# Tags
#తెలంగాణ

వైవిధ్యమైన కవితల సమాహారం “హృదయ విరులు”-కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు నాళేశ్వరం శంకరం

కరీంనగర్, నవంబర్ 17

భిన్నమైన అంశాలతో, వైవిధ్యమైన కవితలతో కూడినది హృదయ విరులు కవితా సంపుటియని కేంద్ర సాహిత్య అకాడమీ అడ్వైజరీ బోర్డు సభ్యులు, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు నాళేశ్వరం శంకరం అన్నారు.భవానీ సాహిత్య వేదికపై వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన ఆదివారం రోజున స్థానిక ఫిలిం భవన్ లో జరిగిన సాహిత్య సభకు ముఖ్య అతిథిగా హాజరై వర్ధమాన కవయిత్రి మాంకాలి సుగుణ రచించిన హృదయ విరులు కవితా సంపుటిని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సామాజిక అంశాలు,దేశభక్తి, అనుబంధాలు, కుటుంబ సంబంధాలతో పాటు కార్మికులు,రైతులు,సైనికులు, ప్రకృతి తదితర అంశాలు కవితా సంపుటిలో చోటు చేసుకున్నాయని,తన మనసులో కలిగిన భావాలను అక్షరాలుగా కూర్చి కవితలుగా అందించిందని అన్నారు.

విశిష్ట అతిథిగా హాజరైన సినీగీత రచయిత,నటులు, గాయకులు, తెలుగు విశ్వవిద్యాలయం బంగారుపతక గ్రహీత సాదనాల వేంకటస్వామినాయుడు మాట్లాడుతూ ప్రగతిశీల భావాలతో, సామాజిక బాధ్యతతో, ప్రకృతి పట్ల ఎనలేని మమకారంతో రాసిన కవితల సమాహారమే హృదయ విరులు అని,కవులు అధ్యయనంతో తమ కవిత్వాన్ని మెరుగుపరుచుకోవాలని అన్నారు.

గౌరవ అతిథులుగా హాజరైన ముల్కనుర్ మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ హర్జిత్ కౌర్ మాట్లాడుతూ సుగుణ హృదయం నుండి విరిసిన విరులే ఈ కవితలని అన్నారు.తెలంగాణ తెలుగు భాషా సంక్షణ సంఘం

ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి కిషన్ మాట్లాడుతూ హృదయ విరులు అందరూ చదవాలని కోరుతూ కవయిత్రికి అభినందనలు తెలిపారు.కవయిత్రి పబ్బ జ్యోతిలక్ష్మి ఆహ్వానం పలికిన సభలో నీలగిరి అనిత పుస్తకాన్ని సమీక్షించారు.

కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు కొత్త అనిల్ కుమార్,తెరవే ప్రధాన కార్యదర్శి దామరకుంట శంకరయ్య, ప్రముఖ కథా రచయిత బి.వి.యన్.స్వామి,ముదుగంటి సుధాకర్ రెడ్డి,బాల సాహితీవేత్త పెందోట వెంకటేశ్వర్లు,డా.ఏదునూరి వెంకటేశ్వర్లు,బోయిని సంపత్,రాము ఇటిక్యాల్,జనగాని యుగంధర్,కోరుకంటి శశి కిరణ్మయి, యోగాచార్య సంపత్ కుమార్,పాక రాంమోహన్,తడిగొప్పుల కుమారస్వామి,వెల్ముల జయపాల్ రెడ్డి,కసిరెడ్డి జలంధర్ రెడ్డి,మానుపాటి రాజయ్య,మాసం సీమ,పెద్దిరాజు సత్యనారాయణ రాజు,నడిమెట్ల రామయ్య,రాపర్తి వెంకటేశ్వర్లు కవయిత్రి సోదరులు బాపు,బంధు మిత్రులు హాజరయ్యారు.