర్ రెడ్డి కోరారు. కలిగోట్ సత్యం గౌడ్, మనోజ్, బండలింగాపూర్ సత్యం, తిరుపతి, రమేష్, వెంకటేష్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. జూమ్ ద్వారా కూడా పలువురు పాల్గొన్నారు.

ఎంపీ అభ్యర్థి టి.జీవన్ రెడ్డితో జూమ్ ద్వారా దుబాయి ప్రవాసుల ఆత్మీయ సమావేశం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *