# Tags
#తెలంగాణ #లైఫ్‌స్టైల్‌ #సాంస్కృతికం

అలతి అలతి పద బంధాల,భావ కవితల కమనీయ కావ్యం “నాతో నేను నీతో నేను….”

“”నా పేరు శివరంజని వకుళాభరణం హనుమకొండ నాతో నేను నీతో నేను కవితా సంపుటికి సమీక్ష”””

నాతో నేను నీతో నేను” కవితల సంపుటి రచయిత్రి, హనుమకొండ వాస్తవ్యురాలైన శ్రీమతి కొత్తపల్లి రాధిక నరేన్ కి

శుభాకాంక్షలు తెలియజేస్తూ….

శివరంజని వకుళాభరణం హనుమకొండ..

ఈ సంపుటికి కవర్ పేజీ వకుళాభరణం నారాయణ స్వామి గారు అందివ్వగా ముందుమాట శ్రీ పొట్లపల్లి శ్రీనివాసరావు గారు బిల్ల మహేందర్ గారు ముక్కెర సంపత్ గారు దాకరపు బాబురావు గారు ఆత్మీయ వచనాలు శివరంజని వకుళాభరణం గారు అందించారు.

నేను నా కవిత్వం అంటూ నేనెవరికీ అంతగా తెలియని వ్యక్తిని అంటూనే… ఈనాడు శ్రీ ముక్కెర సంపత్ గారు నిర్వహించే ఇంత పెద్ద వేదిక రవీంద్రభారతిలో తన మొదటి సంపుటిని ఆవిష్కరిస్తున్నారు….

అలతి అలతి పద బంధాల,భావ కవితల కమనీయ కావ్యం నాతో నేను నీతో నేను….
56 కవితలున్న ఈ సంపుటిలో
ఎక్కువగా జీవిత సహచరునితో అల్లుకున్న అనుబంధానికే పెద్ద పీట వేశారు…
హాయిగా ఏ సాయంకాలం వేళనో తుంటరిగాలి మేనుని తాకినప్పుడు సంసార సాగరంలో అనుకోని వరంగా వచ్చిపడే చిన్ని చిన్ని అలకల వేళలలోనో తను అల్లుకున్న కవితలన్నీ మనకు చిరు చిరుజల్లులై మురిపిస్తాయి…

కాలం కావడిలో కన్నీళ్లు మోస్తున్నా విచ్చుకున్న పత్తి పువ్వులా ముడుచుకునే టచ్ మీ నాట్ల రక్షక కవచాలు ఏర్పరచుకున్నా కూడా….. చెడుతనానికి ముల్లునై గుచ్చుతా అంటూ తన మొదటి కవిత టచ్ మీ నాటులో ధైర్యాన్ని చాటారు…

తడిచిన పొద్దులో మనిద్దరి గడియారం ముళ్ళు అంటూ కొత్త కోణాన్ని తెలియజేస్తూనే అలరింపు మాటలలో అవ్యక్తమైన వేళలన్నీ నీవవుతానంటూ గడుసుగా ప్రకటించారు.
అంతర్ముఖం అనే కవితలో మనసు మాటల యుద్ధంలో గెలవలేనప్పుడు ఆకృతి లేని ఆలోచనలు నన్ను చిలికినప్పుడు పుట్టేది కవిత్వం అంటూ గొప్పగా చెప్పారు.

నా నువ్వులో దూరాన్ని నీ నేనులో సమీపాన్ని కొలుస్తున్న రచయిత్రి “ప్రేమ ఋతువులో” పిలిచి పిలిచి విసిగిస్తూనే ఉంటా అంటూ కొత్త పద బంధాలు వాడారు .
ఆసాంతం నన్ను అనువదించుకుంటూ నీవు లేకపోతే వడలిపోయిన పువ్వునై రాలిపోతానంటూ తన ప్రేమను తెలియజేశారు.

ఆమె శీర్షిక రాసిన కవితలో నిన్నటి సాయంత్రాల్లో నడుస్తున్న కాలాన్ని దాటేసి రేపటి వెలుతురుకు సూర్యోదయం అవుతానంటూ రెండు కుటుంబాల బాధ్యతను తనదగు కోణంలో చెప్పారు.

గడిచిపోయిన రోజులకు మిగిలిపోయిన గుర్తుగా గుండెలో వెలితిని పూడ్చుకుంటూ నువ్వు వచ్చి పలకరిస్తే నన్ను నేను మరిచిపోతానంటారు.

మౌనాన్ని వరించాలని ఉంది నాలోని నాకే నా గుండె సడి వినిపించనంతగా అంటూ గొప్ప కవితా పంక్తులను క్రమబద్ధంగా అందించారు.

నువ్వు నేను సముద్రం అంటారు తన గమనాన్వేషణలో.
నీలో నేనులో కొంత ప్రణయం కొంత ప్రళయం కాలంలో కరిగిపోతుంది అయినా నీలోనే నేనని సంధ్యా ఉషస్సయి ఉదాహరించారు.
తాను ఒక యుద్ధాన్ని గెలిచింది అమ్మ కడుపు నుండే ఇక మారాల్సింది నువ్వేనంటూ సూటిగానే సూచించింది .
ప్రేమంటే నా ప్రపంచాన్ని నీ ముందు పరిచి వెలవెలబోయిన నిన్ను కొత్త రంగులతో పరిచయం చేస్తా ఇలాంటి నీకు అందని నా హృదిలేఖలెన్నో అంటూ….

మనమిద్దరమే ఉదయాల్లో అస్తమయాల్లో అన్ని ఋతువుల్లో ఏదీ తెలియని స్థితిలో అంటూ తన మానసాన్ని ఆవిష్కరించారు..

గుండె గూటిలో నాన్న శీర్షికన రాసిన కవితలో నాన్న ఎప్పుడూ వెనకే ఉండిపోతాడు ఎందుకంటే వెన్నెముకగా నిలబడతాడు కాబట్టి అన్న వాక్యం చిరస్థాయిగా నిలబడుతుంది

అమ్మ కోసం కవిత రాయని కలం అరుదేమో ఆమె అంతరంగం సముద్రమంత దాచి దాచి కురుస్తోంది. గృహసీమలో ఎన్ని సునామీలు వచ్చినా తనలోనే దాచుకొని ఇంటిని సర్గ సీమ చేస్తుందని అమ్మ గురించి గొప్పగా అభివర్ణించారు .

పగలు రేయి ,నువ్వు ఏమన్నా అనుకో నేను ఇంతే, నిన్ను నువ్వు మార్చుకో, నేను అక్కడ లేను ,స్తబ్దత శీర్షికలతో సాగిన కవితలన్నీ ప్రేమమయం అనురాగమయం.

నిన్నటినే కదా నేను మరి రేపటికి ఏమవుతాను మరపునా., గతాన్నా అంటూ అలకబూనారు.
మౌనాలన్నీ ఊసుల అలలై భావాలన్నీ వెలికితీస్తుంటే నీ ధ్యాసలో పదాలన్నీ కెరటాలై ఎగసిపడతాయి అంటూ అద్భుతమైన భావుకత్వాన్ని పండించారు .

నీపై అలిగిన మౌనక్షణాలన్నీ నన్ను క్షమించమని కక్ష కడతాయి నీ మీద ఎంత నమ్మకమో అంటూ రాసిన కవితా పంక్తి ఎంతటి చక్కని చిక్కని వాక్యం .

నేస్తం అనే శీర్షికలో పరిచయాల వర్ణమాల నువ్వైతే ఆత్మీయ కుసుమాల వాక్యాలు నేను కాలం పరుగులో కాస్త దూరమైన నీతోటి పయనాన్ని మరవలేనంటూ స్నేహామృతాన్ని కురిపించారు.

మనసును సిరగా మార్చి అక్షరాలను కుప్పగా పేర్చి భావాలకు ప్రాణం పోసి రాసే అక్షరం తనకు హాయినిస్తుందంటూనే తరలిపోతున్న బంధాల జాడను ఆవేదనలో నివేదనను చాటుతూ కొత్త ప్రపంచంలోకి సాగిపోయారు.

బంధాలు అనే కవితా శీర్షికలో కొన్ని బంధాలు రాలే నక్షత్రాలై కనబడి వెళ్లిపోతాయి కొన్ని వానలో మెరుపులై మెరిసిపోతాయి ఉన్నంతకాలం ఇంద్రధనస్సులా మదిలో మిగిలిపోతాయి అంటూ బంధాన్ని అద్భుతంగా తన కలంలో బంధిస్తూనే పడి లేచే అలన నేనైతే నన్ను దాచుకున్న సంద్రాణివి నువ్వు అంటూ ప్రేమగా ముగించారు…

చక్కని సంపుటిని అందిస్తున్న రాధికా నరేన్ పుస్తకం మంచి పేరు సంపాదించుకొని
గొప్ప రచనలు ఎన్నో తన కలం నుండి జాలువారాలని కోరుకుంటూ తనకు అభినందనల శుభాకాంక్షల మాల అందిస్తున్నాను

జై కవిసాయంత్రం
సంపతన్న సారథ్యంలో కవి సాయంత్రం కలకాలం వర్ధిల్లాలి కవన కుసుమాలు నిరంతరం వెల్లివిరియాలి…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *