# Tags
#Blog

జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య జయంతి

शंकरं शंकराचार्यं केशवं बादरायणम् ।
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ॥

శివుడు, శివుని గురువు, కేశవుడు, బాదరాయణుడు.
సూత్రాలను వివరించిన ఇద్దరు ప్రభువులకు నేను పదే పదే నా ప్రణామాలు అర్పిస్తున్నాను.

జగద్గురు ఆదిశంకర భగవత్పాదాచార్యుల జయంతి మహోత్సవాలు చతురామ్నాయ – సర్వజ్ఞ పీఠాలు, దేశ విదేశాలలోని దేవాలయాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు, శక్తి పీఠాలు, తీర్థాలు, కోట్ల మంది భక్తుల గృహాలు, సభలలో వాడవాడలా మహోన్నత వైభముతో జరుగుతున్నాయని ఆధ్యాత్మికవేత్త శ్రీరామపాద భాగవతర్ తెలిపారు.

“మూర్తి – చిన్నది, కీర్తి – హిమాలయ శిఖరమంత ఎత్తైనది. వేద-శాస్త్ర-భాష్య-స్తోత్ర-ధర్మనిష్ఠ-ధర్మ ప్రచారం మహాసాగరమంత విశాలమైనది. మహిమ – ముల్లోకాలకు వ్యాప్తి చెందినది. అవతారము – సాక్షాత్ మహాదేవునిది (త్రిమూర్తులలో ప్రధానం. బ్రహ్మ, విష్ణువులు సైతం ఆది, అంతం తెలుసుకోలేకపోయారు)”. ఇదే జగద్గురు ఆదిశంకరుల వైభవమని, ఇదే ఆదిశంకరాచార్యులతో స్థాపితమై అవిఛ్ఛిన్నముగా ఎన్నో శతాబ్దాల నుండి నడుస్తున్న అఖండమైన, మహోన్నతమైన గురు-పరంపర వైశిష్ఠ్యమని శ్రీరామపాద అన్నారు.

ఈ గురు – శిష్య పరంపరకు చెందిన శంకరాచార్యులందరూ దైవీకమైన సాధనతో గుర్తింపబడినవారని (ఆధునిక స్వామీజీయో, స్వయంప్రకటిత జీయరో, మూలాలు లేని అవతారపురుషుడో, అధర్మ దూతయో కాదు) ఈ సందర్భముగా ఆయన స్పష్ఠం చేశారు.

ఈమధ్య కొంతమంది కాషాయ ధారణ అజ్ఞానులు నోరు పారేసుకుని అమాయక ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని, శివ-విష్ణు బేధము సృష్టించి భక్త సమూహాలలో చిచ్చుపెడుతున్నారని, ఇటువంటి పరిణామాలు హిందూ సనాతన ధర్మానికి కళంకమని, ఇంద్రియ నిగ్రహం లేనివారు గురు స్థానానికి తగడని, కాషాయవేషంలో కల్మష భక్తి ప్రచారం చేశేవారు కల్పాల పర్యంతం నరకబాధను అనుభవించవలసి వస్తుందని శ్రీరామపాద చెప్పారు. అటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తముగా ఉండాలని సూచన చేశారు.

సనాతన ధర్మాచరణే లక్ష్యంగా గల గురువులు ప్రపంచం చుట్టూ విమానాల్లో (ఫస్ట్ క్లాస్‌లో) నిత్యం చక్కర్లు కొట్టరని, ప్రపంచమే వీరి పాదాల చెంతకు వస్తుందని, వీరే జగద్గురువులని, అదే పురుషోత్తముల మహిమని శ్రీరామపాద భాగవతర్ పురాణ ఇతిహాసాలను ఉటంకిస్తూ వివరించారు.

శంకరులను అనుసరించే భక్తకోటికి అఖండమైన సంపద అటువంటి ఉత్తమ గురువులేనని, ఎక్కడ చూసినా, మూలమూలనా జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత స్తోత్ర పారాయణలు, వేద సభలతో ప్రపంచమంతా ఘోషిస్తోందని, అందరి నోట శంకరాచార్యుల మంత్ర జపమేనని శ్రీరామపాద భాగవతర్ ఆనందం వ్యక్తపరిచారు. ఇంతటి ఉత్క్రుష్టమైన దివ్య తరంగములు ఈ దేశానికే కాక, ప్రపంచంలోని సమస్త జీవరాశికి ప్రత్యేకించి ఆస్తిక మహాజనులకు ఎంతో మేలని, శివ, శక్తి, విష్ణు బేధములేని అత్యంత ఉత్తమ జ్ఞాన సంపన్నులు ఆదిశంకర భగవత్పాదాచార్యుల పరంపరలోని అనేక కోట్ల శిష్యగణమని శ్రీరామపాద భాగవతర్ గర్వపడ్డారు. ఈ సందర్భముగా సకల మానవాళికి ఆదిశంకరుల కృపతో శ్రేయస్సు కలగాలని శ్రీరామపాద భాగవతర్ ఆకాంక్షించారు.

జయ జయ శంకర హర హర శంకర 🙏