# Tags
#సాంస్కృతికం

శ్రీ క్రోధి సంవత్సరంలో తెలంగాణలో రాజకీయంగా కొన్ని మార్పులకు అవకాశం-ప్రముఖజ్యోతిష్య పండితులు గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ (ధర్మపురి)

ఉగాది శుభాకాంక్షలతో…..

జగిత్యాల జిల్లా : 

-కేంద్రం నుంచి కూడా సరైన విధంగా ఆర్థిక సహాయం లభించడంతో ఆర్థిక సమస్యల నుంచి రాష్ట్రం బయట పడగలుగుతుందంటున్న సంతోష్ కుమార్ శర్మ

శ్రీ క్రోధి సంవత్సరం ఉగాది రోజున రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ పట్టణానికి సూర్యోదయ కాలానికి గణించబడిన జాతకాన్ని పరిశీలిస్తే….ఈ సంవత్సరం రాష్ట్రంలో రాజకీయంగా కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కల్పిస్తుందని ధర్మపురి క్షేత్రానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త, ఓం సాయి జ్యోతిష్యాలయ వ్యవస్థాపకుడు, గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ నూతన క్రోధి నామ సంవత్సర గ్రహ ఫలితాలను తెలిపారు.

శ్రీ క్రోధి సంవత్సరం ముఖ్యంగా మే నెల ఒకటికి గురువు వృషభ రాశికి మారడంతో ఈ మార్పు జరుగుతుందని శర్మ వివరించారు. 

ఈ సంవత్సరంలో పార్టీల, మరియు ఇతర సంస్థల, అధిపతుల విషయంలో మార్పులు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.  ముఖ్యంగా వ్యతిరేకుల ఒత్తిడి కారణంగా ఈ మార్పులు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

పరిపాలనపరంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందని వివరించారు.  ముఖ్యంగా ఈ లగ్నానికి 12 ఇంటిలో పాప గ్రహాలైన శని, మంగళుడు ఉండటం వల్ల ఆర్థిక సంబంధ సమస్యలు రాష్ట్రానికి కొంత మేరకు ఇబ్బంది కలిగించినప్పటికీ,  ఆదాయం పెరగటం మరియు కేంద్రం నుంచి కూడా సరైన విధంగా ఆర్థిక సహాయం లభించడంతో ఆర్థిక సమస్యల నుంచి రాష్ట్రం బయట పడగలుగుతుందని సంతోష్ కుమార్ శర్మ వివరించారు.