# Tags
#తెలంగాణ #Events #జగిత్యాల

విద్యుత్ భద్రత ప్రాణాలకు భరోసా :ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శాలియా నాయక్

జయహో భారత్ – జై జవాన్

జగిత్యాల జిల్లా : మెట్ పల్లి

విద్యుత్ లైన్లలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు బాధ్యతతో పనిచేస్తూ, ఉన్నతమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తే విద్యుత్ ప్రమాదాలను పూర్తిగా నివారించి విలువైన ప్రాణాలు రక్షించుకోవచ్చని, ఇతరుల ప్రాణాలు కూడా రక్షించవచ్చని జగిత్యాల జిల్లా ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శాలియా నాయక్ పిలుపునిచ్చారు.

విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా మెటుపల్లి మండల పరిషత్ లో ఏర్పాటు చేసిన కార్మికుల అవగాహన సదస్సులో పలు సూచనలు చేశారు.క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్మికులు హెల్మెట్, సేఫ్టీ బెల్ట్ ధరించి, ఎర్త్ డిశ్చార్జ్ రాడ్ వేసుకొని పనికి ఉపక్రమించాలని కోరారు.

తను పని చేయవలసిన ఫీడర్ పై సరియైన లైన్ క్లియర్ తీసుకోవాలని, రెండు ఫీడర్ల క్రాసింగ్ లు దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. తోటి ఉద్యోగులతో సమన్వయంతో పని చేయాలని కోరారు.

ఈ సందర్భంగా వినియోగదారులను కూడా జాగృతం చేసే బాధ్యత విద్యుత్ ఉద్యోగులు తీసుకోవాలని అన్నారు. రైతులు వ్యవసాయ పంపు సెట్లకు ఫైబర్ బాక్స్ లు అమర్చుకోవాలని, ఇంటి ఆవరణలో బట్టలు ఆరవేయడానికి దండెము కొరకు జీఐ వైరు వాడవద్దని, తడిబట్టలకు ఇన్సులేషన్ పాడైపోయిన వైరింగ్ తగిలితే షాక్ వల్ల మరణం సంభవిస్తుందని ఇందుకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ఎవరైనా షాక్ గురైతే రక్షించాలన్న ఆత్రుతతో తాకరాదని, ఏదైనా కర్ర సహాయంతో విడదీయాలని సూచించారు.

మెటుపల్లి డీఈ గంగారాం మాట్లాడుతూ
రైతులు తమ పంటలను అడవి పందుల బారి నుండి రక్షణ కొరకు అక్రమంగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తే నేరమని, చేపల వేటకు కరెంటు వాడవద్దని, ఒకవేళ అలాంటి సంఘటనలు మా దృష్టికి వస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మనుషులు, మూగ జీవాల ప్రాణాలు చాలా విలువైనవని ఉద్బోధించారు.

ఆవిష్కర్త అల్లాడి కి అభినందనలు :

విద్యుత్ కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వారు రోజువారీ పనిలో ఉపయోగించే వివిధ విద్యుత్ పరికరాల ఆవిష్కర్త అల్లాడి ప్రభాకర్ ను ఎస్ఈ శాలియా నాయక్ అభినందించారు.

స్తంభాలు ఎక్కే స్లిప్పర్లు, వంగిన స్తంబాలు సరిచేసే పరికరం, అత్యవసర మొబైల్ ట్రాన్స్ఫార్మర్ ట్రాలీ తదితర ఆవిష్కరణలు విద్యుత్ సంస్థ లో కార్మికులకు ఎంతో సహాయకారిగా ఉన్నాయని అన్నారు. గౌరవ డాక్టరేట్ పొందిన అల్లాడి ని శాలువాతో సత్కరించారు.

ఈ సదస్సు లో ఏడీఈ మనోహర్ ఏఈ లు అమరేందర్, రవి, అజయ్, వినీత్, సతీష్, సంతోష్, ప్రదీప్, శివకుమార్, సబ్ ఇంజినీర్ లు కార్మిక నాయకులు లక్ష్మణ్, రవి, సురేష్, శ్రీధర్, అనంతం మరియు సిబ్బంది పాల్గొన్నారు.