# Tags
#తెలంగాణ #జగిత్యాల

రాజకీయ రణరంగంలా మారిన జగిత్యాల పురపోరు…

రచయిత: ఎడిటర్: సిరిసిల్ల శ్రీనివాస్, తెలంగాణా రిపోర్టర్ దిన పత్రిక 

ఎవరు నిలదొక్కుకుంటారో, ఎవరు తలదించుతారో, జగిత్యాలను చేజిక్కించుకునేది ఎవ్వరో, 

జగిత్యాల ఓటరు గెలిపించేది ఎవ్వరినో….

హూ విల్ విన్ దిస్ గేమ్…వెయిట్ అండ్ సీ….

రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గం ముందు నుంచి ఒక రాజకీయ రణ రంగానికి వేదికగా మారుతుంది.

ఈ నేపథ్యంలో రాజకీయ రణరంగం అని ఎందుకు అనవలసి వస్తుందంటే, జగిత్యాల పురపోరులో అన్ని పార్టీల మధ్య పోటాపోటీలు ఉండాల్సింది పోయి, అధికార కాంగ్రెస్ పార్టీలో బి-ఫారం పొందని వార్డుల్లో రెబెల్స్ పోటీలో ఉండడానికి ఈ మాట అనాల్సి వస్తుంది . 

అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం ఏమిటంటే, ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ బి-ఫారం బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే చేతిలో పెట్టడం, అందుకు డిసిసి అధ్యక్షుడు సైతం ఓకే చెప్పడం, జగిత్యాల జిల్లాకు చెందిన మంత్రి లక్ష్మణ్ కుమార్ సైలెంట్ గా ఉండిపోవడంతో, కాంగ్రెస్ పార్టీ పగ్గాలు బిఆర్ఎస్ ఎమ్మెల్యే చేతిలోకి వచ్చాయి.

ఇక్కడే అసలైన రాజకీయ రణరంగం తీవ్రస్థాయికి చేరింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో 1984 నుండి దాదాపు నాలుగు దశాబ్దాల పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆరుసార్లు శాసనసభ్యులుగా, ఒక మారు ఎమ్మెల్సీగా, మంత్రిగా చేసిన సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి రాజకీయ చరమాంకంలో అనుకోని విధంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనే ఆయుధంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యే పరిస్థితులు నెలకొని, తన రాజకీయ జీవితం చరమాంకంలో ఈ విధంగా ముగుస్తుందని అనుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, పార్టీ నిర్ణయాన్ని ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. 

రాహుల్ గాంధీ తలపెట్టిన పాదయాత్రను జై బాపు – జై భీమ్ నినాదంతో చేపట్టి, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలన్న ధ్యేయంతో నిర్వహించిన పాదయాత్ర లక్ష్యం నెరవేరడం లేదని, ఇవి పార్టీ అధినేత రాహుల్ గాంధీ విధానాలను తెలంగాణ పిసిసి ధిక్కరించడమే అని బాహాటంగా విమర్శిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో అభివృద్ధి పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పనిచేస్తున్నాను అంటూ, బిఆర్ఎస్ ఎమ్మెల్యేనే నేను అంటూ స్పష్టం చేసి, బిఆర్ఎస్ పార్టీ దేనికైనా విప్ జారీ చేస్తే బిఆర్ఎస్ కే ఓటేస్తానని స్పష్టంగా మీడియా సమావేశంలో చెప్పడంతో, జగిత్యాల కాంగ్రెస్ లో మరింత అగ్గిరాజుకున్నట్టయింది.

అంతేకాకుండా బీ-ఫారంలన్నీ ముందు నుంచి ఆశించినట్టు కాకుండా, అనూహ్యంగా రాజకీయ ఎత్తుగడలతో ముందుకు వెళ్లిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతికి చిక్కడం, ముందుగా 30 బి ఫారం లు డా. సంజయ్ కుమార్ 20 బీ-ఫాంలో జీవన్ రెడ్డి వర్గానికి కేటాయిస్తున్నట్లు లిస్టు ప్రకటించారు.

అయితే దాంతో జీవన్ రెడ్డి బహిరంగంగా విమర్శిస్తున్న పరిస్థితుల్లో,  నామినేషన్ ఇవ్వాల్సిన సమయం దగ్గర పడుతున్న సమయంలో మరో నాలుగు బి ఫారం లను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య చించివేసి, సంజయ్ కుమార్ అనుచరులకి ఇవ్వడంతో జగిత్యాల రాజకీయ రణరంగం తీవ్ర స్థాయికి చేరిందని స్పష్టంగా చెప్పవచ్చు.

ఎందుకంటే జీవన్ రెడ్డి కొట్లాడి,పోట్లాడి బీసీ అభ్యర్థి డిసిసి అధ్యక్షుడు కావాలని తన అనుయాయుడిగా ఉన్నాడన్న నమ్మకంతో గాజంగి నందయ్యను ప్రతిపాదించడం అందుకు పిసిసి కూడా ఆమోదముద్ర తెలపడంతో జగిత్యాల కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి వర్గం కొంతవరకు ఉపశమనం పొందింది. 

అది ఎంతో కాలంగా నిలవలేక మున్సిపల్ ఎన్నికలు రావడంతో, జగిత్యాల పురపోరులో, డిసిసి అధ్యక్షుడు నందయ్య సైతం డాక్టర్ సంజయ్ కుమార్ వైపు మొగ్గు చూపుతుండడం, జీవన్ రెడ్డి వర్గంలో మరింత ఆగ్రహావేశాలు  తెప్పించాయి. 

ఈ ఘటనతో జగిత్యాల పురపోరు ఆసక్తికరంగా మారి అధికార కాంగ్రెస్ పార్టీలోనే పోట్లాడుకునే పరిస్థితి ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ జెండా మోయని, సభ్యత్వం లేని వారికి మరీ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ బి-ఫారంలు అందించడం అప్రజాస్వామ్యం అని గొంతెత్తుతున్నారు. 

దీంతో, ఇక ఈ జగిత్యాల పురపోరు ఏ విధంగా మళ్ళనుందో వేచి చూడాల్సిందే. ఈ ఇద్దరి మధ్య తగువులాటలో బుధవారం నాలుగవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల పర్యటన సైతం ఆగిపోవడంతో, జగిత్యాల కాంగ్రెస్ రాజకీయం రణరంగానికి వేదికగా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పరిస్థితి జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లాగానే తయారైంది. భారతీయ జనతా పార్టీలో ముందు నుంచి పార్టీ కోసం కష్టపడి, నక్సలైట్ల తూటాలను సైతం ఎదిరించిన నాయకులను సైతం పక్కన పెట్టి, తన కోటరీని స్వయంగా ఏర్పరచుకుంటూ, డా బోగా శ్రావణి భుజానా తుపాకీ ఎక్కుపెట్టిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. 

ఈ మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల మున్సిపల్ పరిధిలో పోటీలో ఉన్న పార్టీ సీనియర్ నాయకులను పక్కకు నెట్టి, కొత్త తరాన్ని ఎంపిక చేసి జగిత్యాల బిజెపిని ప్రక్షాళన చేస్తున్నామని ఆయన బాహాటంగా ప్రకటిస్తుండడం పార్టీ సీనియర్ నాయకుల్లో ఆగ్రహ,ఆవేశాలు లేవనెత్తాయి. దీంతో భారతీయ జనతా పార్టీలో సైతం రెండు వర్గాలు తయారై పురపోరు రసవత్తరంగా మారింది. 

 ఇక టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తే, ఆ పార్టీ నాయకులు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రశాంతంగా ఎంపిక చేసి పోటీలో నిలబెట్టి బీ-ఫారంలు అందజేసింది. 

కాగా బిఆర్ఎస్ పార్టీ ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా, గతంలో లాగా ఉన్న అహంకారాన్ని వదిలిపెడితేనే, కార్యకర్తల, ప్రజల, మీడియా ఫోన్ కాల్స్ కు స్పందిస్తేనే,  జగిత్యాలలో బిఆర్ఎస్ మనుగడ ఉంటుందని స్పష్టంగా పురపోరులో కనిపిస్తుంది . 

సో మొత్తానికి జగిత్యాల పురపోరు అన్ని మున్సిపాలిటీలో కంటే భిన్నంగా జగిత్యాలలో అధికార పార్టీలోనే అమీతుమీ తేల్చుకుందాం అన్నట్టుగా రాజకీయ వేదిక తయారై, ప్రజాక్షేత్రంలో ఓట్ల కోసం వాడ వాడనా ఓటర్లను అభ్యర్థిస్తూ, గెలుపు తమదే అన్న ధీమాతో ప్రచారం ముందుకు సాగిస్తూ, కాంగ్రెస్, బీజేపీ, బిఆరెస్ నాయకులు తమ తమ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు.

 ఇవన్నీ పరిస్థితులను విశ్లేషిస్తే, జగిత్యాల మున్సిపల్ ఫలితాలు అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ గా మారి పార్టీ రెబల్స్ మరియు స్వతంత్రులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదని స్పష్టమవుతుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *