# Tags
#తెలంగాణ #వ్యవసాయం #హైదరాబాద్

రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.. రాష్ట్ర మంత్రులు

రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.. రాష్ట్ర మంత్రులు డి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్

కరీంనగర్ :

  • రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం. 
  • రైతుల సూచనల మేరకే రైతు భరోసా అమలు చేస్తాం..
  • రైతుల అభిప్రాయాలను క్రోడీకరించి విధాన నిర్ణయం తీసుకుంటాం..
  • అతి త్వరలో పంటల బీమా పథకానికి రూపకల్పన.. 
  • ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ నంబర్ వన్ గా నిలవాలి..ఆయిల్ ఫాం సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలి..అధిక లాభాలు గడించాలి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
  • రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం..రైతు రుణమాఫీ బృహత్తర కార్యక్రమం :రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
  • రైతు రుణమాఫీ చరిత్రలో నిలిచిపోతుంది..సోనియా , రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చాం : రాష్ట్ర సాగునీటిపారుదల, పౌరసరఫరాల శాఖా మంత్రి, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి
  • ఇది రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం.. రైతుల అభిప్రాయం పరిగణనలోకి తీసుకుని రైతు భరోసా అందేలా చూస్తాం : రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • రైతుల సూచనలకు అనుగుణంగా రైతు భరోసా : రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యం : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
  • కరీంనగర్లో రైతు భరోసా అమలుపై మంత్రివర్గ ఉప సంఘం రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ చేపట్టారు.

తెలంగాణలోని రైతులందరి సూచనలు అభిప్రాయాలను క్రోడీకరించి రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతు సంక్షేమానికే తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. మా దిశగా ముందుకెళ్తున్నామని తెలిపారు. 

శుక్రవారం సాయంత్రం కరీంనగర్ బైపాస్ రోడ్ లోని వీ కన్వెన్షన్ హాల్లో  రైతు భరోసా పథకం అమలుపై ఏర్పాటు చేసిన సమావేశంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి రైతుల నుంచి మంత్రి వర్గ ఉప సంఘం అభిప్రాయాలు సేకరించింది.  ఈ సమావేశానికి జిల్లా ఇంఛార్జి మంత్రి & రాష్ట్ర నీటిపారుదల , పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ ఎమ్మెల్యేలు,  కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రుల బృందం రైతుల నుంచి అభిప్రాయం సేకరించింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు భరోసాను అందించేందుకు రైతుల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తున్నామని తెలిపారు. వారి సూచనలు అభిప్రాయాలను పరిగణనులకు తీసుకొని రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేస్తామని, వ్యవసాయం  రంగం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.  ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, ఎంత కష్టమొచ్చినా తమ ప్రభుత్వం రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. పంటల బీమా పథకం కూడా అమలు చేసేందుకు రూపకల్పన చేస్తున్నామని వెల్లడించారు. అతి త్వరలో ఈ పథకాన్ని అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. పంట నష్టపోయిన రైతులను పంటల బీమా ద్వారా సాయం అందించి ఆర్థికంగా ఆదుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వమే భీమా డబ్బులను చెల్లించి పంటల బీమా అమలు చేస్తుందని తెలిపారు. రైతులు ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.  కరీంనగర్ జిల్లాలో రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ నంబర్ వన్ గా నిలవాలని పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు గడించవచ్చని, ఇతర పంటలు అంతర పంటగా సాగు చేసుకోవచ్చని తెలిపారు. అంతర పంటలు సాగు చేసుకునేందుకు సైతం ప్రభుత్వం సహాయం అందిస్తుందని చెప్పారు. ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఎలాంటి ఆందోళన ఉండదని, ఇంటికొచ్చి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసుకుని వెళ్తారని వెల్లడించారు. సాఫ్ట్వేర్లు, కలెక్టర్లకు వచ్చే నెల జీతం లాగా రైతులకు ఆదాయం వస్తుందని, ఈ పంట సాగు పై రైతులు దృష్టి సారించాలని సూచించారు. మంచి మద్దతు ధర చెల్లించి పంటను వ్యాపారులు కొనుగోలు చేసుకుని వెళ్తారని పేర్కొన్నారు. 

100 లక్షల మెట్రిక్ టన్నుల అవసరాలకు గాను 3.9 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి మాత్రమే అవుతున్నదని తెలిపారు. ఇంకా 97 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తికి ఆయిల్ ఫామ్ సాగు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ మనమే ఎక్కువగా పండిస్తే ఆయిల్ దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. , తాను 1992 నుంచి ఈ పంటను సాగు చేస్తున్నానని తెలిపారు. అన్ని జిల్లాల్లో ఆయిల్ ఫాం సాగు చేసుకోవచ్చని, దీనిపై దృష్టి సారిస్తే ఎక్కువగా ఉత్పత్తి చేయగలిగే రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని పేర్కొన్నారు. రైతులు ఆనందంగా ఉంటేనే , రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, రైతులకు పథకాలు సక్రమంగా అందితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కఠినమైన దీక్షతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు నెరవేరుస్తుందని పేర్కొన్నారు. అందుకోసమే రెండు లక్షల రుణమాఫీ అమలు చేసి తీరుతున్నామని స్పష్టం చేశారు. 

రైతును రాజు చేయడమే లక్ష్యం..ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

తమ ప్రభుత్వం రైతును రాజు చేయడమే లక్ష్యంగా అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రైతుల సూచనల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేందుకే రైతు భరోసా పై సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వారి అభిప్రాయాలను తీసుకొని విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆరు నూరైనా రుణమాఫీ అమలు అమలు చేస్తామని చెప్పి నెరవేరుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఖజానాలో ఎంత ఇబ్బంది ఉన్నా వరంగల్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం రెండు లక్షల రుణ మాఫీ చేసిందని పేర్కొన్నారు.

31 వేల కోట్ల రూపాయల వ్యయంతో రైతుల పంట రుణాలను మాఫీ చేస్తున్నామని వెల్లడించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుంటే, ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా వారు రైతుల గురించి మాట్లాడడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గత పాలకులు 10 సంవత్సరాల కాలంలో ఏనాడు రైతుల గురించి మాట్లాడలేదని, వారి వైఖరి మార్చుకోవాలని సూచించారు. రుణమాఫీ బృహత్తర కార్యక్రమమని, రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని తెలిపారు. ఆరు నూరైనా అన్ని గ్యారంటీ పథకాలను అమలు చేసి చూపిస్తున్నామని పేర్కొన్నారు. 

రైతు రుణమాఫీ చరిత్రలో నిలిచిపోతుంది..సాగునీటిపారుదల, పౌరసరఫరాల శాఖా మంత్రి, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

రైతు రుణమాఫీ పథకం చరిత్రలో నిలిచిపోతుందని సాగునీటి, పౌరసరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పేర్కొన్నారు.  ఈ నెల 18 న ఒక్కరోజే 11 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7000 కోట్లు జమ చేసిందని పేర్కొన్నారు. భారత దేశ చరిత్రలో ఒకేసారి ఇంత స్థాయిలో ఎక్కడ రుణమాఫీ జరగలేదని పేర్కొన్నారు. సోనియా, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట తమ ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆ ప్రక్రియలో భాగంగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో తాను భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. గత పాలకులు 10 సంవత్సరాల కాలంలో 25 వేల కోట్ల రుణమాఫీ చేస్తే, తమ ప్రభుత్వం ఏడు నెలల్లో 31 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నదని తెలిపారు. రైతుల సూచనలు పరిగణనలోకి తీసుకొని రైతు భరోసా అమలు చేస్తామని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక దృష్టిసారిస్తానని తెలిపారు.

ప్రతిపక్షాల గ్లోబల్ ప్రచారాన్ని నమ్మవద్దు..రైతుల అభిప్రాయం మేరకు రైతు భరోసా అందేలా చూస్తాం..రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రైతు భరోసాపై ప్రతిపక్షాలు చేస్తున్న గ్లోబల్ ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని రెవెన్యూ, హౌసింగ్, పౌరసరపరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని వారి సూచనల ప్రకారమే రైతు భరోసా అందిస్తామని తెలిపారు. గత పాలకులు నాలుగు గోడల మధ్య కూర్చొని విధానమైన నిర్ణయాలు తీసుకునే వారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అలా కాకుండా రైతుల అభిప్రాయాలను సూచనలను తీసుకొని రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుందని పేర్కొన్నారు. నిజమైన రైతులకు పెట్టుబడి సాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఐటి దాఖలు చేసే రైతులకు కూడా రైతు భరోసా అందిస్తామని, దీనిపై ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న గ్లోబల్ ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. గతంలో లాగా ఇష్టారాజ్యంగా పెట్టుబడి సాయం అందించబోమని స్పష్టం చేశారు. 25 రోజుల్లో 31 వేల కోట్ల రుణమాఫీ చేయడం దేశంలో ఎక్కడా జరగలేదని పేర్కొన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి గత పాలకులకు లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. 

రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా రైతు భరోసా..రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

రైతుల ఆకాంక్షల కనుగుణంగా రైతు భరోసా పథకం అమలు చేస్తామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. వ్యవసాయము, రైతులకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రైతులను రాజులు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. రైతులు, రైతు సంఘాల నాయకులు, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు అందరి సూచనలు తీసుకొని రైతు భరోసాను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని పేర్కొన్నారు. ఎన్ని అవంతరాలు ఎదురైనా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రజలను పక్కదారి పట్టించడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. 

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, మానకొండూర్, పెద్దపెల్లి, రామగుండం ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, చింతకుంట విజయ రమణారావు, మక్కాన్ సింగ్  ఠాకూర్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, 

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ జా, సత్య ప్రసాద్, కోయ శ్రీహర్ష, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

శశి భూషణ్ కాచె