# Tags

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మిక తనిఖీ

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్,sampath panja):

జిల్లాలోని పలు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల గురుకుల వసతి గృహం,పెద్దూర్ లోని మహాత్మా జ్యోతి భాపూలే వసతి గృహాలు, సిరిసిల్ల పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల వసతి గృహం, తంగళ్ళపల్లిలోని మైనార్టీ బాలికల హాస్టల్, బద్దెనపల్లి, నేరెళ్లలోని బాలికల రెసిడెన్షియల్ విద్యాలయానికి కలెక్టర్ చేరుకొని ముందుగా ఆయా హాస్టళ్ల పరిసరాలు, కిచెన్, నిలువ చేసిన ఆహార పదార్థాలు, పండ్లు తనిఖీ చేశారు.

మండేపల్లిలోని మైనార్టీ బాలుర వసతి గృహంలో సౌకర్యాలు సరిపడా లేకపోవడంతో వారికి కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన గత భవనాన్ని  వినియోగించాలని సూచించారు. పెద్దూర్, మండేపల్లిలోని ఆర్ఓ ప్లాంట్లు  రెండు రోజుల్లో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.

తాజా, నాణ్యమైన కూరగాయలు, పండ్లు నిత్యం అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహార పదార్థాలు వడ్డించాలని ఆదేశించారు.

హాస్టల్ ఆవరణ వంట గదులు తదితర పరిసరాలు కచ్చితంగా పరిశుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిసరాల పరిశుభ్రత కోసం మున్సిపల్, అలాగే పంచాయతీ అధికారులతో చర్చించాలని సూచించారు. విద్యాలయాల్లో సంక్షేమ వసతి గృహాల్లో ఎంతమంది విద్యార్థులు ఉండవచ్చు ప్రస్తుతం ఎందరున్నారో ఆరా తీశారు. వారికి సరిపడా టాయిలెట్లు, బెడ్స్, డెస్క్ లు ఉన్నాయ అని ఆ విద్యాసంస్థల బాధ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయా హాస్టళ్లలో రోజు అందిస్తున్న భోజనం పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

ఏమైనా సామగ్రి అవసరం ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మహిళా సంక్షేమ వసతి గృహాల్లో అందరూ మహిళా సిబ్బంది ఉండాలని, అలాగే పురుషుల సంక్షేమ వసతి గృహాల్లో పురుషులే ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

విద్యాలయాల్లో హాస్టల్లో పనిచేసే సిబ్బంది అంతా స్థానికంగానే ఉండాలని ఆదేశించారు. కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు నిల్వ చేసే స్టోర్ రూమ్ లలోకి కీటకాలు, ఈగలు, దోమలు రాకుండా ఎలక్ట్రిక్ మిషన్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.

కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్, డి. పి.ఆర్.ఓ. వి.శ్రీధర్, ఆయా విద్యాసంస్థల ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు.