# Tags
#Culture #తెలంగాణ

శ్రీ రాజ రాజేశ్వరి తల్లి నవ వధువుగా దర్శనమిచ్చి…

శ్రీ రాజ రాజేశ్వరి తల్లి నవ వధువుగా దర్శనమిచ్చి నన్ను
తరింపజేసిన తీరు …!!!

దర్శించితిని తల్లి !!
వేములవాడ సామ్రాజ్ఞి …!!!
నిను నవ వధువుగా,కాత్యాయనివై తపంబున గెలిచి రాజేశ్వారుణ్ణి మనువాడి , మెట్టినింట(కైలాసంబున) అడుగుపెట్టగా…!!!

బ్రాహ్మీ ముహూర్తమందు నల్లని చీకటిని దట్టమైన నీ కేశభారములుగా ,నక్షత్రాలను శివయ్య వేసిన తలంబ్రాలుగా , అటుగా ఉన్న పాలపుంతను జీలకర్రాబెల్లపు ముద్దగా ,శేష చంద్రుని కాంతిని నీ నుదుటన బాసింగముగా దర్శించితిని తల్లీ రాజ రాజేశ్వరి
వేములవాడ సామ్రాజ్ఞి …!!!

తొలిసంధ్యన ఉదయించిన సూర్యుడిని
నీ తిలకముగా ,మానస సరోవరాన వికసించిన కలువలనే నీ నేత్రములుగా ,సరోవర తరంగ వలయాలలో ప్రతిబింబించిన భాస్కరుని కిరణాలనే నీ ముక్కెరగా మరియు తాటంకములుగా ,బాల భానుడి ఎరుపుని అద్దుకున్న సరోవరతీరపు పాలరాళ్లనే నీ తాంబూలపూరిత ముఖముగా,వాటిపై కురిసిన తెల్లటి మంచుముక్కలనే కర్పూరవీటికలుగా దర్శించితిని తల్లీ
వేములవాడ సామ్రాజ్ఞి …!!!

మంచుపొరతో కప్పబడ్డ హిమాచల కొండలను,ధవళవర్ణపు పీతాంబరంపు కొంగుచే కప్పబడ్డ సృష్టిపోశకాలైన నీ అమృతకలశాలుగా,
గలగలమంటూ ప్రవహిస్తున్న హిమనదముల తరంగాలనే నీ చేతి గాజులుగా ,
మాధ్యాహ్నిక సంధ్యన గల నడి సూర్యుడి కిరణాలను నీ నడుముకి అలంకరించబడ్డ ఒడ్డాణపు కేంద్రంలో గల మేలిమి వజ్రాల గుంపుగా దర్శించితిని తల్లీ రాజ రాజేశ్వరి….!!!!!

సాయంసంధ్యన అస్తమిస్తున్న సుర్యుని స్వర్ణవర్ణ కాంతిరేఖలను నీ పాద మంజీరములుగా , నింగిన వెదజల్లబడ్డ పసుపుఎరుపు మిశ్రిత కాంతిని నీ దివ్యచరణములకు అలంకరించిన
పసుపుపారాణిబొట్లుగా ,ప్రదోషకాల చంద్రోదయ సమయాన విరబూసిన నక్షత్రాల గుంపును నీ కాలిమట్టెలుగా దర్శించితిని తల్లీ రాజ రాజేశ్వరీ వేములవాడ సామ్రాజ్ఞి …!!!

ఫలశృతి :
ఈ ప్రార్థనను భక్తి శ్రద్దలతో అత్యంత ధ్యాననిష్ఠతో చదివి ఎవరయితే ఆనందంలో రమిస్తూ తరిస్తారో వారి ఇంట అఖండ సౌభాగ్యం అనుగ్రహించబడుతుంది .
కళ్యాణ యోగ్యత అనుగ్రహించబడుతుంది.
సంతాన ప్రాప్తి అనుగ్రహించబడుతుంది.
సుమంగళీత్వం అనుగ్రహించబడుతుంది.
విద్య ఉద్యోగ ప్రాప్తి అనుగ్రహించబడుతుంది.
అష్టైశ్వర్య ప్రాప్తి అనుగ్రహించబడుతుంది.
సాధన సిద్ధి అనుగ్రహించబడుతుంది.
కాలం కలిసి వస్తుంది .
కలహాలు నివారించబడతాయి .
కరవు కాటకాలు నివారించబడతాయి .
ప్రతీ జీవితం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంది .
సంకల్ప సిద్ధి చేకూరుతుంది .
లోక కళ్యాణ సంకల్పిత మనోవాంఛలు నెరవేరుతాయి .
భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు లభిస్తాయి .
రాజ రాజేశ్వరీ తల్లి దర్శన భాగ్యం అనుగ్రహించబడి ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి అనడంలో ఏలాంటి సందేహం లేదు (సాక్షాత్తు మా తల్లి రాజ రాజేశ్వరీ తల్లియే ప్రసాదించిన ధ్యాన చైతన్యం కాబట్టి)
విజయీభవ వేములవాడ పతే !!!
(FROM THE DESK OF Vishnukumar Nagubothu)👌