# Tags
#తెలంగాణ #జగిత్యాల

గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించాలి:కలెక్టర్, ఎస్ పి

జగిత్యాల 

గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించాలి-మతపరమైన సమస్యలకు తావులేకుండా ఒకరినొకరు గౌరవించుకోవాలి: కలెక్టర్, ఎస్ పి

  • గణేష్ మండపాల వద్ద శానిటేషన్ తప్పనిసరిగా చేయించాలి
  • అధికారులు, సిబ్బంది అందరూ పరస్పరం సహకారంతో విజయవంతంగా నిర్వహించాలి :సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార

గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. 

గణేష్  ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులు, మరియు మత పెద్దలతో  కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం 6-30 గంటల ప్రాంతంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రజలంతా ఐక్యమత్యంతో చేసుకోవాలని కోరారు.

ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ నిబంధన మేరకు రెండు సౌండ్ బాక్స్ లు పెట్టుకోవాలని, నిర్వహకులు ఏ రోజున నిమజ్జనం చేస్తున్నారో పోలీస్ శాఖ వారికి తెలియజేయాలని సూచించారు. ఉత్సవాలు ప్రారంభం నుంచి నిమజ్జనం అయ్యేదాకా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

గణేష్ మండపాల వద్ద ప్రతిరోజూ శానిటేషన్ నిర్వహించాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 7వ తేదీన మొదలు కానున్న వినాయక నవరాత్రి ఉత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ… జిల్లాలోని అన్ని మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా తమ మండపం, విగ్రహం ఎత్తు, ఏ రోజున నిమజ్జనం చేస్తారో వివరాలు ఇవ్వాలని సూచించారు. ఆయా తేదీల్లో విగ్రహాలను నిర్ణీత సమయానికి తరలించి, నిమజ్జనం చేసేలా అందరూ సహకరించాలని కోరారు. ప్రతి మండపం వద్ద ప్లాస్టిక్ డ్రమ్లలో నీరు, ఇసుక నిలువ ఉంచాలని సూచించారు.

ఈ నెల 15 నుండి 17 వరకు రెండు రోజులు నిమజ్జనం ఉన్నందున ఎటువంటి అవాంతరాలకు తావులేకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తామని తెలిపారు. డిజే సౌండ్స్ నిమజ్జనం ర్యాలీలో అనుమతి లేదని, డిజే సౌండ్స్ ఉండటం వల్ల కమ్యూనికేషన్ ఉండదని వివరించారు. నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చే భక్తులకు మంచినీరు సౌకర్యం కల్పించాలని సూచించారు. 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పి. రాంబాబు, గౌతమ్ రెడ్డి, డిఎస్పీ రఘుచందర్, జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి ఆర్డీఓలు మధు సుధన్, ఆనంద్ కుమార్, శ్రీనివాస్, కలెక్టరేట్ ఏ. ఓ. హన్మంత రావు, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్  అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.