# Tags

జర్నలిస్టుల పిల్లలకు వంద శాతం ఫీజు రాయితీ ఇవ్వాలి: TUWJ H-143 రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా

రాజన్న సిరిసిల్ల జిల్లా : (సంపత్ పంజా):

నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో నూటికి నూరు శాతం ఫీజు రాయితీని కల్పించాలని (టియుడబ్ల్యూజే హెచ్ 143 ) తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా కోరారు.

ఈ మేరకు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ను కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా మాట్లాడుతూ పాత్రికేయులు ఎటువంటి జీతభత్యాలు లేకుండా సమాజంలోని సమస్యలను అనునిత్యం చేరవేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేస్తున్నారన్నారు.

అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

పేద,మధ్య తరగతి వర్గాల వారే ఎక్కువమంది జర్నలిస్టులు ఉన్నారని,ప్రైవేట్ విద్యాసంస్థల్లో వారి పిల్లలకు నూటికి నూరు శాతం ఫీజు రాయితీ, నోట్ బుక్స్ ఉచితంగా జర్నలిస్టుల పిల్లలకు కల్పించి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.

అలాగే గతంలో కొందరు ప్రైవేటు విద్యాసంస్థల వారు డీఈవో ఉత్తర్వులను కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ఈసారి ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా ప్రతి విద్యా సంస్థ వారు అమలు చేసే విధంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

దీనికి కలెక్టర్, ఇన్చార్జి డిఈఓ వినోద్ కుమార్ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టు పిల్లలకు నూటికి నూరు శాతం రాయితీ, పిల్లలకు ఉచిత నోట్ బుక్స్ అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీక్, తంగళ్ళపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామాల గట్టు సీనియర్ పాత్రికేయులు గడదాసు ప్రసాద్, కొలిపాక నరసయ్య, సయ్యద్ అలీ, జితేందర్ రావు, లింగం గోపి, కొత్వాల్ శ్రీనివాస్, జిల్లా రమేష్, రాజశేఖర్,సాగర్, షేక్ రియాజ్, విష్ణు గంగాధర్,దుబ్బాక రాజు, మదు సాగర్, దేవేందర్, దేవరాజు, అనిల్ రావు,అజారొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.