యాదాద్రి : (టిపిడిఈఏ భవన్ లో ):

తెలంగాణ రాష్ట్రంలో పవర్ డిస్కంలను ఆర్థికంగా నష్టాల పేరిట బెయిల్ ఔట్ ప్యాకేజీ లు ఇచ్చి ప్రైవేట్ పరం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నదని, ఈ సంస్థలను బతికించుకోవాలంటే ప్రైవేట్ కు ధీటుగా ఉద్యోగులు మరింత కస్టపడి పనిచేయాలని, పునరుజ్జీవం కల్పించాలని నూతనంగా ఎన్నికైన రాష్ట్ర పవర్ డిప్లొమా ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు పి.బీసిరెడ్డి పిలుపునిచ్చారు.

యాదాద్రి టిపిడిఈఏ భవన్ లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో రాబోయే రెండేళ్లకు గాను అధ్యక్షుడిగా పి.బీసిరెడ్డి, సెక్రెటరీ జనరల్ గా తాజుద్దీన్ బాబా, ముఖ్య సలహాదారుగా గోవర్ధన్ రెడ్డి మరియు ఇతర కార్వవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు బీసిరెడ్డి మాట్లాడుతూ నాయకుడికి పదవి హోదా కారాదని, దాన్ని బాధ్యతగా భావించి డిప్లొమా ఇంజనీర్ల శ్రేయస్సుతో పాటు సంస్థ మనుగడకు కూడా గట్టిగా కృషి చేయాలని సూచించారు.

తదనంతరం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టి సభ్యుల ఆమోదం కోరారు. అందులో ముఖ్యమైనవి, ఓ&ఎం నుండి కన్వర్షన్ అయిన ఇన్ సర్వీసు సబ్ ఇంజనీర్లకు తదుపరి పదోన్నతికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణలో నెగెటివ్ మార్క్ పద్దతి తొలగించాలని, క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఇంజనీర్ల పనిగంటలు నిర్ధారించాలని, 2026 పిఆర్సి అమలు చేయుటలో పక్క రాష్ట్రం ఏపి పాటిస్తున్న విధానాలు తెలంగాణకు సరిపడవని అన్నారు. ఎందుకంటే తెలంగాణా విద్యుత్ రంగంలో ప్రగతిశీల రాష్ట్రమని, దీని ప్రత్యేకత బిన్నమైనదని ఉద్ఘాటించారు.

మరియు డిప్లొమా ఇంజనీర్లకు సంబంధించి ఏఏఈ నుండి ఏడీఈ పదోన్నతుల్లో ప్రస్తుత 4:1 సాధారణ నిష్పత్తిని మెంటైనబుల్ రేషియో చేయడానికి మేనేజ్మెంట్ గతంలో వేసిన కమిటీ సత్వరం నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు.
పూర్వ 10 జిల్లాల నుండి ఒక్కొక్కరిని ట్రస్టు సభ్యులను ప్రతిపాదించి కేంద్ర సంఘానికి పంపాలని, తద్వారా ట్రస్టును పటిష్టం చేసి వివిధ జిల్లాల్లో సంఘానికి ఉన్న భవనాలు, ఆస్తులు ట్రస్ట్ పరిధిలోకి తీసుకుని వద్దామని అన్నారు.
ముఖ్యంగా నాయకులు, సభ్యుల క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని, వ్యక్తులకన్నా వ్యవస్థ గొప్పదని, డిప్లొమా ఇంజనీర్ల సంఘానికన్నా ఎవరు అతీతులు కారని హెచ్చరించారు. త్వరలో రాష్ట్ర అధ్యకుడు, సెక్రెటరీ జనరల్ పదవులను క్రమశిక్షణ కమిటీ పరిధిలోకి తీసుకురావడానికి సంఘం నియమావళిలో మార్పులకు కేంద్రసంఘానికి అనుమతి కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు.
ఆర్థిక నివేదికను పూర్వ సెక్రటరీ ఫైనాన్స్ నరేష్ కుమార్ ప్రవేశపెట్టి సభ్యుల ఆమోదం పొందారు.
ఈ ఎన్నికల నిర్వహణాధికారిగా దురిశెట్టి మనోహర్ వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో నార్తర్న్ డిస్కం అద్యక్ష కార్యదర్శులు సుబ్రహ్మణ్యేశ్వర రావు, మల్లికార్జున్, మరియు సదరన్ డిస్కం శ్రీనివాస రెడ్డి, రాజా మరియు పూర్వ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మనోరంజన్ రెడ్డి లు పాల్గొన్నారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





