# Tags
#తెలంగాణ #హైదరాబాద్

ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అందుకున్న జగిత్యాల అధ్యాపకులు

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, అధ్యాపకులు డాక్టర్ తత్వాది ప్రమోద కుమార్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఉన్నత విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి దేవసేన సమక్షంలో అందుకున్నారు.

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ తత్వాది ప్రమోద కుమార్ ఈ సంవత్సరం ఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపికైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో… సెప్టెంబర్ 5 గురువారం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై, ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయ, అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఉన్నత విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి దేవసేన సమక్షంలో అందుకున్నారు.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని తక్కల్లపల్లి గ్రామంలో జన్మించిన ప్రమోదకుమార్ మెట్ పల్లి , కోరుట్ల లో డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేసారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం ఏ తెలుగు పట్టా సంపాదించారు. ఆ తర్వాత తిరుపతి వేంకట కవుల సాహిత్యం “పాండవ విజయము – దృశ్య కావ్య కళ” అనే అంశంపై ఆచార్య ఎల్లూరి శివారెడ్డి పర్యవేక్షణలో సిద్ధాంత వ్యాసం సమర్పించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం ఫీల్ పట్టాను సాధించారు.

ఆ తదుపరి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్య కే సంజీవరావు పర్యవేక్షణలో “హైదరాబాద్ స్టేట్ తెలుగు కన్నడ కథలు -తులనాత్మక పరిశీలన” అనే అంశంపై సిద్ధాంత వ్యాసం సమర్పించి పి హెచ్ డి పట్టాను పొందారు. కాలేజ్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకం పొంది 1998 నుంచి అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్నారు.

ప్రభుత్వ డిగ్రీ ప్రభుత్వ సైన్స్ జూనియర్ కళాశాల కరీంనగర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గంగాధర, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల చొప్పదండి, ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాల లో విధులు నిర్వర్తిస్తున్నారు‌. అధ్యాపకు వృత్తిలో రాణిస్తూనే తెలుగు సాహిత్యంలో రచనలు చేస్తున్నారు. ప్రమోద కుమార్ అనువదించిన కన్నడ కథలు చతుర, విపుల, వార్త, ఆంధ్రజ్యోతి, స్రవంతి మొదలైన పత్రికలలో ప్రచురితమైనాయి వీరు “మాట్లాడే చెట్లు” అనే నానీల కవితా సంపుటిని వెలువరించారు.

శాతవాహన విశ్వవిద్యాలయం తో పాటు వివిధ విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అనేక సెమినార్లలో పాల్గొని దాదాపు 30కి పైగా పత్ర సమర్పణలు చేశారు. 2013-14 మరియు 2014-15 విద్యా సంవత్సరాలలో ఇంటర్మీడియట్ తెలుగు పాఠ్యప్రణాళిక సంపాదకమండలి సభ్యులుగా మరియు కోర్స్ రైటర్ గా పని చేశారు. శాతవాహన విశ్వవిద్యాలయం తెలుగు పాఠ్య ప్రణాళిక మండలి సభ్యులుగా విధులు నిర్వర్తించారు.

ప్రమోద కుమార్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపిక కావడం అభినందనీయం అంటూ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కలువకుంట రామకృష్ణ మరియు అధ్యాపక బృందం అభినందించారు.