#తెలంగాణ #హైదరాబాద్

అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు ‘ధరణి’ పవర్స్‌..సర్క్యులర్‌ జారీ చేసిన సీసీఎల్‌ఏ

అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు ‘ధరణి’ పవర్స్‌..!!
సర్క్యులర్‌ జారీ చేసిన సీసీఎల్‌ఏ

హైదరాబాద్‌:

ధరణి పోర్టల్‌కు వచ్చిన వివిధ కేటగిరీల పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా వాటికి తుది ఆమోదం తెలిపే అధికారాలను అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ భూపరిపాలన విభాగం చీఫ్‌ కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నవీన్‌మిట్టల్‌ ఈ నెల 26న సర్క్యులర్‌ జారీచేశారు. ధరణి కమిటీ సిఫారసుల అమల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు.

అదనపు కలెక్టర్లకు 4 కొత్త అధికారాలు :
అదనపు కలెక్టర్లు(రెవెన్యూ) కొత్తగా ధరణి సాఫ్ట్‌వేర్‌లోని నాలుగు మాడ్యూల్స్‌కు తుది ఆమోదం తెలిపే అధికారం పొందనున్నారు. మ్యూటేషన్‌ దరఖాస్తులు(టీఎం3), పీపీబీ-కోర్టు కేసు(టీఎం24), ఇళ్లు/ఇంటి స్థలంగా పేరు ఉన్న సందర్భంలో పీపీబీ/నాలా కన్వర్షన్‌ జారీ(టీఎం31), పాస్‌బుక్‌లో తప్పుల దిద్దుబాటు/పేరు మార్పు(టీఎం33)కు సంబంధించిన దరఖాస్తులకు ఆయన స్థాయిలోనే పరిష్కరిస్తారు.

ఈ ప్రక్రియకు సంబంధించిన విధివిధానా లను సైతం సీసీఎల్‌ఏ ప్రకటించింది. తొలుత తహసీల్దార్లు దరఖాస్తుదారులను విచారించి తమ ఆదేశాలను అప్‌లోడ్‌ చేయడం ద్వారా వారి దరఖాస్తులను ఆర్డీ ఓలకు పంపించాలి.

ఆర్డీఓలు దరఖాస్తులను పరిశీలించి తమ ఆదేశాలను అప్‌లోడ్‌ చేయడం ద్వారా అదనపు కలెక్టర్లకు ఫార్వ ర్డ్‌ చేయాలి. తహసీల్దార్‌/ఆర్డీఓ సిఫారసుల ఆధారంగా అదనపు కలెక్టర్లు దరఖాస్తులను ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. ఒకవేళ దరఖాస్తులను తిరస్కరిస్తే అదనపు కలెక్టర్లు అందుకు సరైన కారణాలు తెలపాలి.

ఆర్డీఓలకు మరిన్ని అధికారాలు :
ఆర్డీఓలకు ఇప్పటికే ఉన్న ధరణి మాడ్యూల్‌ అధికారాలకు అదనంగా మరో నాలుగు మాడ్యూల్స్‌కు తుది ఆమోదం తెలిపే అధికారాన్ని ప్రభుత్వం కట్టబెట్టింది. అసైన్డ్‌ భూములతో సహా పట్టా భూముల వారసత్వ బదిలీ దరఖాస్తులు(టీఎం4), పెండింగ్‌ నాలా దరఖాస్తులు (టీఎం27), సర్వే నెంబర్‌ డిజిటల్‌ సైనింగ్‌(టీఎం 33), సర్వే నెంబర్‌ డిజిటల్‌ సైనింగ్‌(జీఎల్‌ఎం) దరఖాస్తులకు తుది ఆమోదం తెలిపే అధికారాన్ని వారికి కల్పించింది.

గత ఫిబ్రవరి 28న ప్రకటించిన గడువుల్లోగానే దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకొని ధరణి పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *