స్థానిక పత్రికలపై సొంతరాష్ట్రంలో వివక్ష: WJI
* అన్యాయం జరిగితే పోరాటాలకు సిద్ధం
* హైదరాబాద్‌లో డబ్ల్యూజేఐ రాష్ట్ర సదస్సు
హైదరాబాద్:
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన స్థానిక పత్రికల యాజమాన్యాలు రాష్ట్రంలో అంతులేని వివక్షకు గురవుతున్నాయని డబ్ల్యుజేఐ రాష్ట్ర సదస్సు అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి స్థానిక పత్రికల పట్ల సానుభూతి ఉన్నప్పటికీ, వాటి సమస్యలపై సరైన ప్రతినిధ్యం వహించే విషయంలో రాష్ట్ర జర్నలిస్టులకు సుదీర్ఘకాలం ప్రాతినిధ్య వహిస్తున్నామని
చెప్పుకొంటున్న సంఘం వైఫల్యం చెందిందని ఆరోపించింది. తెలంగాణ స్థానిక పత్రికలు- యాజమాన్యాలు- అక్రిడిటేషన్లు – రేట్ కార్డులో వివక్ష… డిమాండ్ల సాధన అంశాలపై
బీఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) మంగళవారం హైదరాబాద్ నాగోల్‌లో రాష్ట్ర సదస్సు విజయవంతంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి స్థానిక పత్రికల యజమానులు, ఎడిటర్లు, పాత్రికేయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
డబ్ల్యూజేఐ గౌరవాధ్యక్షుడు నందనం కృపాకర్ అధ్యక్షత వహించిన ఈ సదస్సుకు సామాజికవేత్త, రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీమనోహర్, వీ 3 న్యూస్, విశ్వంభర పత్రికల అధినేత, పలుస్వచ్ఛంద సంస్థల నిర్వాహకుడు డాక్టర్ కాచం సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. డబ్ల్యూజేఐ అధ్యక్షుడు రాణాప్రతాప్, ఉపాధ్యక్షులు తాడూరు కరుణాకర్, అనిల్ దేశాయ్, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, కార్యదర్శులు శివనాద్రి ప్రమోద్‌కుమార్, క్రాంతి, సహ కార్య నిర్వాహక కార్యదర్శి బెజ్జంకి నరేశ్ కుమార్ తదితరులు ప్రసంగించారు.
జాతిప్రయోజనాలే లక్ష్యం కావాలి
జాతి ప్రయోజనాలే లక్ష్యంగా జర్నలిస్టులు పనిచేయాలని మురళీమనోహర్ సూచించారు. పాత్రికేయులు తమ రాతలతో దేశ ఔన్నత్యాన్ని చాటాలన్నారు. కించపరిచేలా, గొప్పదనాన్ని తగ్గించేలా కథనాలు రాయవద్దన్నారు. సమాజంలో వెలుగులు నింపే వృత్తిని స్వచ్ఛందంగా స్వీకరించిన పాత్రికేయుల జీవితాలు చీకట్లో ఉండటం బాధాకరమన్నారు. వారి సమస్యలపై పోరాడేందుకు డబ్ల్యూజేఐ ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఈ సంస్థకు అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
సంఘాలు ప్రభుత్వాలకు వత్తాసు పలకొద్దు: కాచం
డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ పాత్రికేయ సంఘాలు ప్రభుత్వాలకు వత్తాసు పలకకుండా జర్నలిస్టుల సంక్షేమం కోసమే పాటుపడాల్నారు. అప్పుడే ఆ సంఘాలకు , నాయకులకు విలువ, గౌరవం లభిస్తాయన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసే వారిలో అత్యంత ముఖ్యులు పాత్రికేయులని, వారు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. వారి సంక్షేమం కోసం డబ్ల్యూజేఐ చేసే పోరాటాలకు అండగా ఉంటానని అన్నారు. చిన్నా, పెద్ద అని కాకుండా అన్ని పత్రికలను సమంగా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సంఘాలతో నిమిత్తం లేకుండా అందరు పాత్రికేయుల సంక్షేమం కోసం డబ్ల్యూజేఐ
పాటు పడుతుందని నందనం కృపాకర్ అన్నారు. జాతీయ స్థాయిలో 17 రాష్ట్రాలలో కార్యకలాపాలు చేపట్టడమే కాకుండా జిల్లా, మండల స్థాయిలో విస్తరించిన యూనియన్ డబ్ల్యూజేఐ మాత్రమేనని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ అన్నారు.
ఆ వ్యాఖ్యలు దురదృష్టకరం
మీడియా అకాడమీ అధ్యక్షుడిగా, జర్నలిస్టుల అక్రిడిటేషన్ల మార్గదర్శకాల రూపకల్పన కమిటీ ఛైర్మన్‌గా ఉన్న వ్యక్తి, సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలో, అక్రిడిటేషన్లు అమ్మకుంటున్నారని, అవి అంగట్లో సరుకులా మారాయని వ్యాఖ్యానించడం దురదృష్టకరమని, అలాంటి వ్యక్తికి ఆ పదవుల్లో ఉండే నైతిక అర్హత లేదని రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ ఆరోపించారు. జర్నలిస్టు సమాజంలో అనైతిక విధానాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంతకాలం జర్నలిస్టులను నిర్దేశిస్తూ వచ్చిన
సంఘమే కారణమన్నది జగమెరిగిన సత్యమన్నారు.స్థానిక పత్రికల సమస్యల పరిష్కారం విషయంలో
ప్రభుత్వంతో ప్రాతినిధ్యం వహించేందుకు తమ సంఘం సిద్ధంగా ఉందని, ప్రభుత్వం ఈ సమస్యలను సానుభూతితో అర్థం చేసుకుంటుందనేనమ్మకం తమకుందన్నారు.స్థానిక పత్రికలకు ఎలాంటి అన్యాయం జరిగినా, వారితో కలిసి ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమని ప్రకటించారు.
తీర్మానాలివే…
* తెలంగాణ స్థానిక పత్రికల అక్రిడిటేషన్ల జారీ కోసం ఇంతకాలం అనుసరించిన
కేటగిరిల విధానాన్ని తొలగించిపత్రికలన్నిటిని సమదృష్టితో చూడాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు లోబడి, ఆయా పత్రికలు ప్రచురించే పేజీల ఆధారంగా
అక్రిడిటేషన్లు కేటాయించేందుకు అనువుగా మార్గదర్శకాలు రూపొందించాలని బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
* 12 పేజీలతో వెలువడే పత్రికలకుసమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయంలో కనీసం 8 అక్రిడిటేషన్లు, ప్రచురణ కేంద్రంలో రెండు అక్రిడిటేషన్లు, ప్రతి మండల కేంద్రంలో ఒకఅక్రిడిటేషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
* అలాగే 8 పేజీలతో వెలువడే పత్రికలకు ఐ అండ్ పిఆర్ కార్యాలయంలో ఆరు అక్రిడిటేషన్లతో పాటు ప్రతి మండల కేంద్రంలో పనిచేసే జర్నలిస్టుకు అక్రిడిటేషన్ సదుపాయం కల్పించాలని కోరింది.
* సీనియారిటీ, పేజీలు, సర్క్యులేషన్ ఆధారంగా స్థానిక పత్రికలకు కల్పించాల్సిన అప్ గ్రేడేషన్ విషయంలో ఏళ్ల తరబడి జరుగుతున్న జాప్యం పట్ల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడేళ్లుగా
కొనసాగుతున్న ఈ జాప్యానికి స్వస్తి పలికి, అప్ గ్రేడేషన్ ప్రక్రియ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేసింది.
* స్థానిక పత్రికల రేటు కార్డు పెంపుదలలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఎలాంటి పురోగతి లేదని, సమైక్య రాష్ట్రంతో పోలిస్తే రేటు కార్డు ధరలు మరింత తగ్గిపోయాయని ఈ అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డబ్ల్యూ జే ఐ అభిప్రాయపడింది.
* న్యూస్ ప్రింట్, ప్రింటింగ్ మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఈ పరిస్థితుల్లో స్థానిక పత్రికల యాజమాన్యాలు పత్రికలు ముద్రించడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని సమావేశం అభిప్రాయపడింది. గత పదేళ్లలో పెద్ద పత్రికల టారీఫ్ ధరలు పెంచిన ప్రభుత్వం తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చిన చిన్న పత్రికల విషయంలో చూపడం తగదని పేర్కొంది.
*ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక పత్రికలకు వర్గీకృత ప్రకటనలు, భూసేకరణ ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత పూర్తిగా నిలిపివేయడం బాధాకరమని పేర్కొంది.
స్థానిక పత్రికలు క్లాసిఫైడ్, భూ సేకరణ ప్రకటనలు కేటాయిస్తేబడ్జెట్ తగ్గడంతో పాటు, ఆమెరకు ఖజానాకు సహాయపడుతుందని తెలిపింది.
* స్థానిక పత్రికల ఎంప్యానల్మెంట్ విషయంలో ఏళ్ల తరబడి జాప్యం కొనసాగించడం తగదని, డిపిఆర్ఓ కార్యాలయాలు, సమాచార శాఖ కార్యాలయంలో పత్రికల హాజరు శాతాన్ని బట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారిఎంప్యానల్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేసింది. ఇప్పటివరకు ఎంప్యానల్మెంట్ కోసం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు అన్నింటిని తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేసింది.
* రోజురోజుకు పెరిగిపోతున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా
స్థానిక పత్రికలకు కేటాయించేప్రకటన రేట్లు సవరించాలని కోరింది. ప్రస్తుతం పది రూపాయల నుండి ఉన్న రేట్లలో మార్పు తీసుకురావలసిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
* నివేశన స్థలాల కేటాయింపు, బలహీనవర్గాల గృహ నిర్మాణ పథకాల్లో పెద్ద పత్రికల జర్నలిస్టులతో సమానంగా, స్థానిక పత్రికల జర్నలిస్టులకు వాటా ఇవ్వాలని కోరింది.
* నివేశన స్థలాల కేటాయింపు సంబంధించి జరిపే సంప్రదింపుల్లో అన్ని జర్నలిస్టు సంఘాలకు సమాన భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేసింది.
* జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలను పెంపొందించడం కోసం రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్, మీడియా, డెస్కు, వీడియో జర్నలిస్టులకు కార్యశాలలు నిర్వహించి,, వారికి ఉపయుక్తమైన సాహిత్యాన్ని ముద్రించాల్సిన బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలగిన మీడియా అకాడమీ అధ్యక్షుడు ఇతర వ్యాపకాల్లో మునిగితేలడాన్ని డబ్ల్యూజేఐ ఆక్షేపించింది.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.