#తెలంగాణ

ప్రగతి ప్రణాళికల రూపకల్పన కోసం సమగ్ర సర్వే : రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు

మంథని,

• సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి

• నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలి

• సహకార కేంద్ర బ్యాంక్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు

ప్రజల అభివృద్ధి , సంక్షేమానికి ప్రభుత్వం ప్రగతి ప్రణాళికల రూపకల్పన కోసం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు.

గురువారం మంథని పట్టణంలోని సత్యసాయి నగర్ లో 75 లక్షల రూపాయలతో నిర్మించనున్న కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మంథని బ్రాంచ్ నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ,
మంథని లో నూతనంగా నిర్మిస్తున్న కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ భవనం పనులు త్వరితగతిన పూర్తిచేసుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులకు మంత్రి సూచించారు.

ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రభుత్వం క్రమ పద్ధతిలో చర్యలు తీసుకుంటుందని అన్నారు. గ్యారెంటీ లను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్య, ఆరోగ్యశ్రీ పరిధి పది లక్షలకు పెంపు వంటి పథకాలను అమలు చేశామని అన్నారు.

రైతులకు 2 లక్షల వరకు ఉన్న రుణాలను పూర్తిగా మాఫీ చేస్తూ 18 వేల కోట్ల పైగా నిధులు నిధులు జమ చేశామని అన్నారు. ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ నుంచి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సన్న రకం వడ్లకు ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ప్రకటించిందని అన్నారు. గతంలో మాదిరిగా మిల్లుల వద్ద రైతులకు ఎటువంటి కోతలు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని అన్నారు.

నాణ్యమైన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయడం జరుగుతుందని, 48 గంటల వ్యవధిలో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రైతులు కూడా భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ధాన్యాన్ని ఆరబెట్టుకుని నిర్ణీత తేమశాతం వచ్చిన తరువాత కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావాలని మంత్రి కోరారు.

భవిష్యత్తులో ప్రజల కోసం ప్రణాళికల తయారు చేసేందుకు అంకెలు చాలా అవసరమని , ఇందు కోసం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అమలు చేయడం జరుగుతుందని అన్నారు. హౌస్ లిస్టింగ్ పూర్తి చేసిన తరువాత స్టిక్కర్ వేయని ఇండ్లను గుర్తించి వాటికి గల కారణాలను తెలుసుకుని చర్యలు తీసుకుంటామని అన్నారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో ప్రస్తుతం అందుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు గాని, భవిష్యత్తులో అమలు చేసే పథకాలకు ఎటువంటి సంబంధం లేదని, సర్వే వల్ల పథకాలు ప్రజలు కోల్పోతారని కొంతమంది అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని , ఇటువంటి అపోహలను ప్రజలు నమ్మవద్దని మంత్రి కోరారు.

ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కొండూరి రవీందర్ రావు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ రావు , మందని బ్రాంచ్ మేనేజర్ ఉదయ శ్రీ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *