# Tags

మంథని సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పని చేయాలి :రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

మంథని :

  • ఎరువులు, విత్తనాల సరఫరా పట్ల రైతులు ఆందోళన చెందవద్దు
  • భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ శాఖ ఇన్ ఫ్రా ఏర్పాటు
  • మంథని ఆసుపత్రిలో రోగులను ఇతర ఆసుపత్రికి రిఫర్ చేయడం మానివేయాలి
  • పైలెట్ ప్రాజెక్టు క్రింద ఒక రేషన్ షాపు వద్ద సూపర్ మార్కెట్ ఏర్పాటుకు ప్రణాళిక
  • ఎస్సారెస్పీ కాల్వలలో సిల్ట్ తొలగింపు చర్యలు తీసుకోవాలి
  • మంథని పరిధిలో నూతనంగా 1417 రేషన్ కార్డులు జారీ, 12 వేల 559 సభ్యులకు అదనంగా రేషన్

* 4 మండలాల అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పని చేయాలని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.

శనివారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి శివ కిరణ్ గార్డెన్స్ లో 4 మండలాల అధికారులతో అభివృద్ధి పనుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

విద్యుత్ శాఖ, పౌరసరఫరాల శాఖ, సింగరేణి , జాతీయ రహదారుల భూ సేకరణ, వైద్య శాఖ, మిషన్ భగీరథ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, విద్యా శాఖ, నీటిపారుదల శాఖ పని తీరు సంబంధిత అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు అధికారులతో మాట్లాడుతూ…మంథని ప్రాంతంలో రైతులకు ఎరువులు విత్తనాలు స్టాక్ కొరత ఉందని దుష్ప్రచారం జరుగుతుందని, మన దగ్గర అవసరానికి మించి స్టాక్ సమృద్ధిగా అందుబాటులో ఉందని ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

భవిష్యత్తు విద్యుత్ అవసరాలను, పీక్ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని మంథని ప్రాంతంలో అవసరమైన సబ్ స్టేషన్, అదనపు విద్యుత్ లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గంగదేవిపల్లి లో సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు వారం రోజులలో శంకుస్థాపన చేయాలని, మచ్చుపేట లో 132 కేవి సబ్ స్టేషన్ ఏర్పాటు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

మంథని పట్టణంలో విద్యుత్ సరఫరా హెచ్చుతగ్గులు (ఫ్లక్చువేషన్) జరుగుతుందని, దీనిని వెంటనే ఎస్ఈ ప్రత్యేకంగా సమీక్షించి పరిష్కరించాలని అన్నారు. ప్రతి సబ్ స్టేషన్ వారిగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా సమస్యలు లేకుండా పరిష్కరించాలని, రాబోయే 3 నెలల పాటు విద్యుత్ సరఫరా చాలా కీలకమని, అధికారులు అప్రమత్తం ఉండాలని మంత్రి తెలిపారు.

సన్న బియ్యం సరఫరాకు సంబంధించి ప్రజలలో స్పందన తెలుసుకోవాలని అన్నారు. మంథని పరిధిలో నూతనంగా 1417 రేషన్ కార్డులు జారీ చేశామని, 12 వేల 559 సభ్యులకు అదనంగా రేషన్ అందుతుందని అన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి తప్పనిసరిగా పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు రేషన్ కార్డులు జారీ చేయాలని అన్నారు.

ధాన్యం కొనుగోలు అంశంలో ఎక్కడ కోతలకు ఆస్కారం ఉండడానికి వీలు లేదని అన్నారు. మంథని ప్రాంతంలో పైలేట్ ప్రాజెక్టు క్రింద రేషన్ షాపు వద్ద చిన్న సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ కు మంత్రి సూచించారు. రేషన్ షాపు లకు ప్రత్యేక గుర్తింపు ఉండేలా చూడాలని అన్నారు.

మంథని ఆసుపత్రికి వచ్చే రోగులను అధికంగా గోదావరిఖని, పెద్దపల్లి ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ పద్దతి వెంటనే మార్చుకోవాలని, ఆసుపత్రికి వచ్చే రోగులను తప్పనిసరిగా అటెండ్ కావాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మంథని ఆసుపత్రిలో బయో మెట్రిక్ విధానం ద్వారా అటెండెన్స్ నమోదు చేయాలని అన్నారు. ఆసుపత్రి పని తీరు పై ప్రత్యేకంగా వచ్చే నెల సమావేశం ఉంటుందని , పని తీరు ఇంప్రూవ్ కావాలని అన్నారు.

మంథని ప్రాంతంలో వైద్య శాఖ పరిధిలో సబ్ సెంటర్ల నిర్మాణ పనుల పురోగతి పై సమీక్ష నిర్వహించి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకుని రావాలని మంత్రి డి.ఎం.హెచ్.ఓ ను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన అన్ని పరికరాలు, సామాగ్రి అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ కు మంత్రి సూచించారు.

మంథని పట్టణ ప్రజలకు త్రాగు నీటి సరఫరా స్థిరికరణ చేసేందుకు మిషన్ భగీరథ తో పాటు పాత వ్యవస్థ పునరుద్దరణకు ప్రతిపాదనలు వారం రోజులలో అందించాలని అన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ పరిధిలో త్రాగునీటి సరఫరా కోసం ఉన్న పాత స్కీం పునరుద్ధరణకు గల అవకాశాలు పరిశీలించాలని అన్నారు.

మంథని ప్రాంతంలో ఉన్న ఎస్సారెస్పీ కాల్వలలో సిల్ట్ తొలగింపు చర్యలు తీసుకోవాలని, రాబోయే నెల రోజుల్లో యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా ఉపాధి హామీ పనుల క్రింద కాల్వల డీ సిల్టింగ్ జరగాలని అన్నారు.

మంథని ప్రాంతంలో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల డిపిఆర్ పూర్తి చేయాలని అన్నారు. అటవీ అనుమతుల మంజూరు ప్రక్రియ, ప్రాజెక్టు డిపిఆర్ రూపకల్పన సమాంతరంగా జరగాలని అన్నారు. పోడు భూముల పట్టాలు ఉన్న రైతులను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురి చేయవద్దని, ఎక్కడా కొత్తగా అటవీ నరికివేత జర్గకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో నూతన బస్సు రూటు కనీసం 10 రోజులు నడపాలని అన్నారు. మంథని డిపో బస్టాండ్ ఆధునీకరణ పనులు ప్రారంభించాలని, త్వరలోనే రవాణా శాఖ మంత్రి చే శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లో సిమెంట్, స్టీల్, ఇటుక ధరలు పెరగకుండా చూడాలని అన్నారు. మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీల ద్వారా వ్యాపారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని అన్నారు.

మంథని నియోజకవర్గం పరిధిలో ఏ.సి.డి.పి క్రింద పంచాయతీ రాజ్, ఆర్ & బీ క్రింద మంజూరు చేసిన పనుల పురోగతి వివరాలు వారం నాటికి తయారు చేసి అందించాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, సుందిళ్ళ గ్రామంలో సింగరేణి మైనింగ్ లీజు భూముల పరిహారం అర్హులకు అందించేందుకు ఎంజాయ్ మెంట్ సర్వే చేశామని, గ్రామ సభ నిర్వహించి అర్హులైన వారికి మాత్రమే పరిహారం అందేలా కృషి చేస్తున్నామని అన్నారు.

ప్రస్తుతం గ్రామ సభలో క్లియర్ చేసిన 52 మంది రైతులకు వారం రోజులలో పరిహారం అందిస్తామని అన్నారు. జాతీయ రహదారి సంబంధించి పెండింగ్ భూ సేకరణ 80 శాతం అవార్డు పాస్ చేశామని, వీరికి త్వరలోనే పరిహార చెల్లింపులు పూర్తి చేస్తామని అన్నారు.

అంతకుముందు రామగిరి, ముత్తారం, మంథని, మండలాలకు సంబంధించి 4 కోట్ల విలువ గల కళ్యాణ లక్ష్మి, సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.