#తెలంగాణ

దేవాదాయశాఖ కమిషనర్ పర్యటనతో కదిలిన అధికార యంత్రాంగం

The Rajanna temple authorities were moved by the visit of the Commissioner of Devadaya

కమిషనర్ పర్యటనతో కదిలిన అధికార యంత్రాంగం

-కకావికలమైన కమిషనర్ మనస్సు

-రాజన్న కోడెల సంరక్షణ దిశలో ముమ్మర చర్యలు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయ దర్శనంతో పాటుగా రాజన్న కోడెల, గోవుల సంరక్షణ ధ్యేయంతో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు మంగళవారం ఆకస్మికంగా పర్యటించిన సంగతి తెల్సిందే…

ఇంతవరకూ ఏ  కమిషనర్ కూడా రాజన్న కోడెల సంరక్షణ దిశలో పర్యటించిన దాఖలాలు లేకపోవడంతో అధికారగణం తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో రాజన్న కోడెల, గోవుల పరిస్థితి దయనీయంగా మారి మూగజీవాలు ఆకలితో అలమటిస్తూ, నిర్లక్ష్యం నీడలో అనారోగ్యం పాలవుతూ, బక్కచిక్కిపోయిన పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్నాయి.

స్వామివారి దర్శనం అనంతరం కోడెలు, గోవులు ఉన్న స్థలాన్ని, కమిషనర్ ఆకస్మికముగా సందర్శించడంతో వాటి పరిస్థితి దయనీయంగా కళ్లముందు కనిపించింది. ఆయన మనస్సంతా కకావికలమై, ఏమనాలో మాటలు రాలేదు.

వెంటనే తేరుకున్న కమిషనర్ హనుమంతరావు  ఆలయ ఇంచార్జి ఈఓ కృష్ణ ప్రసాద్, ఏఈఓ శ్రీనివాస్ మరియు అక్కడ పని చేస్తున్న ఉద్యోగులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలోపు తీరు మార్చుకుని, రాజన్న కోడెలు, గోవుల సంరక్షణ కు అవసరమైన అన్ని చర్యలు చేపట్టి, వాటిని సంరక్షణ చేయకుంటే, రాజన్న ఆగ్రహంకు గురి కాక తప్పదని హెచ్చరించారు.

వాటికి నీడను, త్రాగునీటిని, సరైన పోషకాహారం పచ్చిగడ్డి, పల్లిపిండి లాంటి వాటిని అందించి ఆదుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే అందరినీ సస్పెండ్ చేసి, పని చేయగలవారిని తీసుకుంటామని హెచ్చరించారు.

దీంతో, ఆలయ అధికార యంత్రాంగంలో వణుకుపుట్టి, రాజన్న కోడెలు, ఆవుల సంరక్షణ కై పరుగులు పెడుతున్నారు.

ఇందులో భాగంగా కమిషనర్ హనుమంతరావు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజారామయ్యర్ కు నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయమే పశువైద్య, పశుసంవర్ధకశాఖ రాష్ట్ర డైరెక్టర్ శ్రీమతి మంజువాణి స్వయంగా వేములవాడ కు చేరుకుని, అక్కడి పరిస్థితిని పరిశీలించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కొమురయ్య, సంబంధిత పశుసంవర్ధక వైద్య బృందం, దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ తో పాటు యంత్రాంగం పశువైద్య, పశుసంవర్ధకశాఖ రాష్ట్ర డైరెక్టర్ శ్రీమతి మంజువాణి ఆధ్వర్యంలో కోడెలు, గోశాలకు చేరుకుని, అవసరమైన చర్యల్లో  మునిగిపోయారు.

వాటికి అవసరమైన వైద్యం, ఆహారం, సౌకర్యాలు అందించేందుకుగాను అన్ని చర్యల్లో నిమగ్నమయ్యారు.మొత్తానికి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ పర్యటనతో రాజన్న కోడెలు, గోవుల సంరక్షణపై అధికారయంత్రాంగంలో కదలిక రావడంపట్ల రాజన్న భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది.  

Leave a comment

Your email address will not be published. Required fields are marked *