#హైదరాబాద్ #అంతర్జాతీయం

మూసీ పునరుజ్జీవ పథకానికి ‘చుంగేచాన్’ మార్గదర్శకం : సియోల్ లో చుంగేచాన్ హొయలు

* అంతరించిన ఉప నదికి 2005లో పునరుజ్జీవం
• మురుగు పారిన చోటే నేడు మంచినీటి ప్రవాహం

సియోల్ నగరం :

సమూలంగా మారిన నగర జీవావరణం

అది దక్షిణకొరియా రాజధాని సియోల్.. నగరం నడిబొడ్డున 10 కి. మీ. పొడవున్న చుంగేచాన్ ఉప నది పరీవాహక ప్రాంతం చుట్టూ వందల సంఖ్యలో ఆకాశ హర్మ్యాలతో అలరారుతోంది.. వేల మంది పర్యాటకులతో సందడి నెలకొంది.. గతంలో ఇక్కడ సహజ ప్రవాహం ఉండేది.. కాల క్రమంలో అదంతా ఒక మురికి కూపంగా, తర్వాత పది లేన్ల రహదారిగా, కాంక్రీటు జంగిల్ గా మారిపోయింది. ప్రస్తుతం పునరుజ్జీవం చెంది… కోటి మందికి పైగా జనాభా ఉన్న సియోల్ రూపురేఖలను సమూలంగా మార్చేసింది…..ఇది వాస్తవం.

మూసీ పునరుజ్జీవ పథకానికి అధ్యయనం :

రాష్ట్ర మంత్రులు పొంగులేటి, పొన్నం, అధికారులు, మీడియా బృందం…
• సియోల్లో ఉపనది పరిసరాలను పరిశీలించిన మంత్రులు, అధికారులు
• వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తిపై అధ్యయనం

ఒకప్పుడు మురికికూపంలా ఉన్న చుంగేచాన్ ఉపనదిలో ఇప్పుడు శుభ్రమైన మంచి నీరు ప్రవహిస్తోందని, ఇదే తీరులో హైదరాబాద్ నగరం లోని మూసీని పునరుజ్జీవం చేయాల్సిన అవసరముందని రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. మూసీ పునరుజ్జీవ పథకంలో భాగంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో తెలంగాణ బృందం దక్షిణకొరియా రాజధాని సియోల్ లో పర్యటిస్తోంది. సోమవారం అక్కడి చుంగేచాన్ తీరాన్ని, వ్యర్థాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న కేంద్రాలను బృందం సందర్శించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రకాశ్ గౌడ్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, మూసీ పరీవాహక అభివృద్ధి సంస్థ జేఎండీ గౌతమి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు, మీడియా బృందం తదితరులు ఈ పర్యటనలో ఉన్నారు.

రెండున్నరేళ్లలోనే పునరుద్ధరణ!

మేయర్ లీ ఈ ప్రాజెక్టుకు ఆరు నెలల్లో డిజైన్లు పూర్తిచేయించారు. పది లేన్ల రహదారి, నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్…. మొత్తం 14 లేన్ల హైవే, దాని కింద భారీ మురుగునీటి వ్యవస్థను తొలగించే పనులను 2003 ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఏకంగా 1.70 లక్షల కార్లు, వాహనాల రాకపోకల కోసం ప్రత్యామ్నాయంగా 36 కి.మీ. పొడవున బి.ఆర్ టి లైన్ నిర్మించారు. సుమారు 30కి పైగా వంతెనలు, దానికి రెట్టింపుగా అండర్ పాస్ లు నిర్మించారు. నడకకు పూర్తి అనుకూలంగా మార్చేశారు.

మొత్తంగా అంతర్ధానమైన ఉపనదిని 2005 సెప్టెంబరులో మళ్లీ కనిపించేలా చేశారు. ఇందుకోసం. 281 మిలియన్ డాలర్లు అంటే…మన భారతీయ కరెన్సీలో రూ.2,362 కోట్లు ఖర్చు చేశారు. దీనికి అనుబంధంగా చేపట్టిన పనులతో మరింత వ్యయమైనట్లు అంచనా. చుంగేచాన్ లో నీటిని నింపేందుకు హాన్ నది నుంచి రోజుకు 90 వేల క్యూబిక్ మీటర్లు ఎత్తిపోశారు. ఇందులోని మురుగునీటిని శుద్ధిచేసిన తర్వాతే అతి కొద్ది మోతాదులో వదులుతున్నారు. ప్రస్తుతం అర్బన్ స్ట్రీమ్ గా రూపుదాల్చిన ఈ మంచినీటి ఉపనదీ పరీవాహకమంతా వివిధ రకాల పక్షులతో జీవ వైవిధ్యానికి కేంద్రంగా మారింది. ప్రస్తుతం సియోల్ ఆకర్షణీయ నగరంగా తయారైంది.

పునరుజ్జీవం తర్వాత స్వరూపమే మారిపోయింది!

ఒకప్పుడు ఈ ఉపనది మురికినీరు, చెత్తా చెదారం, వ్యర్థాలతో అధ్వాన్నంగా, కళావిహీనంగా ఉండేది. పునరుజ్జీవం తర్వాత దీని స్వరూపమే మారిపోయింది. పర్యాటక కేంద్రంగా, కాలుష్య రహితంగా మారింది. ఈ ప్రాంతం ఎంతో అద్భుతంగా తయారైంది. సియోల్ వాణిజ్య రంగంలో రాణించడంలో కీలకంగా మారింది.

ఆరు శతాబ్దాల చరిత్ర గల చుంగేచాన్ ఉప నది…

దక్షిణ కొరియాలో ప్రసిద్ధ నదిగా పేరొందిన హాన్ కు చుంగేచాన్ ఉప నది. దీనికి ఆరు శతాబ్దాల చరిత్ర ఉంది. సియోల్ నగరాన్ని అప్పట్లో వరదలు ముంచెత్తేవి. ప్రజలను కాపాడటానికి 600 సంవత్సరాల క్రితం నాటి రాజు దీన్ని 10.9 కి.మీ. పొడవున పటిష్ఠం చేయించారు. ఇది ఒక రకంగా పెద్ద వాగు లాంటిది. సమీపంలోని సుసేన్ డాంగ్ వ్యాలీలో కురిసే వర్షపు నీరు చుంగేచాన్ ద్వారా హాన్ నదిలో, తద్వారా ఎల్లో సముద్రంలో కలుస్తుంది. మొదట్లో దీనికి గచ్చేయాన్ అని పేరుండేది. కొరియాను జపాన్ దేశం ఆక్రమించిన ప్పుడు చుంగేచాన్ గా మార్చేశారు. ఇది కొరియాలో నదులకు సహజంగా పెట్టే పేరు.

ఉప నది దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి…

కొరియా యుధ్ధం (1950-53) ముగిసిన తర్వాత దక్షిణ కొరియా పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఇదే సమయంలో సియోల్లోని చుంగేచాన్ ఉపనది తన స్వరూపాన్ని కోల్పోయింది. ఇందులో చెత్తాచెదారం వేయడం, మురుగునీటిని వదలడంతో 1960 వచ్చే నాటికి పూర్తిగా వ్యర్థాలతో నిండిపోయింది. గట్లను పేదలు ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్నారు. చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఉప నది దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది.

కళ్లకు కనిపించే ప్రవాహం…భూగర్భంలోకి మారిపోయింది…

పెరుగుతున్న రవాణా అవసరాలు, ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని సియోల్ నగరం మధ్యలో నుంచి వెళ్తున్న చుంగేచాన్పై పది లేన్ల ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేను నిర్మించారు. దీనిపై నిత్యం దాదాపు లక్షన్నర వాహనాలు ప్రయాణించేవి. మురుగు నీరు వెళ్లేలా భూగర్భంలో కాలువను ఏర్పాటు చేశారు. అంటే కళ్లకు కనిపించే ప్రవాహం… భూగర్భంలోకి మారిపోయింది. అసలక్కడ ఒక ప్రవాహం ఉండేదనే విషయమే తెలియకుండా పోయింది. వరదలు వచ్చినప్పుడు ముంపు సమస్య మొదలైంది.

మేయర్ లీ సంకల్పం…అసాధారణం…అమోఘం…

హ్యుందాయ్ కంపెనీలో ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ విభాగంలో సీఈవోగా పనిచేసిన లీ మ్యుంగ్ హక్… 2002లో సియోల్ మేయర్ గా ఎన్నికయ్యారు. అప్పటికే నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. మరోవైపు ఉత్తర, దక్షిణ నగరాల మధ్య ఆర్ధిక అంతరాలు పెరుగుతున్నాయి. నగరంలో ఆహ్లాదకరమైన ప్రాంతమే లేకుండా పోయింది. దాంతో నగరంలో పర్యావరణాన్ని మెరుగుపరచడం, సియోల్ డౌన్ టౌన్ లో జీవన పరిస్థితులను మెరుగుపర్చడం, నగర ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య అభివృద్ధిలో ఉన్న తేడాను నిర్మూలించడం, సహజ, సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించడం, కొత్త పబ్లిక్ స్పేస్ ను సృష్టించడం. ట్రాఫిక్ భద్రత, సామర్థ్యం పెంచడం లక్ష్యంగా… ఎక్స్ప్రెస్ హైవే స్థానంలో చుంగే చాన్ ఉపనదిని పునరుద్ధరించాలని సంకల్పించారు.

చుంగేచాన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధిక వ్యయంతో కూడుకున్న నదీ పునరుద్ధరణ ప్రాజెక్టుగా మారుతుందని, కొత్త నిర్మాణాలతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని కొందరు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు. పది లేన్ల ఎలివేటెడ్ ఎక్స్ ప్రెస్ హైవేను తొలగిస్తే రోడ్డు సామర్థ్యం తగ్గి ట్రాఫిక్ సమ స్యలు పెరుగుతాయని, నగర జీవనానికి అడ్డంకులు ఏర్పడతాయని హెచ్చరించారు. వ్యాపారులూ తీవ్రంగా వ్యతిరేకించారు. తాము ఇళ్లను కోల్పోతామని స్థానికులూ వాపోయారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టకుండా పునరుజ్జీవ పథకమేంటని చాలామంది వాదించారు. ఎందరు వ్యతిరేకించినా మేయర్ లీ మాత్రం పర్యావరణానికే మొదటి ప్రాధాన్యమని తేల్చిచెప్పారు. ఈ ప్రాజెక్టు చాలా వ్యయంతో కూడుకున్నదైనా, ప్రజలు ప్రతిరోజూ స్వచ్ఛమైన నీటిని చూస్తారని, సియోల్ విదేశీ పెట్టుబడులకు కేంద్రంగా మారుతుందని నమ్మ కంగా ప్రకటించారు. నాలుగేళ్లలోనే హైవేను నదీ ప్రాంతంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశారు. సియోల్ నగరానికి పరిశుభ్రమైన, ఆకర్షణీయమైన అంతర్జాతీయ నగరంగా గుర్తింపు తెచ్చారు.

ఉప నదిని ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్న, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొంటున్న 3వేల కుటుంబాలు తాము నిరాశ్రయులం అవుతామంటూ ఆందోళనకు దిగాయి. దాంతో నిర్వాసితులకు సరైన పునరావాసం కల్పిస్తామని మేయర్ లీ వారికి హామీ ఇచ్చారు. వారికి భరోసా కల్పించడానికి బాధిత ప్రాంతాల్లో సుమారు 4వేల సార్లు పర్యటన చేసి స్వయంగా మాట్లాడారు. 1000 మందికి తక్షణ పునరావాసం కల్పించారు.ఐతే ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేసిన వారందరిని పనులు ప్రారంభమయ్యే 15 రోజుల ముందు “లీ” వారిని ఒప్పించారని అక్కడి పరిశోధకులు చెపుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *