# Tags
#తెలంగాణ

ఆశ-నిరాశలో ఆశావహులు

మోర్తాడ్ :

స్థానిక సంస్థల పదవులపై భారీ ఆశలు పెట్టుకున్న ఆశావాహులు ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్నారు. ఆరు మాసాల క్రితమే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం, నిర్వహణలో భాగంగా ఉపాధ్యాయులకు ఎన్నికల శిక్షణ ఇవ్వడం తదితర కార్యక్రమాలు జోరుగా సాగిన నేపథ్యంలో ఆశావావులు ఎవరికివారు వ్యూహాత్మకంగా పావులు కదుపుకున్నారు.

ప్రభుత్వం ఒక్కసారిగా ఎన్నికల ప్రక్రియ ఆపివేయడంతో వారంతా తీవ్ర నిరాశలో మునిగిన విషయం విధితమే. తాజాగా ఆగస్టు నెలాఖరులుగా స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని జరుగుతాయని ప్రచార వార్తలు రావడంతో మరోసారి ఆశావాహులు ఎన్నికల కమిషన్ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

వాస్తవానికి గతంలో పనిచేసిన ప్రజాప్రతినిధులే ఎక్కువగా ఈసారి కూడా భారీ అంచనాలు పెట్టుకుని ఎన్నికలకు సమాయత్తమవుతున్నట్లు సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ మారదన్న ప్రచారంలో భాగంగా తాజా మాజీ లే ఆశావాహులుగా రంగంలోకి దిగుతున్నట్లు స్పష్టమవుతుంది.

సర్పంచ్ పదవులు ఖాళీగా ఉండడంతో పంచాయతీలలో నిధుల లేమి సమస్య ఏర్పడి గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిన విషయం విదితమే. స్థానిక సంస్థల్లో అధికారిక పదవులు ఉంటేనే నిధులు వస్తాయన్న విషయం తెలిసిందే. సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీల పదవులు ఖాళీగా ఉండడంతో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే స్థానిక సంస్థల పదవులపై భారీ ఆశలు పెంచుకున్న ఆశావాహులు ఇప్పటినుండే వ్యూహాత్మకంగా గ్రామాలలో అంతర్గత ప్రచారం చేసుకుంటూ ఈసారి తాము బరిలో ఉంటున్న విషయాన్ని చెప్పకనే చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకే విజయం వరిస్తుందని అధికార పార్టీ నేతలు ధీమాగా ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ వ్యతిరేకత బలంగా గ్రామాల్లో కనిపిస్తుందని అందువల్ల ఈసారి మళ్లీ తమకే అధికారం చేపట్టే అవకాశం ప్రజలు కల్పిస్తారన్న నమ్మకాన్ని గులాబీ నేతలు విశ్వసిస్తున్నారు.

కేంద్రంలో మోడీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల్లో భారీ నమ్మకం తమ పార్టీ పట్ల ఏర్పడిందని, మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడంతోపాటు, ఈసారి స్థానిక సమరంలో తమనుండి ప్రత్యర్థులు గట్టి పోటీ ఎదుర్కొక తప్పదని భాజపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రామ కుడల్లలోనూ, ఆయా పార్టీలు చేపట్టే కార్యక్రమాలలోనూ ప్రస్తుతం స్థానిక సమరపు చర్చలే జోరుగా సాగుతున్నాయి.

ప్రజలు మాత్రం ఎవరు కలిసినా మా మద్దతు మీకే అన్న తీరులో వ్యవహరిస్తున్నారని, అయితే ఎవరి పక్షాన వారు నిలబడతారన్నది రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోతుంది. మొత్తానికి స్థానిక సంస్థల పదవులపై భారీ ఆశలు పెట్టుకున్న ఆశావాహులు మాత్రం ఎన్నికల ప్రకటన ఎప్పుడు వస్తుందా అంటూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు