# Tags

మొదటి తప్పుగా భావించి పంచాయతీ కార్యదర్శిని విధుల్లోకి తీసుకోవాలి

జగిత్యాల :

  • * రెండు గ్రామాల్లో విధులు నిర్వహించడం వల్లే ఈ తప్పిదం.

  • * పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో ఫేస్ రికగ్నైజేశన్ యాప్ లో హాజరు వేసుకున్నారనే ఆరోపణతో బుగ్గారం మండలం చందయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జగిత్యాల మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ…సస్పెన్షన్ కు గురైన పంచాయతీ కార్యదర్శి రాజన్న కు మరో గ్రామ పంచాయతీ అయిన సిరికొండ కు కూడా ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఆ సమయంలో చందయ్య పల్లిలో నిర్ణీత సమయం లోగా అటెండెన్స్ వేయాల్సి ఉండగా అక్కడి గ్రామ సహాయకునికి అటెండెన్స్ వేయమని చెప్పడం వల్ల ఈ పొరపాటు జరిగిందని వివరించారు.

ఇది కావాలని చేసిన పొరపాటు కాదని, మొదటి తప్పుగా భావించి పంచాయతీ కార్యదర్శిని విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

జూలై 1, 2 తేదీలలో సిరికొండలో విధుల్లో హాజరైన రాజన్న తన సహాయకుడికి చందయ్యపల్లిలో అటెండెన్స్ వేయమని చెప్పడం వల్ల అతనికి ఫేస్ రికగ్నేషన్ యాప్ పై అవగాహన లేకపోవడంతో పొరపాటున ముఖ్యమంత్రి ఫోటో అప్లోడ్ అయిందని వివరణ ఇచ్చారు.

గత 18 నెలలుగా గ్రామపంచాయతీలకు కేంద్ర నిధులు గాని, రాష్ట్ర నిధులు గాని రాకపోయినప్పటికీ తమ సొంత డబ్బులతో గ్రామ పంచాయతీకి సంబంధించిన అత్యవసర సేవలను అందిస్తున్నామని, గత ఆరు నెలల జీతం కూడా తమకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తాము ఖర్చుపెట్టిన బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు, పని భారం, ఒత్తిడితో పంచాయతీ కార్యదర్శులు ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా 98 శాతం మంది కార్యదర్శులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారని ఎవరో కొంతమంది చేసిన తప్పిదానికి పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థను తప్పు పట్టడం సమంజసం కాదన్నారు. గ్రామపంచాయతీ విధులతోపాటు అదనపు పనుల వల్ల కూడా పంచాయతీ కార్యదర్శులు మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా బాధ్యులు శ్రీకాంత్, సతీష్ కుమార్, రాజు, రవి తోపాటు జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.