# Tags
#తెలంగాణ #హైదరాబాద్

బీసీలకు 3 నగరాలు, 38 పట్టణాలు… మున్సిపల్​ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

పట్టణ స్థానిక సంస్థల మేయర్లు, ఛైర్‌పర్సన్లకు రిజర్వేషన్ల ఖరారు స్థానాల వారీగా 17న కొలిక్కి

పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో భాగంగా తెలంగాణలో 10 నగరపాలక సంస్థలు, 121 పురపాలక సంఘాలకు పురపాలక శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసింది. రిజర్వేషన్ల ఖరారులో పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని మొత్తం 10 కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున, బీసీలకు మూడు (జనరల్‌ 2, మహిళలకు 1) చొప్పున కేటాయించారు.

అన్‌ రిజర్వుడ్‌(ఓసీ)లో జనరల్‌కు ఒకటి, మహిళలకు 4 నగరాలను ఖరారు చేశారు.

121 పురపాలికల్లో ఎస్టీలకు ఐదు (3 జనరల్, 2 మహిళలు), ఎస్సీలకు 17 (9 జనరల్, 8 మహిళలు), బీసీలకు 38 (19 జనరల్, 19 మహిళలు) కేటాయించారు.

అన్‌ రిజర్వుడ్‌ (ఓసీ)లో జనరల్‌కు 30, మహిళలకు 31 మున్సిపాలిటీలను కేటాయించారు.

ఈ నెల 17న రిజర్వుడ్‌ స్థానాల్లో వేటిని ఎవరికి కేటాయించాలనేది ఖరారు చేసే అవకాశమున్నట్లు పురపాలక శాఖ అధికారవర్గాలు పేర్కొన్నాయి.

రిజర్వేషన్లకు మార్గదర్శకాలు ఇలా :

పురపాలక శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీల రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించరాదు. ఎస్సీ-ఎస్టీ, బీసీ, జనరల్, అన్​రిజర్వుడ్​ విభాగాల్లో మొత్తం సీట్లలో 50 శాతం మహిళలకు కేటాయించాలి. పురపాలక శాఖ సంచాలకుడు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారు.

జిల్లా కలెక్టర్​ వార్డుల వారీ రిజర్వేషన్లను ఖరారు చేసి, ఆ తర్వాత జిల్లా గెజిట్​లో తుది నోటిఫికేషన్​ విడుదల చేస్తారు.

సీట్ల కేటాయింపు విధానమిలా :
రిజర్వేషన్ల కోసం 2024 సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కులగణన సర్వే (ఎస్​ఈఈఈపీసీ) ప్రకారం ఉన్న గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. వార్డుల రిజర్వేషన్​ తొలుత ఎస్టీ తర్వాత ఎస్సీ అనంతరం బీసీ క్రమంలో జరుగుతుంది.

ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లు :
ఆయా పురపాలికల్లోని జనాభా ప్రాతిపదికన కేటాయిస్తారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఒక్క సీటు కూడా రాకపోయినా, వీరికి కనీసం ఒక వార్డును కేటాయించాలి.

బీసీ రిజర్వేషన్లు : డెడికేటెడ్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు నిర్ణయిస్తారు.

మహిళా రిజర్వేషన్లు ఇలా :
ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్​ విభాగాల్లోని మొత్తం సీట్లలో 50 శాతం మహిళలకు కేటాయిస్తారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్​ డ్రా తీసి మహిళలకు వార్డులను ఖరారు చేయాలి.

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ కోసం పురపాలక శాఖ రిజర్వేషన్ల కసరత్తు ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా స్థానాల సంఖ్య ఖరారు చేసింది. 121 మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్ల సంఖ్యను ఖరారు చేసింది.

మున్సిపాలిటీల్లో జనరల్‌ 30, జనరల్‌ మహిళ 31, ఎస్టీ జనరల్‌ 3, ఎస్టీ మహిళ 2, ఎస్సీ జనరల్‌ 9, ఎస్సీ మహిళ 8, బీసీ జనరల్‌ 19, బీసీ మహిళలకు 19 స్థానాలను కేటాయిస్తున్నారు.

టీ-పోల్​లో వేగంగా అప్​డేట్ చేయాలి :
మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. గత వారం కింద ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

ఈ నెల 12న తేదీన మొదటి ఓటర్ల జాబితా, 13న పోలింగ్‌ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితా ప్రచురించి, ఆ తర్వాత వాటిని ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టి-పోల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆమె వెల్లడించారు. ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతో పాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితా ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని కమిషనర్ తెలిపారు.

అలాగే అవసరమైన బ్యాలెట్‌ బాక్సుల అంచనా, రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్, జోనల్‌ అధికారుల నియామకానికి ఉద్యోగుల వివరాలను టి-పోల్‌లో వేగంగా అప్‌డేట్‌ చేయాలని రాణి కుముదిని ఆదేశించారు.,