# Tags

ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, లేదంటే ఉద్యమమే : మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ

హైదరాబాద్ :

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని జర్నలిస్టులు కనబడడం లేదా ?
  • తెలంగాణ కోసం పోరాడిన వాళ్లం. జర్నలిస్టులకోసం మరో ఉద్యమం చేస్తాం: అల్లం నారాయణ
  • ప్రమాద బీమా సొమ్ము చెల్లించండి: ఆస్కాని మారుతి సాగర్

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇచ్చి హెల్త్ పాలసీ అమలు చేయాలని మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీయూ డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో జర్నలిస్టులు పోరాడి సాధించుకున్న హెల్త్ కార్డును, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం టీయూడబ్ల్యూ జే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందే, ఉద్యమ సమయంలో తను జర్నలిస్టులకు ఇచ్చిన మాట ప్రకారం, ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డును జి ఓ 64 రూపంలో తీసుకువచ్చి కార్డులు ఇచ్చి అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో చెల్లు బాటు అయ్యేలా అమలు చేశారని అల్లం నారాయణ చెప్పారు.

కేసీఆర్ ప్రభుత్వం హాయంలో జర్నలిస్టులకు ఇచ్చిన క్యాష్ లెస్ హెల్త్ కార్డు వల్ల జర్నలిస్టులకు కోట్లాది రూపాయల వైద్య సహాయం అందిందని ఆయన గుర్తు చేశారు. అదే కార్డు ఇప్పటి వరకు నిమ్స్ వంటి హాస్పిటల్స్ లో చెల్లుతుందని అన్నారు.

సోమవారం కేబినెట్ మీటింగ్ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలో ఉద్యోగులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డు స్కీమ్ లో జర్నలిస్టుల విషయం లేక పోవడం అత్యంత బాధాకరం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు గత ప్రభుత్వం కంటే మెరుగైన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయినా జర్నలిస్టులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అన్నారు. కొత్తగా ఏమీ ఇవ్వకపోగా, ఉన్న అక్రెడిటేషన్ కార్డులలో కోత విధించడం, ఉన్న హెల్త్ కార్డును కూడా తీసివేయడం అత్యంత శోచనీయం అని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు కనబడం లేదా? అని ప్రశ్నించారు. అసలు మీ దృష్టిలో జర్నలిస్టులు ఉన్నట్టా…? లేనట్టా….? అని అల్లం నారాయణ ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు.

రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డును అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఈ హెచ్ ఎస్ మాదిరిగా ఇప్పటికే ఉన్న జె హెచ్ ఎస్ ను కూడా కొనసాగించాలన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అమలు చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జర్నలిస్టుల ఉద్యమం ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లపాటు పోరాడిన వాళ్లం, జర్నలిస్టుల ప్రయోజనాల కోసం మరోసారి పోరాడుతామని అయిన హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న టీయూ డబ్ల్యూ జే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతీ సాగర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల పై కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది అన్నారు.

ఒక వైపు అక్రెడిటేషన్ కార్డులలో కోత, మరో వైపు ఉన్న హెల్త్ కార్డును కూడా తొలగించడం దారుణం అన్నారు. గత ప్రభుత్వంలో లాగే జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డు అమలు చెయ్యాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఉద్యమిస్తారని మారుతీ సాగర్ హెచ్చరించారు.

ప్రభుత్వ ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే కోటి 20 లక్షల బీమా సొమ్ము వచ్చేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం గత ప్రభుత్వం జి ఓ నెంబర్ 22 తో జర్నలిస్టులకు, ఆటో డ్రైవర్లకు, హోమ్ గార్డులకు అమలు చేసిన 5 లక్షల ప్రమాద బీమా పాలసీని ప్రీమియం కట్టి మరీ రెన్యువల్ చేయకపోవడం దారుణమన్నారు.

ఈ విషయంలో ఇప్పటికే వారు కూడా ఆందోళన బాట పట్టారనే విషయాన్ని గుర్తు చేస్తూ వెంటనే బీమా ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో తెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, టీయూ డబ్ల్యూ జే రాష్ట్ర కోశాధికారి పి.యోగనంద్, హైదరాబాద్ నగర ఇంచార్జ్ యార నవీన్ కుమార్, టీయూ డబ్ల్యూ జే నగర కోశాధికారి బాపు రావు, కేబుల్ చానెల్స్ జర్నలిస్టుల జేఏసీ నేత కడకంచి వెంకటేష్, టీయూ డబ్ల్యూ జే నేత లాయక్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *