# Tags
#తెలంగాణ #అంతర్జాతీయం #హైదరాబాద్

దక్షిణ కొరియా పర్యటనపై ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమీక్ష 

హైదరాబాద్ :

-రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చే ఒప్పందాలకు అవకాశం

-ఐటీ, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల 11 వరకు జరగనున్న అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు సంబంధించి సమావేశాలు, కార్యక్రమాల ప్రణాళికను ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం సచివాయంలో సమీక్షించారు. 

ఈ పర్యటనకు సిఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఒక బృందం శనివారం ఉదయం బయలు దేరి వెళ్లగా మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి మరి కొందరు అధికారుల బృందం ఆదివారం అమెరికాకు బయలుదేరుతుంది. పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన లక్ష్యంగా ఈ రెండు దేశాల్లో పర్యటనలు జరుగుతాయి.

ఈ సందర్భంగా ఐటీ, హెల్త్ కేర్ /లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, తదితర రంగాలకు సంబంధించి రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చే ఒప్పందాలు చోటు

చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రతిష్టాత్మక ఒప్పందాలు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి గణనీయ ప్రోత్సాహాన్ని అందిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు సమీక్షా సమావేశంలో అన్నారు. 

నూతన ఆవిష్కరణలు, పెట్టుబడుల ప్రవాహంతో తెలంగాణా రాష్ట్రం పటిష్ట ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. వ్యాపార, పారిశ్రామిక పెట్టుడులకు అనుకూల వాతావరణాన్ని పెంపొందించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మక కార్యక్రమాలు తెలంగాణాను ప్రధాన గమ్య స్థానంగా నిలబెడుతున్నాయని శ్రీధర్ బాబు అన్నారు. 

అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలను పటిష్టపర్చడమే కాకుండా కొత్తగా పలు సంస్థలు రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రానున్నాయని మంత్రి వెల్లడించారు. నూతన పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో వేలాది కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.

మంత్రి శ్రీధర్ బాబు మార్గదర్శకంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమల అధికారుల బృందం గత ఆరునెలలగా పలు ఒప్పందాలు చేసుకుంది. వీటిని ప్రస్తుత పర్యటనలో వీటిని అధికారికంగా ప్రకటించనున్నారు.