#ఎడ్యుకేషన్ & కెరీర్

తల్లిదండ్రులారా…మీ శ్రద్ధా సక్తులే పిల్లలకి బాసట…!

పిల్లలకి బాసటగా….బాధ్యతగా….

  1. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఫ్రెషప్ అయ్యాక వారిని దగ్గర కూర్చోబెట్టుకుని వారి స్కూల్ డైరీలు పరిశీలించాలి. వారికీ ఏం హోం వర్క్ ఇచ్చారో గమనించాలి.
  2. స్కూల్లో ఆ రోజు ఏ టీచర్ ఏం చెప్పారో కనుక్కోవాలి. వాళ్ళకి ఎదురైన ఇబ్బందుల గురించి తెలుసుకుని వివరించాలి.
  3. పిల్లల చేత ఇంట్లో కూడా కాసేపు చదివించాలి. ఆ సమయాన అమ్మానాన్నలు కూడా వాళ్ళతో కూర్చుని తమకు నచ్చిన ఏదో ఒక పుస్తకం చదివితే బావుంటుంది. దీని వల్ల పిల్లలు కూడా ఆసక్తిగా చదువుతారు.
  4. చిన్న చిన్న కథల పుస్తకాలు, దినపత్రికలు చదవడం నేర్పించాలి.
  1. మంచిమాటలు చెప్పాలి. మనం వారి నుంచి ఏది కోరుకునట్టున్నామో వారికి తెలియజేయాలి. వారు చేసే పనులను మొదటే విమర్శించకూడదు. ముందుగా మెచ్చుకొని ఆ తర్వాత దానిలోని మంచి చెడులను విడమర్చి చెప్పాలి.
  2. చిన్నప్పటి నుంచే వాళ్ళ బుక్స్, బట్టలు, వస్తువులు, ఎప్పటికప్పుడు నీట్ గా సర్దుకోవడం నేర్పించడం అవసరం.
  3. పిల్లలను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్ళి చూపించడం, సమాజంలో నలుగురితో కలిసిపోయే తత్త్వాన్ని అలవరచడం అవసరం. అప్పుడే వారిలో ఆలోచనా శక్తి పెరుగుతుంది.
  4. స్నేహితులతో కలసిపోయే తత్త్వాన్ని, పెద్దలతో మర్యాదగా మాట్లాడం పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి.
  5. ఇలా చేశావేమిటని దండించటం కంటే ఏం చేయాలో ఏ విధంగా చేస్తే బాగుంటుందో వివరించాలి. అప్పుడు వారు తమ పొరపాట్లను, ప్రవర్తనలోని లోపాలని తెలుసుకుంటారు.
  6. పిల్లలకు ఎప్పుడూ పోషకాహారం తగిన పాళ్ళలో అందించాలి. పాలు, పెరుగు సమృద్ధిగా ఇవ్వాలి. వివిద సీజన్ లలో లభీంచే అన్నిరకాల పళ్ళు పిల్లలకి మంచి బలవర్ధకమని మర్చిపోకూడదు. పిల్లల దేహ స్థితిని బట్టి ఆహార ప్రమాణాన్ని పెంచడం, తగ్గించడం చేయాలి. మాంసాహారం కన్నా శాఖాహారం ఎంతో మేలు.
  7. దోమల బారిన పడకుండా దోమతెరలు వాడాలి . ఈగలు, క్రిములు ఇంట్లో తిరక్కుండా చూడాలి. ప్రమాదకర వస్తువులు, పదార్ధాలు పిల్లలకు అసలు అందుబాటులో వుంచకూడదు.
  8. భయం, భాధ, దిగులు పిల్లల వికాసాన్ని బాగా దెబ్బతీస్తాయి. వారి వికాసంలో తప్పటడుగులకు కారణాలు అవుతాయి. అందువల్ల అమ్మానాన్నలు పిల్లలకు భయాన్ని నేర్పకూడదు.
  9. తల్లిదండ్రులు రోజులో కనీసం ఒక్కసారైనా పిల్లలతో కలిసి భోజనం చేయడానికి ప్రయత్నించాలి. దీని వల పెద్దలకు, పిల్లలకు మధ్య మంచి అవగాహనా పూరిత వాతావరణం ఏర్పడుతుంది.
  1. పిల్లలు నివసించే గదిలో చల్లటి వతావరణాన్ని ఏర్పాటు చేయాలి. వారుండే గదుల్లో 40 వాట్స్ ట్యూబ్లైట్ ని బిగించాలి. దోమల నివారణకు కిటికీలకు వైర్ మెష్ లని బిగించి వుంచాలి. గదిలో మస్కిటో కాయిల్స్ ని వెలిగించరాదు.
  2. మనసుకు ఆహ్లాదం కలిగించే పాటలు. సంగీతం అప్పుడప్పుడు వినిపించాలి. హింస, పగలతో కూడిన సినిమాలు, టీవి కార్యక్రమాలు చూడనివ్వకూడదు.
  3. అందరు పిల్లలు ఒకేవిధంగా ఉండరు. ఎవరి తెలివితేటలు, వ్వక్తిత్వం వారిది. వేరేవారి పిల్లలతో పోల్చకూడదు. అలా చేస్తే పిల్లల్లో తమకు తెలివితేటలు లేవేమోననే భావన ఏర్పడే అవకాశం వుంది.
  4. పిల్లలు చదువుకొనేటప్పుడు మద్యలో అంతరాయం కలిగించకూడదు. ఫోన్లు మోగినా, కాలింగ్ బెల్ మోగినా, ఎవరయినా వచ్చినా పిల్లలను చూడమని చెప్పకూడదు.
  5. ఎప్పుడూ పుస్తకాల ముందు కూర్చోమని పిల్లల్ని ఒత్తిడి చేయకూడదు. అలా చేయడంవల్ల అనవసర టెన్షన్ తప్ప వారికి చదువు మీద శ్రద్దకలగదు. వేసుకున్న టైం టేబుల్ ప్రకారం చదవమని చెప్పాలి.
  6. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం గోరువెచ్చటి నీటితో పిల్లలకు స్నానం చేయించాలి.
  7. నిరంతరం చదువుల టెన్షన్ల లనుండి చక్కని ఉపశమనం, మెదడుకి కొత్త పదునునీ, ఉత్సాహాన్ని సమకూర్చే సాధనం గార్డెనింగ్ హాబీ. పిల్లలు పెరిగి పెద్దయ్యాక వారి ఇంటిని కూడా పచ్చదనంతో కాలకళలాడేలా చేసుకునే శ్రద్ద, ఓపిక, ఆసక్తి, అవగాహన ఏర్పడుతుంది. పిల్లలలో సృజనాత్మకతని పెంచే ఈ హాబీల వల్ల, వారిలో చురుకుదనం పెరిగి మంచి అభివృద్ది సాధిస్తారు. కనుక ఇలాంటి హాబీని పిల్లలకి అలవాటు చేయాల్సిన బాద్యత పెద్దలదే.
  1. ఏదైనా తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కుని రావడం, ఒకచోట కూర్చొని తినడం, ఎంత తినగలరో అంతే పెట్టించుకోవడం, ఎంగిలిచేసి పారేయకుండా వుండడం పిల్లలకు నేర్పాలి.
  2. బూట్ల లోపల బొటనవేలు నిక్కుకొని వుండకూడదు. సాక్స్ కోద్దిగా పెద్దవిగానే వుండాలి. ఇన్ఫెక్షన్ రాకుండా నివారించేందుకు సాక్స్ ని ప్రతిరోజూ శుభ్రంగా వాష్ చేయాలి.
  3. పిల్లలకు మంచి టిఫిన్ బాక్సు కొనండి. ప్రతిరోజూ ఆహార వైవిద్యం ఉండేలా చూడండి. పిల్లల ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువకాదు. టిఫిన్ బాక్సులను గోరువెచ్చని నీటితో కడిగి శుబ్రం చేయాలి.
  4. పాప బాబు పుట్టినప్పటి నుంచి పెద్దగా అయ్యేవరకు వీరికి సంబంధించిన ప్రతి విషయాన్ని రికార్డు రూపంలో భద్రపరచండి. పిల్లలు పెద్ద అయ్యాక మీ పిల్లలుకానీ, మీరు కానీ వాటిని చూసుకొంటే బాల్యంలో వారు చేసీన చిలిపి చేష్టలు మధుర స్మృతులు మదిని మురిపిస్తాయి.
  5. పిల్లల బర్త్ సర్టిఫికెట్లు నలిగిపోకుండా లామినేషన్ చేయించండి. జిరాక్స్ కాపీలు అందుబాటులో ఉంచుకోండి.
  6. స్కూల్లో కట్టిన ఫీజు రశీదులు, ఎల్.కె.జి నుంచి వారి మార్కుల మేమోలు, ఇతర పొట్టీల్లో గెలుచుకున్న సర్టిఫికెట్లు, జ్ఞాపికలను , స్కూల్ డ్రెస్ తో తీయించిన వారి ఫోటోలు దాచండి.
  7. ఎల్. కె.జి నుంచి ఐదవ తరగతి వరకు ఒక్కో పుస్తకాన్ని భద్రపరచడం పెద్దయ్యాక అవి చిన్ననాటి స్మృతులను గుర్తుకు తెస్తాయి.
  8. పిల్లల చేతికి డబ్బులు ఇచ్చి చిన్న చిన్న వస్తువులు కొని తీసుకురమ్మని చెప్పాలి. ముఖ్యంగా మీ కాలనీలో లేదా మీ వీధిలో షాపుకు వెళ్ళి కావాల్సిన వస్తువుల్ని తీసుకురావడం అలవాటు చేయాలి. డబ్బులు జాగ్రత్తగా తీసుకెళ్ళి కావాల్సిన వస్తువులు తీసుకురావడమనేది ఇలా అలవాటవుతుంది.
  9. మనం నిత్యజీవితంలో ఎన్ని రకాలుగా డబ్బులు చెల్లిస్తుంటామో కూడా పిల్లలకి తెలియాలి. పిల్లల ముందు డబ్బు విషయాలు దాచనక్కర్లేదు. మనం పొందె వస్తుసేవలకు చేసే చెల్లింపులు తెలియడం అవసరం. ఈ విధంగా చెల్లింపులు చేస్తుంటామో వారు తెలుసుకుంటారు. ఈ క్రమంలో వీటి వాడకంలో జాగ్రత్తగా ఉండటమెలానో గ్రహిస్తారు.
  10. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల గురించి పిల్లల ముందు మాట్లాడుకోవటం తప్పు కాదు. వాటి వినియోగం ఎలానో తెలుసుకుంటారు. వాటి అవసరాన్ని గుర్తిస్తారు. ఏదైనా రెస్టారెంట్లో డిన్నర్ తర్వాత బిల్లు చెల్లింపు కోసం క్రెడిట్ కార్డు ఉపయోగించేటప్పుడు పిల్లలతో దాని ఉపయోగాన్ని గురించి మాట్లాడండి. దీనివల్ల వారికి క్రెడిట్ కార్డులపై అవగాహన ఏర్పడుతుంది.
  11. నీటికుంటల్లో మునిగిపోవడం ఇళ్ళలో వేడినీళ్ళు, పాలు తగిలి గాయాలవడం, గింజలు, విత్తనాలు మింగేయడం, అయిల్స్ వంటి ద్రావకాలు తాగేయడం వంటివి ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. కాబట్టి జాగ్రత్త.
  1. 19 ఏళ్ళలోపు పిల్లల వరకు ద్విచక్ర వాహనాల పైన అవగాహన వున్నప్పటికీ పిల్లల శ్రేయస్సు దృష్ట్యా తల్లిదండ్రులు ప్రొత్సహించకుండా వుండాలి.
  2. మీరంటే మీ యింట్లో ఒక నమ్మకాన్ని సృష్టించుకోవాలి. మీకు బయట ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ఇంట్లో ప్రదర్శించకూడదు. కష్టసమయంలో కూడా మీరు మీ పిల్లలతో నిజాయితిగా వ్యవహరిస్తే మీరంటే ఎనలేని గురి, నమ్మకం, విశ్వాసం, అభిమానం కలుగుతాయి. పొరపాటున ఏ సందర్భంలో అయినా తప్పుగా వ్యవహారించ వలసివస్తే దాన్ని వెంటనే గుర్తుంచి సిగ్గుపడకుండా పిల్లల్ని క్షమాపణ అడిగితే వారికి మీ మీద మరింత అభిమానం పెరుగుతుంధి. మిమ్మల్ని వారు మార్గ దర్శకులుగా తీసుకుంటారు.
  3. డైనింగ్ టేబల్ చివరిగా వేడివేడి పదార్దాలు, గాజుగ్లాసులు, ప్లేట్లు పెట్టకండి పిల్లలు వాటిని పొరపాటున పట్టుకుంటే ఎంతో బాధకి లోనవుతారని గుర్తుపెట్టుకోండి.
  4. కొందరు టేబుల్ ఫ్యాన్లు, కిందపెడుతారు. వాటిని ఆన్లో ఉంచినప్పుడు పిల్లలు దగ్గరకు రాకుండా చూసుకోవాలి. వాటర్ హీటర్లు, ఐరన్ బాక్సులు వాడే వారు మరింత అప్రమత్తంగా ఉండాలి.
  5. పిల్లల్ని ఎక్కువగా తిట్టడం, కొట్టడం చేస్తే పిల్లలు మొద్దుబారిపోతారు. తిట్టడానికి బదులు ఒక పద్దతి ప్రకారం అది తప్పు అని చెప్పండి. పిల్లల మనోభావాలకి ప్రధాన్యమివ్వండి. వాళ్ళల్లో ఉన్నత వ్యక్తిత్యం రూపొందడానికి ప్రయత్నించండి.
  6. పిల్లలకి ఏది ఎంత వరకు ఇష్టమో అంతవరకే తినిపించాలి. వాటిని బలవంతంగా తినిపించకూడదు. వారి స్థితిని గమనించి వ్యవహరించాలి.
  1. పిల్లలు బస్సు దిగేటప్పుడు పెద్దలు స్కూలు బస్సు ఆగే వైపే నిలబడాలి. బస్సు దిగిన పెద్దలను చూడగానే ఉత్సాహంతో పరుగు పెడతారు. రోడ్డుమీద వచ్చే వాహనాలను గమనించరు. కబట్టి బస్సు ఆగే వైపు నించోవాలి. స్కూలు బస్ వచ్చే సమయానికి ముందే వచ్చివుండటం మంచిది.
  2. విద్యా సంవత్సరం ప్రారంబంలోనే వాళ్ళ స్కూల్ ఫీజులు చెల్లించి నిరంతరం పిల్లల ప్రగతిని పర్యవేక్షించండి. పేరెంట్-టీచర్ సమావేశాలకు హాజరు అయితే మీకు మీ పిల్లలకు చాలా మంచిది.
  3. పిల్లలే మా ప్రపంచం అంటారు గానీ వాళ్ళ ప్రపంచంలో పేరెంట్స్ ఉండటం లేదు. పిల్లల పెంపకం మామూలు వ్యవహారం కాదు, ఎంతో శ్రద్ద వహిస్తేనే పిల్లలు వృద్ది లోకి వస్తారు. ఈ విషయంలో ఉపయుక్తకరమైన పుస్తకాలు చదవడం నిష్ణాతులైన వారి సలహాలు తీసుకోవడం మంచిది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *