తెలంగాణ ప్రభుత్వ ‘ప్రవాసీ ప్రజావాణి’ తో గల్ఫ్ వలస జీవులకు ఓదార్పు, మనో ధైర్యం
◉ గల్ఫ్ కార్మికులకు కష్టమొస్తే… ఇక్కడ హైదరాబాద్ లో చెప్పుకోవచ్చు !
◉ భారత విదేశాంగ శాఖతో… తెలంగాణ ప్రభుత్వం సమన్వయం
(మంద భీంరెడ్డి)
విదేశాల్లో పనిచేసే మన కార్మికుల బాధలను వారి కుటుంబ సభ్యుల ద్వారా హైదరాబాద్ బేగంపేట లోని ప్రజాభవన్ లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో విన్నవించుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. 2024 సెప్టెంబర్ 27న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్న ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోనున్నది.
గల్ఫ్ తో పాటు ఇతర దేశాలలో ఉన్న భారతీయులు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇండియాలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని భారత ప్రభుత్వ దేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను, విదేశాల లోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదించదానికి సరైన మార్గదర్శనం లేక దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు.
ఇలాంటి ప్రవాసి కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు మధ్యన ఒక వారధిలాగా పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది.
విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు అందించే దౌత్య సంబంధమైన సేవలను వేగవంతం చేయడానికి ‘ప్రవాసీ ప్రజావాణి’ ఉపయోగపడుతుంది.
వేతన బకాయిలు (సాలరీ డ్యూస్), యజమానితో సమస్యలు (స్పాన్సర్ ప్రాబ్లం), ఉద్యోగ ఒప్పంద సమస్య (కాంట్రాక్టు ప్రాబ్లం), పరిహారం (కాంపెన్సేషన్), కార్మికులను ఇబ్బంది పెట్టడం (వర్కర్ అబ్యూస్), విదేశంలో జైలు పాలయినప్పుడు (ఇంప్రిజండ్ అబ్రాడ్), మృతదేహాలను స్వదేశానికి రవాణా చేయడం (మోర్టల్ రిమేన్స్), స్వదేశానికి వాపస్ పంపడం (రిపాట్రియేషన్), తప్పిపోయిన / జాడ తెలియని వారి ఆచూకి తెలుసుకోవడం (వేర్ అబౌట్స్ అన్నోన్), వివాహ సంబంధ వివాదాలు (మారిటల్ డిస్పూట్) లాంటి ఫిర్యాదులు, విజ్ఞప్తులు నమోదు చేసుకోవచ్చు.
రిక్రూటింగ్ ఏజెంట్ల మోసాల గురించి పోలీస్ శాఖ, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పిఓఈ) ల సహాయం తీసు కోవచ్చు.
ప్రవాసులు వారి కుటుంబ సభ్యులు సహాయం కోసం, సమాచారం కోసం 24 గంటలు పనిచేసే భారత ప్రభుత్వ హెల్ప్ లైన్ (టోల్ ఫ్రీ) నెంబర్ 1800 11 3090 లేదా +91 11 4050 3090 కు కాల్ చేయవచ్చు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.