#అంతర్జాతీయం #తెలంగాణ #హైదరాబాద్

పంచాంగం-నేటి విశేషం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
పంచాంగం
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 26 – 08 – 2024,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయణం – వర్ష ఋతువు,
శ్రావణ మాసం – బహుళ పక్షం,

తిథి : సప్తమి ఉ8.39 వరకు,
నక్షత్రం : కృత్తిక రా9.28 వరకు,
యోగం : ధృవం ఉ6.47 వరకు,
తదుపరి వ్యాఘాతం తె4.18 వరకు
కరణం : బవ ఉ8.39 వరకు
తదుపరి బాలువ రా7.43 వరకు,

వర్జ్యం : ఉ10.03 – 11.34,
దుర్ముహూర్తము : మ12.27 – 1.17,
మరల మ2.57 – 3.47,
అమృతకాలం. : రా7.11 – 8.42,
రాహుకాలం : ఉ7.30 – 9.00,
యమగండం : ఉ10.30 – 12.00,
సూర్యరాశి : సింహం,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 5.48,
సూర్యాస్తమయం: 6.17,

నేటి విశేషం:

శ్రీకృష్ణ జన్మాష్టమి / గోకులాష్టమి

శ్రావణ మాసంలో అన్నీ విశేషాలే, అత్యంత భక్తి భావంతో, ఆధ్యాత్మిక మార్గంలో శ్రావణమాసాన్ని జరుపు కుంటారు ముఖ్యంగా ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు , వరలక్ష్మీ వ్రతంతో పాటు మరో విశేషం కూడా ఉంది…
ఈ మాసంలోనే శ్రీ కృష్ణుని జన్మదినం శ్రీకృష్ణాష్టమి వేడుకలు…

తన లీలలతో భక్తి , జ్ఞానం, యోగం, మోక్షం గురించి ప్రపంచానికి తెలియజేసిన శ్రీకృష్ణపరమాత్మ పుట్టిన శుభదినం శ్రీ కృష్ణాష్టమి.
దీనినే కృష్ణ జన్మాష్టమి అని కూడా అంటారు.
అంతేకాదు గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతిగా కూడా అందరూ విశేషంగా జరుపుకుంటారు.

కృష్ణాష్టమి రోజు తల్లులు యశోదలుగా .. పిల్లలు కృష్ణయ్యలు , గోపికలుగా

ఆ రోజు ప్రతి ఇంట్లో తల్లులందరూ తమని తాము దేవకి, యశోదలుగా భావించుకుంటూ,తమ బిడ్డలను శ్రీకృష్ణుడి ప్రతి రూపాలుగా భావించి వేడుకలు జరుపుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని హిందువులు , కృష్ణుని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈరోజు ఎవరైతే కృష్ణుని పూజిస్తారో సకల సౌభాగ్యాలు లభిస్తాయని ప్రధానంగా నమ్ముతారు.
సంతానలేమితో బాధపడే వారు ఈ రోజు కృష్ణుని పూజిస్తే బుడిబుడి అడుగుల చిన్నారి కృష్ణుడు తమ జీవితంలోనూ అడుగుపెడతారని విశ్వసిస్తారు.

కృష్ణాష్టమి పూజా విధానమిదే

కృష్ణాష్టమి రోజు పూజా విధానంలో ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానమాచరించి , గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, పసుపు కుంకుమలతో గడపలను పూజించి కృష్ణయ్యను ఇంటిలోకి ఆహ్వానిస్తూ కృష్ణుడి పాదాలు వేస్తారు.
జన్మాష్టమి రోజున కృష్ణుని పూజించడం అంటే, చిన్న పిల్లలను ఎంత గారాబంగా చూస్తామో, ఎంత చక్కగా ముస్తాబు చేస్తామో .. అలా కృష్ణయ్యను ముస్తాబు చేయాలి. చిన్ని కృష్ణుని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి, ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో అభిషేకం చేసి, చక్కగా పట్టు వస్త్రాలు కట్టి, ఆభరణాలు పెట్టి అలంకరించాలి.
ఆపై స్వామికి తులసీ దళాలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి తులసి మాలని మెడలో వేయాలి.కృష్ణయ్యను ఊయలలో ఉంచి ఊపి లాలిపాటలతో పూజలు చేయాలి.
కృష్ణాష్టమి రోజున కృష్ణయ్యను పూజించడానికి పారిజాత పూలను వినియోగిస్తే ఎంతో మంచిదని చెప్తుంటారు. ఇక ఎవరి శక్తికొలది వాళ్ళు ప్రసాదాలను తయారుచేసుకొని కృష్ణయ్యకు నైవేద్యంగా సమర్పించాలి. కృష్ణుడికి అత్యంత ఇష్టమైన వెన్న సమర్పిస్తే ఆయన తృప్తిగా తింటాడు అని ప్రతీతి. ఆ తర్వాత ఉయ్యాలలో విగ్రహాన్ని ఉంచి లాలి పాట పాడుతూ కృష్ణయ్యను పూజించాలి. ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి.
కృష్ణాష్టమి రోజున గీతాపఠనం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు…
వెన్నదొంగకు వెన్నంటే ఇష్టం .. కృష్ణుడి పాదాలు వేసేది అందుకే…
శాస్త్రం ప్రకారం కృష్ణాష్టమి రోజు 102 రకాల పిండివంటలు చేయాలని ఆరు రకాల పానీయాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలి అని చెబుతారు అయితే తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వెన్న , పాలు , పెరుగు , బెల్లం , శనగ పప్పు వంటి వాటిని కృష్ణుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు. చిన్నారి కృష్ణయ్య ఉన్న ప్రతి ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది అన్న ఉద్దేశంతో కృష్ణుడు పాదాలను ఇంటిలోకి వస్తున్నట్టు పాద ముద్రలు వేసి ఆహ్వానిస్తారు. ఇక కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టే సంబరం , చిన్నారుల్లోనూ యువత లోనూ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది.

ఉట్టి కొట్టే సంబరం

యువతలో ఉత్సాహం….ఉట్టి కొట్టే సంబరాన్ని ఉత్తరభారతంలో దీనిని దహి హండీ అని పిలుస్తారు…
ఇంటింటికీ వెళ్లి మట్టికుండలో పెరుగు పాలు చిల్లరడబ్బులు సేకరించి దానిని ఉట్టి లో పెట్టి ఆతర్వాత పొడవైన తాడుతో కట్టి క్రిందకి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొత్తానికి ఒక్కరుగా కానీ , సమిష్టిగా కానీ ఉట్టి కొట్టే వేడుకను జరుపుకుంటారు. వసంత నీళ్ళు పోస్తూ ఉంటే యువత ఉట్టి కొట్టడానికి చూపించే ఉత్సాహం అంతా ఇంతా కాదు.కృష్ణాష్టమి రోజు ప్రతి ఇంట్లో కృష్ణయ్యలే , గోపికమ్మలే కృష్ణాష్టమి రోజున
ఏ ఇంట్లో చూసినా నల్లనయ్య రూపమే దర్శనమిస్తుంది. ప్రతి ఇంట్లోనూ బుడిబుడి అడుగులు వేసే బుడతలు, కృష్ణుడి వేషధారణలో కనిపిస్తారు. చక్కగా పంచె కట్టుకుని నిలువు నామాలు పెట్టుకొని తలపై నెమలి పింఛంతో, చేతిలో వేణువును పట్టుకుని వారు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఇక ఆడ పిల్లలైతే కృష్ణుని ఆరాధించే గోపికల్లాగా,కృష్ణుడికి ప్రియమైన రాధికలాగా చక్కని వేషధారణతో కనువిందు చేస్తారు.

కృష్ణుడి ఆలయాల్లో , ఇస్కాన్ ఆలయాల్లో ఘనంగా వేడుకలు

కృష్ణాష్టమి పర్వదినం రోజున కృష్ణుడి ఆలయంలో నిర్వహించే సంబరాలు అంతా ఇంతా కాదు.
కృష్ణాష్టమి రోజున కృష్ణయ్య ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇక కృష్ణుడి భక్తికి ప్రత్యేకమైన ఇస్కాన్ ఆలయాలలో సంబరాలు అంబరాన్ని తాకాయి.
అత్యంత భక్తిభావంతో చిన్ని కృష్ణయ్య కు నిర్వహించే పూజలు, సేవలు ప్రతి ఒక్కటి విశేషంగా నిలుస్తాయి. గోపాలుడి దేవాలయాల్లో గ్రామోత్సవం , గీతాపఠనం, ఉట్టి కొట్టడం లాంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి…

         

Leave a comment

Your email address will not be published. Required fields are marked *