# Tags
#తెలంగాణ

వేములాడ రాజన్న ఆలయంలో దర్శనాలు ఉండవన్న నేపథ్యంల, రాజన్న ఆలయ సంరక్షణ సమితి పేరిట వేములవాడ బంద్ విజయవంతం

వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పేరిట ఆలయాన్ని మూసివేసి భక్తులకు దర్శనాలు , పూజలు ,కోడె మొక్కులు భీమన్న ఆలయంలో నిర్వహిస్తామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి ముందుగా కొద్ది రోజులపాటు ఆలయంలో జరిగే పూజలు కోడే మొక్కులు తదితరాలు భీమన్న ఆలయంలో నిర్వహిస్తామనీ, భక్తులకు రాజన్న ఆలయంలో దర్శనాలు ఉండవని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పట్టణంలోని 27 కుల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రాజన్న ఆలయ సంరక్షణ సమితి పేరిట  బుధవారం వేములవాడ బంద్ కు  పిలుపునిచ్చి నిరసన తెలిపారు.

దేవాదాయ కమిషనర్ , స్తపతి తదితరులకు ఆలయాన్ని మూసివేయకుండా అభివృద్ధి పనులు కొనసాగించాలని కోరడం జరిగిందని అన్నారు .ఆలయ విస్తీర్ణం ఎంతవరకు చేస్తారు? అభివృద్ధి పనులు, మార్పులు-చేర్పులపై భక్తులకు తెలియకుండానే ఏర్పాట్లు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అయితే, అధికారులు మాత్రం ఆగమశాస్త్రం ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం సరికాదని ఆగమశాస్త్రంలో దేవాలయ లోపల దర్గా ఉండడం సరైనదేనా ? అని ప్రశ్నించారు.

1966 లో దేవాదాయ శాఖ ఏర్పాటు జరిగిందని అంతకు ముందు నుండే 400 కుటుంబాల అర్చకులు నివేదనలు అన్న పూజ, తదితరులు పూజా సామాగ్రి, తమ ఇంటి నుండి తీసుకువెళ్లి పూజలు చేశారని గుర్తు చేశారు. 

ఆలయ ప్రసాదాల్లో నాణ్యత లేదని అదే విధంగా ధర్మగుండం నీళ్లు పరిశుభ్రంగా ఉండడం లేదని వాపోయారు .భక్తుల మనోభావాలను కాపాడాలని మాత్రమే మేము కోరుతున్నామని, అభివృద్ధిని తాము అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు 

అలాగే, అభివృద్ధి పేరిట ఆలయంలో ఉన్న పరివార దేవతలను తొలగించాలనుకోవడం ఎట్టి పరిస్థితులలో జరిగే పని కాదని తాము దాన్ని అడ్డుకుంటామని అన్నారు.

ప్రభుత్వ నిర్ణయం చూస్తే ఇల్లు విప్పి పందిరి వేస్తుందా అన్న సామెతల ఉందన్నారు. దేవాలయం వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా చిరు వ్యాపారులతో కలిసి దాదాపు పదివేల కుటుంబాలు ఆధారపడి ఉంటున్నాయని, వారిని బజారున పడేస్తే ఊరుకునేది లేదని అన్నారు.

గతంలో తిరుమల ఏడుకొండలు కాదు రెండు కొండలు అన్న ముఖ్యమంత్రికి జరిగిన అనర్ధం, అదేవిధంగా కంచి స్వామిపై దౌర్జన్యం చేపట్టిన అప్పటి ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితులు మననం చేసుకోవాలని, ప్రభుత్వ పెద్దలు ఇలాంటి సోదాహరణాలను తెలుసుకోవాలన్నారు.

ఆలయ పనులు కొనసాగిస్తూనే భక్తులకు దర్శనాన్ని ఎట్టి పరిస్థితిలో ఆపకూడదని డిమాండ్ చేశారు. గతంలో కాశీ కారిడార్ నిర్మించినప్పుడు భక్తుల దర్శనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్మాణం చేశారని అంతే కాకుండా ఉజ్జయిని, అయోధ్యలో రామాలయ నిర్మాణం సమయంలో బాల రాముని ఉప ఆలయంలో ఉంచి పనులు కొనసాగించినట్లు గుర్తు చేశారు. 

ఇప్పటికే ధర్మ దర్శనానికి ఐదు నుండి 6 గంటల సమయం పడుతుందని దీని దృష్టియందుఉంచుకొని కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి దర్శనం చేసుకునే భక్తులకు తిరుపతి తదితర పెద్ద దేవాలయాల్లో ఉన్నట్లుగా కంపార్ట్మెంట్లలో ఏర్పాట్లు చేయాలని అన్నారు.

ఆగమశాస్త్రం పేరిట సనాతన ధర్మానికి విరుద్ధంగా ఆలయంలో పరివార దేవతలను తొలగిస్తామనడం సరికాదని ఈ విషయంపై ఖచ్చితంగా ప్రతిఘటిస్తామని అన్నారు. 

సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా, పౌరాణిక నేపథ్యం కలిగిన ఈ ఆలయంలో జరిగే అన్ని విషయాలు భక్తులకు కచ్చితంగా తెలుపాలని భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. 

అదేవిధంగా అభివృద్ధి పేరిట మార్పుల చేర్పులపై పునరాలోచన చేసి భక్తులకు దర్శనాలను యధావిధిగా రాజన్న ఆలయంలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం వద్ద నగదు నిల్వలపై ప్రకటనలు చేశారని, దేవాలయానికి సంబంధించిన డిపాజిట్లను ఎట్టి పరిస్థితిలో వినియోగించరాదని స్వామివారి బంగారు వస్తువులను కరిగించి అభివృద్ధి పనులకు వాడాలని చూస్తే హిందువుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన అన్నారు .

ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఆలయంలో పనిచేసే ఉద్యోగులకు డిఏల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉందని, 500 ఉద్యోగుల పరిస్థితిని ప్రభుత్వం గమనించి వారికి న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. దేవాదాయ శాఖపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన,  ఆ శాఖకు దేవుని ఆదాయం మాత్రమే కావాలని భక్తుల మౌలిక సదుపాయాలపై సంబంధం లేకుండా వ్యవహరించడమే దేవాదాయ శాఖ మూలసూత్రంగా మారిందని దుయ్యబట్టారు .

భక్తుల మౌనం అంగీకారం కాదని,  ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా పనులు జరుగుతే భగవంతుడు సైతం వారిని క్షమించడని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. బంద్ కు సహకరించిన వర్తక, వాణిజ్య వర్గాల వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.