# Tags
#తెలంగాణ #జగిత్యాల

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పగడ్బందీగా చేపట్టాలి:అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత


జగిత్యాల.

కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలి

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పగడ్బందీగా చేపట్టాలని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని అలసత్వం వహించకూడదని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత నిర్వాహకులకు సూచించారు.


సోమవారం జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్ మరియు ధర్మారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లత వారితో మాట్లాడుతూ, కొనుగోలు ప్రక్రియ చాలా పగడ్బందీగా జరగాలని, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.

రవాణా, గోనె సంచుల విషయంలో ఎక్కడ పొరపాటు దొర్లినా వెంటనే సమస్యను అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో స‌న్న‌, దొడ్డు రకం ధాన్యం 17 శాతం తేమ ఉన్నా కొనాల్సిందేనని స్పష్టం చేశారు. ధాన్యం తూకమైన వెంట‌నే రైతుకు ర‌సీదు ఇవ్వాల‌ని, ఆ త‌ర్వాత ధాన్యం త‌ర‌లింపు విష‌యంలో రైతుకు ఎలాంటి సంబంధం ఉండ‌ద‌ని, మిల్లుకు త‌ర‌లించే బాధ్యత పౌర స‌ర‌ఫ‌రాల, వ్యవ‌సాయ‌ శాఖ అధికారులదేన‌ని స్పష్టం చేశారు.

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని అన్నారు. రైస్ మిల్లుల వద్ద ఎటువంటి జాప్యం లేకుండా దిగుమతి అయ్యేలా చూడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ తహసిల్దార్ , సివిల్ సప్లై అధికారులు, సెంటర్ ఇంచార్జులు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.