# Tags
#జాతీయం #తెలంగాణ #హైదరాబాద్

మీడియా దిగ్గజం, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయం

మీడియా దిగ్గజం, అస్తమయం

-ఎందరికో స్ఫూర్తి ప్రదాత

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌, మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. 

గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

గత కొద్ది రోజులుగా రామోజీరావు వయసు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన వయసు 88 ఏళ్లు.

గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. జూన్ 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబసభ్యులు నానక్‌రామ్‌గూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రామోజీరావును పరీక్షించిన  వైద్యులు గుండె సంబంధిత సమస్య ఉన్నట్టు గుర్తించి, స్టెంట్‌ అమర్చారు. రెండు రోజులుగా ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్యం.. శుక్రవారం రాత్రి విషమించింది. శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన స్వర్గస్తులయ్యారు. 

1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత రామోజీరావు జన్మించారు. కుటుంబసభ్యులు రామోజీరావుకు ఆయన తాత రామయ్య పేరు పెట్టారు. 

బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పి.. తన పేరును తనే పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే విలక్షణ, సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన. 

ఈనాడు దినపత్రికను ప్రారంభించి, తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ‘ఈనాడు’ను ప్రారంభించారు. ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా ‘సితార’ సినీ పత్రిక నిలిచింది.

బహుముఖ ప్రజ్ఞ.. కఠోర సాధన.. ఇవే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు.. కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాలపాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించిన రామోజీరావు ఎందరికో స్ఫూర్తి దాయకం..

పాత్రికేయుల సంతాపం:

మీడియా దిగ్గజం, ఎందరో పాత్రికేయులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన రామోజీరావు మృతి పట్ల జగిత్యాల సీనియర్ పాత్రికేయులు పిఎస్. రంగారావు, సిరిసిల్ల శ్రీనివాస్, జె. సురేందర్, గంగుల రాంగోపాల్, ప్రభాకర్ రావు, మేడిపల్లి వేణు తో పాటు జగిత్యాల జిల్లా ఈనాడు విలేఖరులు మరియు పలువురు పాత్రికేయులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు