# Tags

వృద్ధుల సంరక్షణ బాధ్యత వారసులదే,న్యాయ సహాయం కోసం లాయర్ల ఏర్పాటు : జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

రాయికల్ :

వృద్ధుల సంరక్షణ బాధ్యత వారసులదేననీ, న్యాయ సహాయం కోసం న్యాయసేవాధికార సంస్థ నిరంతరం పనిచేస్తుందనీ, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి వెల్లడించారు . 

ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని నివేదిత వృద్ధాశ్రమాన్ని సందర్శించి ప్రభుత్వ చట్టాలపై, వయోవృద్ధుల సంరక్షణ పథకాలపై అవగాహన సదస్సును శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో నిర్వహించారు.వృద్ధాశ్రమంలోని వంటశాలను,వసతి గదులను, డైనింగ్‌ హాలును,స్టోర్‌ రూమ్‌,పరిసరాలను పరిశీలించి తగు సూచనలు,సలహాలు అందించి వృద్ధుల సమస్యలను అడిగి తెలుసుకొని పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి మాట్లాడుతూ, వయోవృద్ధుల సంరక్షణ కోసం ఏర్పాటుచేసిన స్వచ్ఛంద సంస్థ స్వచ్ఛందంగా పనిచేయాలని అన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న పలువులు న్యాయమూర్తులు మాట్లాడుతూ…. అందరూ ఉండి కూడా తమ వారిని అనాధాశ్రమంలో ఉంచడం సరైన పద్ధతి కాదని అన్నారు.వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు ప్రేమతో చూసుకోవాలన్నారు.

అనాధాశ్రమంలో ఉన్న వృద్ధులకు తమ వారసుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి న్యాయ సహాయం కోసం వారానికి ఒక్కసారి ఆశ్రమానికి లాయర్లు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తామని, న్యాయసేవాధికార సంస్థ నిరంతరం పనిచేస్తుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వ వయోవృద్ధుల సంరక్షణ చట్టాలున్నాయని తల్లిదండ్రుల పేరట ఉన్న ఆస్తిని వారసులు తీసుకొని సంరక్షణలో నిర్లక్ష్యం చేస్తే స్థానిక తహసిల్దార్,ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే సంరక్షణ ఖర్చులతో పాటు వారసుల వద్ద నుండి ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు ఉందన్నారు.స్థానికంగా సమస్య పరిష్కారం కాకుంటే న్యాయ సేవ అధికార సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.

సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని అందరికీ న్యాయం చేస్తామని అన్నారు.లీగల్‌ సర్వీసెస్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 15100,తదితర అంశాలను వివరించారు. ఆశ్రమంలో మెరుగైన వసతులు,పరిసరాల పరిశుభ్ర వంటి వాటిపైన దృష్టి సారించి సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు సుగాలి నారాయణ,సీనియర్ సివిల్ జడ్జ్,న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ కే.వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ,ప్రిన్సిపల్ జూనియర్స్ సివిల్ జడ్జ్ ఆర్.లావణ్య,రెండో వ తరగతి న్యాయమూర్తులు గంప కరుణాకర్,ఏజిపి ఓం ప్రకాష్,లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ చంద్ర మోహన్,సతీష్,విజయ్ కృష్ణ,డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ డా బోనగిరి నరేష్,తహసిల్దార్ ఉదయ్ కుమార్, సిడిపిఓ వరలక్ష్మి,ఏఎస్ఐ దేవేందర్,అడ్వకేట్ లు చిట్యాల నిఖిల్,రాజేందర్,మచ్చ శేఖర్, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి,మాజీ ఎంపీపీ కాటిపెల్లి గంగారెడ్డి,మాజీ ఎంపీటీసీ కొమ్ముల రాధ ఆదిరెడ్డి,నాయకులు నీరటి శ్రీనివాస్,ఆశ్రమ నిర్వాహకులు భరత్ రెడ్డి, మహిపాల్,వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.