#తెలంగాణ

మహిళలు,పిల్లల సంక్షేమానికి శుక్రవారం సభ దోహదపడుతుంది : మంత్రి పొన్నం ప్రభాకర్

– ప్లాస్టిక్ నిషేధాన్ని శుక్రవారం అంగన్వాడీ సభ ద్వారా ప్రచారం చేయాలి

– ప్రతి గ్రామంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు

-బాల్య వివాహ్ ముక్త భారత్ పోస్టర్ ఆవిష్కరణ

కరీంనగర్ (చిగురుమామిడి, ఎం. కనకయ్య):

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న కార్యక్రమం మహిళలు, పిల్లల సంక్షేమానికి ఎంతో దోహదపడుతోందని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

చిగురు మామిడి మండల కేంద్రంలో నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా అంగన్ వాడీ పిల్లలకు యూనిఫాం పంపిణీ చేయడంతోపాటుగా బాల్య వివాహ్ ముక్త భారత్ పోస్టర్ ను ఆవిష్కరించారు. గర్భిణీలకు సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రతి మహిళా తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అప్పుడే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. గర్భిణీ, బాలింతల ఆరోగ్యం పట్ల ప్రతివారం నిర్వహించే కార్యక్రమంలో చక్కటి అవగాహన కల్పిస్తున్నారని వివరించారు. మహిళా సమస్యల పరిష్కారానికి ఈ సభ వేదికగా నిలుస్తోందని అన్నారు. 

ప్లాస్టిక్ నియంత్రించాలన్న నినాదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. 

ప్రతి గ్రామంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ప్లాస్టిక్ వినియోగానికి చెక్ పెడతామని వెల్లడించారు. 

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ గ్రామస్థాయిలో అధికారులందరి సమన్వయంతో గత ఆరు నెలలుగా ప్రతీ శుక్రవారం సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభ ద్వారా గర్భిణీలు, బాలింతలు చిన్నారులు తీసుకోవాల్సిన ఆహారాన్ని సూచిస్తారని తెలిపారు. పిల్లలు ఎత్తుకు తగిన బరువు ఉండేలా అంగన్వాడి, ఆరోగ్యశాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు సమన్వయంతో తల్లులకు తగు సూచనలు ఇస్తారని తెలిపారు. 

ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళలకు సుమారు రూ.50 వేలు ఖర్చయే 60 రకాల పరీక్షలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా  నిర్వహిస్తున్నామని తెలిపారు.దీనివల్ల ప్రమాదకరమైన వ్యాధులను ముందే గుర్తించి నివారించవచ్చని అన్నారు.

ఈ శుక్రవారం నాటి అంగన్వాడీ సభలో ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఆర్డీవో మహేశ్వర్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *