# Tags

భగవద్గీత పై చర్చ …. అసలు భగవద్గీత అంటే ఏమిటో తెలుసా!

భగవంతుడు బోధించిన ధర్మబోధ. మరి భగవత్ బోధ అనొచ్చుకదా?
భగవద్గీత అని ఎందుకు అన్నారు?

బహుశా భగవంతుడైన శ్రీ కృష్ణడు పాట (గీతము = గీత) రూపములో అర్జునుడికి చెప్పినాడు ఏమో? అంటూ చమత్కరించాను. నీకు తెలిసి నట్లు లేదు చెబుతావిను అంటూ తన పక్కనే ఉన్న భగవద్గీత పుస్తకము చూపుతూ భగవద్గీత అంటే 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు కాదు. దీన్ని అర్థం తెలుసుకోవాలంటే సాగరమంత లోతైనది, విజ్ఞత ఉంటే అరచేతిలో ఆవ గింజంత.

ఈ పుస్తకము చూస్తుంటే ఏమి కనబడుతుంది? ఇరు పక్షాల మధ్యభాగంలో శ్రీ కృష్ణుడు రథాన్ని నిలిపి అని, ఇంక ఎదో చెప్పే లోపల… ఎక్కడ రథాన్ని నిలిపినాడు, ఇరు పక్షాల మధ్యభాగంలో కదా!! మధ్య అనేది ఒక గీత లాంటిది, అదే గీత. భగవద్గీత. అర్థము కాలేదు కదా.. ఈ గీత దాటి ముందుకు వెళ్ళి యుద్ధం చేసి విజయం సాధిస్తే, సామ్రాజ్యం సాధిస్తావు. విజయుడు అనే నీ పేరుకు తగ్గ నిజమైన శాశ్వత కీర్తిని సంపాదిస్తావు అర్జునా.

రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనం అని గీత ఇవతలే నిలబడుతావా ఆ అపకీర్తిని కుడా శాశ్వతంగా సంపాదిస్తావు అర్జునా.

అర్జునా నీవు గీత దాటేవాడివా? దాటలేని వాడవా? దాటేవాడివే అయితే అడుగు ముందుకు వేసి వెళ్ళు, నీకు అండగా నేను ఉంటాను.

భగవద్గీత సారము అంతా ఇంతే సుధా.
పక్కనే ఉన్న ఇందాక చూసిన భగవద్గీత పుస్తకము పైన ఉన్న చిత్తరువును చూసాను అంతవరకూ అవగతము కాని ఓ కొత్త సజీవ దృశ్యం గోచరించింది. నిజమే కదా అనిపించింది, నేను చెప్పేది కూడా ఇదే కదా అన్నట్లు ఆ చిత్తరువు నాతో చెప్పినట్లు అనిపించింది.

ఇది కురుక్షేత్రం యుద్ధంలోని అర్జునుడి కి మాత్రమే వర్తించదు. ఆత్మస్థైర్యం కోల్పోయి, నిస్తేజమై, నిర్వీర్యమైన నేటి సమాజంలో ఇలాంటి గీత వరకూ వచ్చి సరియైన నిర్ణయం తీసుకోలేక ముందుకా వెనక్కా అంటూ మీమాంసకు లోనయ్యే ప్రతి మానవుడికి వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ కలియుగంలో ప్రస్తుత కాలమాన పరిస్థితులలో అనుక్షణం మనం చేస్తున్నది యుద్ధమే, చదవడానికి యుద్ధం, బ్రతకడానికి యుద్ధం , దైనిక జీవతమే ఒక యుద్ధం…యుద్ధం.

విద్యార్థుల విషయానికి వస్తే తరగతులు ఉత్తీర్ణతల మద్య పరీక్షల సంగ్రామము, అందులో చదువు అనేది ఒక గీత. చదువు చెప్పే గురువు ఆ గీతను దాటించే గీతా చార్యుడు. చదివి గీత దాటి పరీక్షలకు వెళ్ళావో విజయం నీదే. గీత దాటలేను నా చాతకాదు అనే వాడికి భవిష్యత్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఇక్కడ ఇంకా వివరంగా వ్రాయవచ్చు కానీ సంక్షిప్తంగా ఇక్కడితోనే ఆపేస్తున్నాను.

అలాగే జీవితంలోనూ అంతే నీవు కోరుకొన్న / చేరాలనుకొన్న గమ్యం స్థిరంగానే ఉంటుంది ఏనాటికైనా చేరవలసింది మనమే ఎప్పటికైనా అందుకు తొలి ప్రయత్నం, మనం వేసే మొదటి అడుగు.

నీకూ, నీవు కోరుకొన్న గమ్యనికీ మద్య అవరోధాలతోటే నీ యుధం, దృఢమైన సంకల్పమే గీత . బుద్ధిబలంతో , శ్రమించి , సాధనచేస్తే నీవు కోరుకొన్న గమ్యం నీ సొత్తు. నాకు చేతకాదు అంటావా, చేతకాని వాడి లాగానే మిగిలి పోతావు.

ఏదన్నా పని, కార్యము అనుకోని వెళ్లాలనుకున్నప్పుడు భగవద్గీత పుస్తకం ఒక్క సారి చూడండి, మీ వద్ద లేదూ కళ్ళు మూసుకొని గీతా పార్థసారథి రూపురేఖలు ఊహించుకొని చూడండి మీ మీద మీకే నమ్మకము, విశ్వాసం కల్గుతుంది. గుర్తుపెట్టుకోండి ఏదన్నా పని, కార్యము అనుకోని అంటే… అది న్యాయమైన, ధర్మబద్ధమైనదై వుండాలి. దొంగ తనానికి పోతున్నాను, దోపిడికి పోతున్నాను నాకు విజయం చేకూరాలి, ఫలితాలు నాకు అనుకూలంగా ఉండాలి అనుకొంటే పొరపాటే .

న్యాయము ధర్మము అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి వ్రాస్తున్నాను న్యాయస్థానములో అంతా నిజమే చెబుతాను, అబద్ధము చెప్పను అని భగవద్గీత పుస్తకము మీద ప్రమాణం చేస్తుంటాము. అంతటి ఉత్కృష్టమైన భగవద్గీత నేడు కేవలం అర్చనలకు, జయంతికి మాత్రమే పరిమతమైంది. (మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్షంలో గీతా జయంతి ఏకాదశిని జరుపుకుంటారు. ప్రపంచములో జయంతిని జరుపుకునే ఏకైక గ్రంథం భగవద్గీత)

ఓ 40 సంవత్సరాల క్రితం మధురమైన ఘంటసాల గొంతుతో భగవద్గీత ఎదో ఒక ఇంటిలో వినబడుతూ వుండేది. అలాంటిది ఎవరు మొదలు పెట్టారో గాని నేడు ఎవరి ఇంట్లోనైనా భగవద్గీత వినబడితే ఆ ఇంట్లో ఎవరో పోయినట్లు ఉంది అని, పోనీ మనమన్నా వింటాము అంటే మన ఇంట్లోని వారే వినడానికి భయపడే స్థాయి కి భగవద్గీతను దిగజార్చారు.

భగవద్గీతకు మరలా మహర్దశ రావాలి. పిల్లలకు గీత పోటీలు పెడదాము ,బహుమతులు ఇస్తాము అంటే అది బహుమతుల దగ్గరే నిలబడి పోతుంది. నేను చిన్నపుడు మా స్కూల్ లో పెట్టిన గీతా పోటిలో ఫస్ట్ వచ్చాను, నేను సెకండ్ వచ్చాను అని చెప్పుకొంటారే తప్పా, ఏదీ ఒక శ్లోకం చెప్పు అంటే నాకు గుర్తు లేదు అనేవాళ్ళు ఎంతమంది? భగవద్గీత మునపటిలా ప్రతి ఇంటిలోనూ పెట్టుకొని వినబడేట్లు చేయండి అందుకు భగవద్గీత పుస్తకము ఉచితంగా ఇచ్చే దాని కన్నా, ఉచితంగా భగవద్గీత CD నో లేదా ఆడియో కాసేట్ పంపిణి చేయండి , పుస్తకము కన్నా అని ఎందుకు అన్నానంటే ఈ కాలంలో మొబైలులో ఫేస్ బుక్ చూసేవారుతప్పా, ఫేస్ ముందర బుక్(పుస్తకం) పెట్టుకొని చదివేవారు ఎంతమంది? పోనీ కొందరిలా పుస్తకం హస్త భూషణం లా చేతిలోన పెట్టుకోనన్నా తిరగండి అంటే అదో నామోషి. దానికితోడూ ఇప్పటి జనరేషన్ కు ఇంకో మాయ రోగం. పుట్టి పెరిగింది, పదో తరగతి వరకూ చదివిన పాఠ్యాంశాలు తెలుగులోనే అయినా బీటెక్ లు ఎంటెక్ లు చదవగానే వచ్చే ఉద్యోగాలతో లక్షలు సంపాదనలోకి వచ్చే సరికి, నాకు తెలుగు చదవటం వ్రాయడము రాదూ, ఎదో మాట్లాడుతానుకాని అని చెప్పుకోవడం ఫ్యాషన్, అదేదో స్టేటస్ అని గొప్పగా చెప్పుకొనేవారు దానిని సమర్థించే తల్లితండ్రులు ఎంతమందో? అటువంటి జనరేషన్ కు పుట్టిన మరో జనరేషన్ పరిస్థితి ప్రస్తుతం ప్రతి ఇంటిలోనూ మనం చూస్తున్నాము. పఠంనం కన్నా శ్రవణం అనేది నేటి తరానికి ముఖ్యం అని నా భావన. శ్రవణం అనేది కర్ణకింపుగానే కాక మనలోని ఒత్తిడి తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంచుతూ మనసుకు , బుద్దికి సానుకూల(పాజటివ్) శక్తిని అందచేస్తుంది.

ఓ తల్లితండ్రులారా , ఓ పెద్దలారా నేటి తరానికి మీరే గీతా చార్యులు మీ అపోహలు భయాలు పక్కన పెట్టి భగవద్గీతను వినండి వినిపించండి.

 -లక్కవరం సుధాకర్ 

(👉 source:శ్రీ వరద రాజన్ గారి (Rtd.అధికారి, కోరుట్ల) whatsup)