# Tags

జగిత్యాల జిల్లానుండి వ్యవసాయ మహిళా కళాశాల తరలిపోతుందా? ప్రజాప్రతినిధులు సంఘటితం కాకుంటే తప్పదా? 

జగిత్యాల జిల్లా :

  • విద్యార్థి సంఘాలు, తల్లితండ్రుల్లో ఆందోళన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు అన్ని జిల్లాల్లో విద్యారంగాన్ని అభివృద్ధి పరుస్తామని ప్రకటిస్తున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు గతంలో మంజూరై, రెండు సంవత్సరాలుగా కోరుట్లలో నడుస్తున్న వ్యవసాయ మహిళా కళాశాల తరలిపోతుందన్న ఆందోళన జిల్లాలోని విద్యావంతుల్లో, తల్లిదండ్రుల్లో,  నెలకొని ప్రధాన సమస్యగా మారింది.

గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ తమ శాఖ తరపున వ్యవసాయ మహిళా కళాశాలను మంజూరు గావించారు. అయితే ప్రస్తుతం, ప్రభుత్వం మారిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం క్రమంగా నాటి ప్రభుత్వంలో మంజూరైన వ్యవసాయ మహిళా కళాశాలను మరో నియోజకవర్గానికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వ్యవసాయ కళాశాల మంజూరు అయిన తర్వాత ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూర్ మండలం స్తంభంపెల్లి వద్ద సుమారు 50 ఎకరాల స్థలాన్ని అప్పటి కలెక్టర్ యాస్మిన్ భాష మంజూరు గావించారు.

ప్రస్తుతం ఈ వ్యవసాయ కళాశాలను జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మరో నియోజకవర్గానికి తరలించడానికి సన్నాహాలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు విద్యార్థి సంఘాలు, పలువురు విద్యావంతులు తల్లిదండ్రులు ఈ అంశాన్ని ఖండిస్తూ జగిత్యాల జిల్లాకు మంజూరై నడుస్తున్న వ్యవసాయ మహిళా కళాశాలను మరో నియోజకవర్గానికి తరలించరాదని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

పలు విద్యార్థి సంఘాలు జిల్లా కేంద్రంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యవసాయ మహిళా కళాశాల తరలిపోతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని, ఈ వ్యవసాయ మహిళా కళాశాల తరలిపోకుండా, విద్యా రంగానికి ఏ రాజకీయాలు ఆపాదించవద్దని ఆయా విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

అంతేకాకుండా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గత రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ మహిళా కళాశాల ఏర్పాటుతో జగిత్యాల జిల్లా విద్యారంగపరంగా మహిళలకు ఎంతగానో చేదోడు వాదోడుగా ఉంటుందని దీన్ని తరలిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన సంగతి కూడా తెలిసిందే.

ఈ సందర్భంగా జిల్లా లోని విద్యారంగం అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం కృషి చేయాల్సింది పోయి గత ప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ మహిళా కళాశాలలో మరో నియోజకవర్గానికి తరలించే ప్రయత్నాలు చేయడం పూర్తిగా ప్రజాప్రతినిధుల వైఫల్యమైనని చెప్పక తప్పదు.

ఈ అంశంలో  ప్రభుత్వ పెద్దలు జిల్లాలో విద్యారంగ వ్యాప్తి కోసం అలాగే మహిళల సంక్షేమం కోసం గత ప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ మహిళా కళాశాలను మరో నియోజకవర్గానికి తరలిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైనే ఉంది. Z ఒకవేళ నిజంగానే ఈ కళాశాల మరో నియోజకవర్గానికి తరలిపోయినట్లయితే ఈ జిల్లాలోని ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ విప్ నిర్లక్ష్య వైఖరి కారణమని చెప్పగా తప్పదు. 

అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ అంశంలో సంఘటితం అయితే తప్ప ఈ కళాశాల జగిత్యాల జిల్లా నుండి చేజారిపోకుండా ఉండగలదన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతుంది. చూడాలి, నడుస్తున్న కళాశాల తరలిపోతుందా? లేక జగిత్యాల జిల్లాలోనే ఉంటుందా అనేది జిల్లా ప్రతినిధులపైనే ఉంసాన్న విషయం నాయకులు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.