# Tags
#తెలంగాణ

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు,ఇదొక నిరంతర ప్రక్రియ : రాష్ట్ర మంత్రుల వెల్లడి

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని, ఇదొక నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, జౌళి, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

శనివారం హైదరాబాద్ నుండి నూతన రేషన్ కార్డులు జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాలపై రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతి కుమారిలతో కలిసి
అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన చిట్ట చివరి వ్యక్తికి పధకాలు అందచేయు కార్యక్రమం కొనసాగుతూనే వుంటుందని, ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జాభితాలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

కుల, సామాజిక, ఆర్థిక సర్వే, పాత రేషన్ కార్డుల ఆధారంగా పేర్లు నమోదు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. వీటిల్లో ఎవరైనా పేర్లు రాని వారుంటే ఈ నెల 21వ తేది నుండి జరిగే గ్రామ సభలలో దరఖాస్తు చేసుకోవాలని మంత్రులు తెలిపారు.

దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి పధకాలు అందజేస్తామని, ఇప్పుడు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్హులైన అందరికి రేషన్ కార్డులు
అందజేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని మంత్రులు వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జగిత్యాల కలెక్టరేట్ నుండి పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత జగిత్యాల ఆర్డీవో మధుసూదన్. సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.