# Tags
#తెలంగాణ

తులసి వనంలో గంజాయి మొక్కల్లా ఉన్న కొందరి తీరుతో ఆ శాఖ పరువు అడవిపాలు!

మంథని : (గుజ్జటి శ్రీనివాస్)

అపార మైన ఖనిజ సంపదకు , అత్యంత విలువైన వృక్ష జాతులకు, అపురూప మైన జీవ రాసులకు నెలవులు ఆ అడవులు. అలాంటి అటవీ సంపదను కాపాడేందుకు ప్రత్యేకంగా అటవీ శాఖ, అందులో క్షేత్ర స్థాయి నుంచి మొదలు రాష్ట్ర స్థాయి వరకు అధికారులు ఆ శాఖలో వృత్తి పట్ల నిబద్దత, విధుల్లో అంకిత భావం కలిగిన అధికారులు సిబ్బంది ఎందరెందరో….

కానీ.. తులసి వనంలో గంజాయి మొక్కల్లా ఉన్న కొందరి తీరుతో ఆ శాఖ పరువు అటవిపాలు అవుతుండగా, శాఖ ప్రభ మసక బారి పోతోంది. ప్రభుత్వం నుంచి వేలాది రూపాయలు జీత భత్యాలుగా పొందుతున్నప్పటికి, అవి చాల వన్నట్టుగా కొందరు అమ్యామ్యాలకు ఎగబడుతూ విలువైన ఖనిజ, వృక్ష సంపదతో పాటు, అపురూపమైన జంతు జాతుల విధ్వంసానికి కారణభూతులవుతున్నారు,

ఆ ఆమ్యామ్యాలు ఇవ్వలేని వారిని అదిరిస్తూ, బెదిరిస్తూ హంగామా చేస్తున్నారు. తెలంగాణా లోనే దట్టమైన అడవులుగా పేరు గాంచిన భూపాలపల్లి జిల్లాలోని ఒక రేంజ్ పరిధిలో జరిగిన ఒక సంఘటన కొందరి అవినీతికి అద్దం పడుతోంది.

ఆ రేంజ్ పరిధిలో ఎక్కువగా వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తుంటారు. మరీ మిక్కిలి వాణిజ్య పంట అయిన మిర్చి ( ఎర్ర బంగారం) పండిస్తుంటారు. ఆ పంట కోసే సమయంలో పలు ప్రాంతాల నుంచి వచ్చే కూలీల కోసం ఎండిన వంట చెరుకును సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఏరుకుని తెచ్చుకుంటూ ఉంటారు .

ఆ విధంగా వంట చెరుకు తెచ్చుకుంటున్న ఒక సామాన్య రైతు ఎడ్ల బండిని మార్గ మద్యంలో ఆటకాయించిన ఆ శాఖ సిబ్బంది ఒకరు , సదరు రైతును బెదిరించి బేరానికి దిగి గిట్టుబాటు కాగానే వదిలి పెట్టినట్టు సమాచారం.

ఇలాంటి అధికారులు, సిబ్బంది తీరుతో ఆ శాఖకు చెడ్డపేరు వస్తున్న కారణంగా అలాంటి కలుపు మొక్కలను ఏరివేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి, శాఖ పరువు నిలబెట్టే ప్రయత్నం చేస్తారో… మనకెందుకంటూ మిన్నకుండి పోతారో… వేచి చూద్దాం మరి….