# Tags
#తెలంగాణ #Events #హైదరాబాద్

అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్

కరీంనగర్ :

అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ – నిస్వార్ధంగా కృషి చేశాను తప్ప భంగపాటు ఇంత మాత్రం కాదని స్పష్టం చేస్తున్న వెలిచేల రాజేందర్ రావు 

రెండు రోజుల క్రితం జరిగిన కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ గానే పలువురు భావిస్తున్నారు.

ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక బద్ధంగా వెళుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రయత్నం చేయకుండా కేవలం తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టకుండా ఏకపక్షంగా అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్యానెల్ కు సంబంధించి తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే.

ఎనిమిది సంవత్సరాల తర్వాత జరిగిన కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ముందు నుంచి ఒక ప్రణాళిక బద్ధంగా తన సామాజిక వర్గంతో కూడుకున్న అన్ని పార్టీల అభ్యర్థులను సమీకరించుకొని కర్ర రాజశేఖర్ మరోసారి చైర్మన్ పదవి దక్కించుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూటమి అభ్యర్థిగా సఫలమయ్యాయి.

 అయితే అదే ఒరవడితో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కొందరు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసి చర్చించిన తర్వాతనే, సొంతంగా ఒక ప్యానెల్ ఏర్పాటు చేసుకొని పోటీలో నిలబెట్టారు.

అంతేకాకుండా పోటీ చేస్తున్న అభ్యర్థులతో కలిసి హైదరాబాదులో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు తదితర పార్టీ పెద్దలను కలిసి పోటీలో నిలబెడుతున్నట్లు అందరినీ పరిచయం చేయించారు కూడా.

ఆ తర్వాత అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో తానే ఒక అభ్యర్థిగా ఎన్నికల వ్యవహారాన్ని అంతా తన భుజాల పైన వేసుకొని ఆర్థికపరంగా కూడా తానే భరించాడు. 

అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చలనం లేకపోగా కనీసం మద్దతు కూడా ప్రకటించకపోవడం విచారకరమని పలువురు భావిస్తున్నారు. 

ఈ బ్యాంకు పరిధిలోని జగిత్యాల శాఖ పరంగా ఇద్దరు అభ్యర్థులను పోటీలో దింపి, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ను తన అభ్యర్థులతో సహా కలిసి ప్యానెల్ కు మద్దతు కోరిన సంగతి తెలిసిందే.ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సైతం రాజేందర్ రావు ప్యానల్ కు మద్దతు పలికారు.

కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కరీంనగర్, జగిత్యాలలో ఈ ఎన్నికలకు దూరంగానే ఉంటూ పరోక్షంగా కర్ర రాజశేఖర్ కు కూటమి ప్యానెల్ కు మద్దతు పలికారు.

దీంతో అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి అనుభవం అంతగా లేని అభ్యర్థులతో ఒకవైపు, ఎన్నికల ప్రచారంలో సమయం లేకపోవడంతోపాటుగా మరియు బ్యాంకు ఓటర్లు ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా అభ్యర్థులకు సరిగా అవగాహన లేకపోవడంతో వెలిచాల రాజేందర్ రావు చేసిన కృషి, మున్నూరు కాపు సామాజిక వర్గం ముందు ఆయన ప్రయత్నాలు ఫలించలేదు.

అయినప్పటికీ రాజేందర్ రావు తన ప్యానల్ లోని అనుభవం ఉన్న ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోగలిగారు.

దీంతో కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికల ఫలితాల పట్ల కర్ర రాజశేఖర్ కూటమి ప్యానెల్ హర్షం వ్యక్తం చేస్తుండగా, వెలిచాల రాజేందర్ రావు తనవంతు ప్రయత్నం చేశానని, కాంగ్రెస్ పార్టీ ప్యానెల్ గా గెలిపించుకుంటానన్న నమ్మకంతోనే, అన్నీ తానే అయి ఎన్నికలను తన భుజ స్కందాలపై వేసుకోవడం జరిగింది తప్ప, తాను ఈ బ్యాంకు ద్వారా లబ్ధి పొందేది గానీ, ఎలాంటి స్వార్థంతో కానీ ముందు వెళ్లలేదని స్పష్టం చేశారు. 

అంతేకాకుండా తన తండ్రి స్వర్గీయ వెలిచాల జగపతిరావు వారసుడిగా అన్ని వర్గాల సంక్షేమంతో పాటు యువతకు ఉపాధి లక్ష్యంగా తన వంతు కృషి చేస్తున్నానని, నిరాడంబరంగా పార్టీ కోసం పనిచేస్తున్నాను తప్ప, రాజకీయ ప్రలోభాల వైపు వెళ్లలేదని స్పష్టం చేశారు.

అలాగే కరీంనగర్ సహకార బ్యాంకు ఎన్నికలు తనకి ఎంత మాత్రం భంగపాటు కాదని, అధికారం కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన నాయకత్వంపై నమ్మకం ఉంచి, నిర్మల భరోసా ప్యానెల్ లో పోటీ చేసిన అభ్యర్థులతో  ముందుకు వెళ్లి, నైతికంగా తాను విజయం సాధించానని వెలిచాల రాజేందర్ రావు స్పష్టం చేశారు.