#తెలంగాణ #జగిత్యాల

మొబైల్ బిల్లు బకాయిపై షార్జా ఎయిర్ పోర్ట్ లో ఒకరి అరెస్ట్ – విడుదల చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి

◉ సిమ్ కార్డు కేసులో ఇరుక్కున్న గల్ఫ్ కార్మికుడు

◉ గల్ఫ్ జైలు నుంచి విడుదల చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి

◉ ఉచిత న్యాయ సహాయం కోసం అడ్వొకేట్ ను నియమించాలని విజ్ఞప్తి

జగిత్యాల జిల్లా :

పెగడపల్లి మండలం నంచెర్ల గ్రామానికి చెందిన సుంకరి శ్రీధర్ ఈనెల 17న హైదరాబాద్ కు వచ్చే క్రమంలో యూఏఈ దేశంలోని షార్జా ఏర్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ పోలీసులు అరెస్టు చేసిన సంఘటన జరిగింది.

ప్రభుత్వం ద్వారా అడ్వొకేట్ ను నియమించి శ్రీధర్ కు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) కల్పించాలని అతని తల్లి ప్రమీల సీఎం ఏ. రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం హైదరాబాద్ బేగంపేట మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో దరఖాస్తు చేశారు. ఆమె వెంట కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు ఉన్నారు. 

శ్రీధర్ పేరుపై ఉన్న పాత మొబైల్ ఫోన్ సిమ్ కార్డును ఎవరో దుర్వినియోగం చేసి 12,850 దిర్హంలు (రూ.3 లక్షలు) బిల్ చేయడం వలన ఇబ్బంది తలెత్తిందని అతని తల్లి ప్రమీల వాపోయారు. అమాయకుడైన తన కుమారున్ని షార్జా జైలు నుంచి విడిపించి ఇండియాకు తెప్పించాలని ఆమె సీఎం కు విజ్ఞప్తి చేశారు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *