# Tags
#తెలంగాణ

పిల్లలు, గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

పిల్లలు, గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల :

పిల్లలు, గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఈ నెల 1 నుంచి 30 వరకు చేపట్టనున్న పోషణ అభియాన్ జిల్లా స్థాయి కన్వర్జెన్స్ సమావేశం ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.

ముందుగా జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మి రాజం జిల్లాలో పోషణ మాసం షెడ్యూల్, కార్యాచరణ ప్రణాళిక ను వివరించారు. బుధవారం విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే ను నిర్వహించి పోషణ లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి బాలామృతం, ఆహార పదార్థాలు అందించడం గ్రోత్ మానిటరింగ్ నిర్వహించడం, లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని, గురువారం రోజున పోషణ లోపంతో బాధపడుతున్న పిల్లల ఇంటి వద్దకి వెళ్లి ఇంటింటికి అంగన్వాడీ కార్యక్రమంలో భాగంగా వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, అలాగే మాతృ మరణాల సంఖ్యను తగ్గించడం కోసం దాన్ని పూర్తిగా నివారించడం కోసం ప్రతి ఇంటికి వెళ్లి ముందుగా వారికి జాగ్రత్తలను తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తామని తెలిపారు. అలాగే శుక్రవారం రోజున ఆహార పదార్థాల తయారీ అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్ ప్రిపరేషన్ మంచి సరియైన నాణ్యత సరైన పద్ధతిలో ఆహార పదార్థాలు వండించడం గురించి స్థానిక ఆహార పదార్థాలను వండడం, రాగులు, సజ్జలు, అలసందలు, బొబ్బర్లు గుడాలు, గుడ్లు లాంటి పదార్థాలు రుచికరంగా పోషక లోపం లేకుండా ఎలా ఉండాలో సూచిస్తామని, ప్రదర్శన ద్వారా దీనిని నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు.
ప్రతి పిల్ల వాడి ఎత్తు, బరువులు తీసి తద్వారా పోషణ లోపం,తీవ్ర పోషణ లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు.
వీరితో పాటు హాస్టల్స్, స్కూళ్లలో విద్యార్థులకు రక్తహీనత నిర్దారణ పరీక్షలు చేయాలని అన్నారు. సివియర్ ఎనిమిక్ తో బాధపడుతున్న వారిని గుర్తించి జిల్లా ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందించాలని సూచించారు.
పోషణ లోపం,తీవ్ర పోషణ లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి అదనపు పోషకాహారం అందించడంతో పాటు వైద్య శాఖ సిబ్బంది సమన్వయంతో వైద్య పరీక్షలు చేపట్టి పిల్లలు సాధారణ స్థితికి వచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు. తదుపరి సోమవారం మళ్లీ రివ్యూ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి అంగన్వాడీ టీచర్ తమ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలలో డ్రైడేలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ వినోద్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు, డీఆర్డీఓ శేషాద్రి, డీఏఓ అఫ్జల్ బేగం, డీఎస్ సీడీఓ విజయ లక్ష్మి, మున్సిపల్ కమిషనర్లు మీర్జా ఫసహత్ అలీ బేగ్, సంపత్ రెడ్డి, డీఎల్పీఓ రాజు తదితరులు పాల్గొన్నారు.