# Tags
#తెలంగాణ

గద్దర్ అవార్డుల కార్యక్రమం పండగలా నిర్వహిద్దాం: భట్టి

హైదరాబాద్:

తెలుగు సినిమారంగం ప్రపంచస్థాయికి ఎదగాలని, ఆ పరిశ్రమకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని ఉపముఖ్య మంత్రి భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం సచివాలయంలో గద్దర్ అవార్డుల కమిటీ సభ్యులతో ఆయన సమావేశమై చర్చించారు. సభ్యులు నర్సింగరావు, తని కెళ్ల భరణి, సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దిల్ రాజు, హరిశంకర్, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, గుమ్మడి విమల తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ‘గతంలో నంది అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేవారనీ… రాష్ట్ర విభజన తర్వాత భారాస ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టిం చుకోలేదన్నారు. తెలంగాణ అంటేనే ఆట, పాట…. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా… అంటూ సమాజాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనకు నడిపించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ అని అన్నారు. అన్ని అంశాలు పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరిట సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. సినిమా అవార్డుల ప్రదాన కార్యక్రమం గొప్ప పండగలా నిర్వహిద్దాం అన్నారు. ఏ తేదీన జరపాలనేది కమిటీ నిర్ణయం తీసుకోవాలి’ అని కోరారు.ఈ సందర్భంలో, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమీకృత గురుకుల పాఠశాలల ఆలోచన అద్భుతమైందని సినీ నిర్మాత సురేష్ బాబు డిప్యూటీ సీఎంకు అభినందనలు తెలిపారు.అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీలో ప్రత్యేకంగా యాక్టింగ్ కోర్పు ప్రవేశపెట్టాలని కమిటీ సభ్యులు కోరారు.