# Tags

జనవరి 11న హన్మకొండలో ఓసి ల సింహగర్జన సభను విజయవంతం చేయాలి : ఓసి సంక్షేమసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు 

జగిత్యాల :

హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జనవరి 11న లక్ష మందితో, రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిల సంఘాల తో ఏర్పడిన రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి ఓసి ల సింహగర్జన సమరభేరి సభను జయప్రదం చేయాలని కోరుతూ, ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తో పాటు పలువురు ఓసి ఐకాస రాష్ట్ర నాయకులు పిలుపు నిచ్చారు.

జనవరి 11న వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన ఓసి ల సింహగర్జన సభ ఏర్పాట్లపై సోమవారం మధ్యాహ్నం 12-30 గంటల ప్రాంతంలో జగిత్యాల పద్మనాయక మినీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జగిత్యాల జిల్లా స్థాయి ఓసి ఐకాస నాయకుల సన్నాహక సమావేశంలో రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిల సంఘాల నాయకులు హాజరయ్యారు. 

ఈసందర్భంగా ఓసి ల సింహగర్జన సమరభేరి సభ కు సంబంధించిన గోడ ప్రతులను, కరపత్రాలను సమావేశంలో ఐకాస నాయకులు ఆవిష్కరించారు. 

ఈ సమావేశంలో ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నం కిషన్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు చీటి శిరీష తో పాటు పాత్రికేయులు సిరిసిల్ల శ్రీనివాస్, చీటి శ్రీనివాస్ రావు, పలు సంఘాల ప్రతినిధులు కొప్పెర వెంకట్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, బద్దం నారాయణ రెడ్డి, అయిల్నేని సాగర్ రావు,వేణుగోపాల్రావు, వొద్దినేని పురుషోత్తం రావు, చీటి సంతోష్ రావు, వెంకటేశ్వర్ రావు, అయిలినేని స్వప్న, పుల్లూరి సత్యనారాయణ, మహంకాళి రాజన్న, సిరిసిల్ల రాజేందర్ శర్మ, పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలాడి రామారావు మాట్లాడుతూ ఓసిలందరూ ఐకమత్యంతో ఉంటేనే తమ హక్కులు కాపాడుకోగలమని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై రాజకీయ పబ్బo కోసం కొన్ని దుష్ట శక్తులు చేస్తున్న అసత్య ప్రచారాలు, పన్నుతున్న కుట్రలను సాగనువ్వబోమని హెచ్చరించారు.

ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు పలు డిమాండ్లను ఓసి ల సింహగర్జన సభ ద్వారా ముందుంచబోతున్నామన్నారు. 

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ రాష్ట్ర స్థాయిలో చట్ట బద్దత గల ప్రత్యేక ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఓసి విద్యార్థులకు టెట్ రాత పరీక్ష అర్హత మార్కులను 90 నుంచి 70 కి తగ్గించాలి. ఈడబ్లూఎస్ అభ్యర్థులకు విద్యా ఉద్యోగ పోటీ పరీక్షలలో వయో పరిమితిని పెంచాలని, ఈడబ్లూఎస్ సర్టిఫికెట్ జారీకి ఎలాంటి షరతులు లేకుండా 5 ఏండ్ల కాలపరిమితి కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారితోనే వెంటనే భర్తీ చేయాలని, ఈడబ్లూఎస్ సర్టిఫికెట్ జారీకి వార్షిక ఆదాయ పరిమితిని 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు నిరుపేద ఓసి విద్యార్థులకు వర్తింప చేయాలనే డిమాండ్ల తో జనవరి నెల 11 న లక్ష మంది ఓసి సామాజిక వర్గీయుల తో రాష్ట్ర స్థాయి ఓసి ల సింహగర్జన సభను నిర్వహిస్తున్నామన్నారు.

హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్నామని పార్టీలకతతంగా రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ కమ్మ, మార్వాడి లందరూ పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పోలాడి రామారావు, ఐకాస నాయకులు కోరారు.