# Tags

ధర్మపురి ప్రజల నిజమైన దీపావళి పండుగ, డిగ్రీ కళాశాల మంజూరుయే : రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

ధర్మపురి :

దీపావళి పర్వదినం సందర్భంగా సోమవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని, దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ధర్మపురి ప్రజలకు శుభవార్తను అందించారు.

“ఈరోజే ధర్మపురి ప్రజల నిజమైన దీపావళి పండుగ. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డిగ్రీ కళాశాల మంజూరు కావడం ధర్మపురి యువత కొత్త భవిష్యత్తుకు దిశ చూపుతుంది. ఇకపై ఉన్నత విద్య కోసం ఇతర పట్టణాలకు వలస అవసరం ఉండదు” అని మంత్రి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు , ధర్మపురి ప్రజల తరఫున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

👉 విద్యా రంగ అభివృద్ధికి ప్రాధాన్యం:

“ప్రజల కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి విద్య, ఉపాధి రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం.

ధర్మారం మండలంలో ఐటీఐ కళాశాల నిర్మాణానికి భూమిపూజ ఇప్పటికే నిర్వహించాం.

నేరేళ్ల గ్రామం వద్ద సుమారు ₹200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టబోతున్నాం.

ఎందరో మేధావులు, కవులు, వేదపండితులను తీర్చిదిద్దిన శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాలను పునఃప్రారంభించాం .

అదనంగా, ధర్మపురి ప్రాంత యువతను పోటీ పరీక్షలకు సిద్ధం చేయడానికి యూత్ ట్రైనింగ్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, ఇ-క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

👉 ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

ఎల్లంపల్లి ప్రాజెక్టు భూసేకరణ బాధితులకు సుమారు ₹17 కోట్ల పరిహారం ఇప్పటివరకు అందజేశామని మంత్రి తెలిపారు.
“గత పదేళ్లలో అధికారంలో ఉన్నవారు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టలేదు. కానీ మా ప్రభుత్వం మాత్రం ప్రజల ఆశలు నెరవేర్చే పరిపాలనకు కట్టుబడి ఉంది. సంక్షేమమే మా ధ్యేయం” అని అన్నారు.

“సంక్షేమం, సమగ్రాభివృద్ధి, సమానత్వం ఇవే కాంగ్రెస్ ప్రభుత్వ మూడుప్రధాన స్తంభాలు. ప్రజలకు వాస్తవ మార్పు కనిపించేటట్లు కృషి చేస్తున్నాం” అని పేర్కొన్నారు.