#జాతీయం #తెలంగాణ #హైదరాబాద్

రామగుండం-మణుగూరు రైల్వే కోల్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రామగుండం-మణుగూరు రైల్వే కోల్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రామగుండం, మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం భూసేకరణ చేపట్టాలని ఆదేశించింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్ని కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,911కోట్లుగా ఉంది.

ప్రస్తుతం బొగ్గును కాజీపేట మీదుగా రవాణా చేస్తున్నారు. ఈ కొత్త లైన్ నిర్మాణం వల్ల దూరంతో పాటు బొగ్గు రవాణా వ్యయం కూడా తగ్గనుంది. పెద్దపల్లి–మణుగూరు రైల్వేలైన్​ 207 కిలో మీటర్ల పరిధిలో సింగరేణి కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌లను కలుపుతూ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రైల్వే లైన్​ నిర్మాణం కానుంది.

ఈ లైన్​ నిర్మాణం పూర్తయితే ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను సందర్శించడం సులువవుతుందని మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు శశిభూషణ్ కాచే ఈ సందర్భంగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ప్రయాణికులు భద్రాద్రి కొత్తగూడెం పోవాలంటే కాజీపేట మీదుగా తిరిగిపోవాల్సి వస్తోందనీ… కొత్త రైల్వే లైన్​ పూర్తయితే పెద్దపల్లి నుంచి నేరుగా ములుగు, భూపాలపల్లి మీదుగా కొత్తగూడెం వెళ్లొచ్చునని శశిభూషణ్ కాచే హర్షం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో వందల కిలోమీటర్ల దూరం తగ్గిపోనుంది. దీంతోపాటు ఈ జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *