# Tags

యాదాద్రి జిల్లా కలెక్టర్ దత్తత విద్యార్థి భరత్ చంద్రచారికి 73% మార్కులు – పేరు నిలబెట్టావని అభినందించిన కలెక్టర్ హనుమంతరావు  

యాదాద్రి జిల్లా :

  • ఇంటికి వచ్చి సన్మానం చేస్తానన్న కలెక్టర్

ఆయన ఆలోచనలు విభిన్నం, ఆచరణాలు ఉన్నతం, సాధారణ ఉద్యోగం చేసినా, రెవిన్యూ డివిజనల్ అధికారిగా విధులు నిర్వర్తించినా, పంచాయత్ రాజ్, దేవాదాయ, సమాచార శాఖ కమిషనర్ గా ఏ ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నా తన బాధ్యతలను సక్రమంగా, నిక్కచ్చిగా నిర్వర్తిస్తూ, ప్రభుత్వపరంగా ప్రజలకు, సమాజానికి తన సేవలు అందించాలన్నదే ఆయన దృక్పథం. 

ఈనేపథ్యంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా మంత్రిప్రగడ హనుమంతరావు బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఆధ్యాత్మిక పరంగానే కాకుండా, అన్ని రంగాల్లో  ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నారు. ఆ క్రమంలో, ప్రతీ విద్యార్ధి భవిష్యత్తుకు, తల్లితండ్రుల కలలకు పునాది పదవ తరగతి.

ఈ దృష్ట్యా,“తెల్లవారుజామునే పదవ తరగతి విద్యార్థుల ఇంటి తలుపుతట్టే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం” చుట్టిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని శేరిగూడం గ్రామానికి చెందిన భరత్ చంద్రచారి అనే పదవ తరగతి విద్యార్ధి ఇంటి తలుపు తట్టాడు. ఇంట్లో తల్లి తండ్రుల ఆర్థిక పరిస్థితిని చూసి చలించారు.

దీంతో ఆ విద్యార్థి పదవ తరగతి పరీక్షలు పూర్తి అయ్యేంతవరకు ప్రతినెలా 5 వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు నిత్యవసర సరుకులను కూడా పంపిణీ చేశారు. 

పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించి తన పేరు నిలబెట్టాలని స్వయంగా భరత్ చంద్ర ఇంటికి వచ్చి మరీ వెన్ను తట్టారు.అండగా ఉంటానని హామీ ఇచ్చి ప్రోత్సాహించారు. 

ఇదిలా ఉండగా, బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో శేరిగూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్రచారి అనే ఆ విద్యార్థి 73% మార్కులతో ఉత్తమఫలితం సాధించి మాట నిలబెట్టుకున్నాడు .

పదవతరగతి ఫలితాలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ భరత్ చంద్రచారి కి ఫోన్ చేసి అభినందించారు. తనకు ఇచ్చిన మాట ప్రకారం పదవ తరగతిలో మంచి మార్కులు సాధించడం పట్ల కలెక్టర్ హనుమంతరావు సంతోషం వ్యక్తం చేశారు. 

త్వరలోనే భరత్ చంద్రచారి ఇంటికి వచ్చి సన్మానం చేస్తానని కూడా జిల్లా కలెక్టర్ ఫోన్ లో తెలిపారు. 

ఈ సందర్భంగా విద్యార్థి భరత్ చంద్ర మాట్లాడుతూ…తాను పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించడం వెనుక కలెక్టర్ సార్ ప్రోత్సహం ఉందని కృతజ్ఞతలు తెలియజేశారు.ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తనకు జిల్లా కలెక్టర్ స్వయంగా ఇంటికి వచ్చి తనను వెన్ను తట్టి ప్రోత్సహించడంతో ఆత్మస్థైర్యం పెరిగి పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించానని ఆనందంగా తెలిపారు.