# Tags
#అంతర్జాతీయం #Tech #world #టెక్ న్యూస్ #తెలంగాణ

రూ.300-400 కోట్లతో మారియట్ ఇంటర్నేషనల్ సంస్థ పెట్టుబడులు : ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు

రూ.300-400 కోట్లతో మారియట్ ఇంటర్నేషనల్ సంస్థ పెట్టుబడులు : ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు

* గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు త్వరలో పరస్పర అవగాహన ఒప్పందం

* దాదాపు 25 వేల మందికి ఉపాధి అవకాశాలు

హైదరాబాద్: 

ఆతిథ్య రంగంలో ప్రసిద్ధి చెందిన ‘మారియట్ ఇంటర్నేషనల్’ సంస్థ త్వరలో తెలంగాణ రాష్ట్రంలో తమ ‘అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్-జీసీసీ)’ను నెలకొల్పనుంది. రూ.300-400 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో మారియట్ ఇంటర్నేషనల్ సంస్థ త్వరలో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపుగా 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.

డా.బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మారియట్ సంస్థ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత దాదాపు రూ.50 వేల కోట్ల మేరకు పెట్టుబడులకు సంబంధించి పలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుందని వెల్లడించారు. అవి త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయని మంత్రి తెలిపారు. “మారియట్ సంస్థ తమ జీసీసీని హైదరాబాద్ లో స్థాపించాలని నిర్ణయించిందనీ…దశలవారీగా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ పెట్టుబడులుంటాయన్నారు.

ప్రాథమిక దశలో 500 సీటింగ్ సామర్థ్యమున్న స్థలం కోసం చూస్తున్నారనీ… ఆ తర్వాత 1000 సీటింగ్ సామర్థ్యానికి విస్తరిస్తారని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.అలాగే, తెలంగాణ రాష్ట్రంలో తమ కార్యకలాపాల విస్తరణ కోసం త్వరలోనే రెండు ఫార్మా దిగ్గజ సంస్థలతో పాటు మరో 8 నుంచి 10 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుందని అన్నారు. ఇవన్నీ కార్యరూపం దాల్చితే రానున్న రెండు సంవత్సరాలలో దాదాపు 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.