# Tags
#తెలంగాణ #Culture #Events #జాతీయం

‘సరస్వతి పుష్కరాల’ స్ఫూర్తితో ‘గోదావరి పుష్కరాలు నిర్వహిస్తాం : మంత్రి శ్రీధర్ బాబు

  • ప్రభుత్వం ఏదైనా, ఆలోచన మాత్రమే చేస్తుంది… ఆచరణలో పెట్టాల్సింది అధికారులే…
  • ఒక టీం వర్క్ లా పనిచేసి పుష్కరాలను అత్యంత విజయవంతంగా నిర్వహించారు…
  • అధికారులూ, సిబ్బందీ…సరస్వతీ పుష్కరాల విజయవంతంలో టీం వర్కుతో కృషి చేసిన ప్రతిఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు…
  • సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమం మొత్తం పుష్కరాలకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది

హైదరాబాద్, 

రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ‘సరస్వతి పుష్కరాల’ నిర్వహణను ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

ఈ పుష్క రాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.40 కోట్లు కేటాయించిందని తెలిపారు.

ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుంది… ఆచరణలో పెట్టాల్సింది మీరెనని అధికారులనుద్దేశించి వ్యాఖ్యా నించారు. మీలాంటి అధికారులు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పని చేస్తేనే అది అమలు అవుతుందని అన్నారు. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు.

నిజానికి పుష్కరాల నిర్వహణ అంత తేలిక కాదు. ఏ చిన్న పొరపాటు జరిగినా, నిర్లక్ష్యంగా ఉన్నా జరిగే నష్టం అంతా ఇంతా కాదు. పైగా… ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. మనకు చాలా తక్కువ సమయం మాత్రమే దొరికింది. అయినా… మీరంతా కష్టపడి.. ఒకరికొకరు సమన్వయం చేసుకుని… ఒక టీం వర్క్ లా పనిచేసి పుష్కరాలను అత్యంత విజయవంతంగా నిర్వహించారు.

 సుమారు 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి… ఆ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకున్నారంటే కారణం మీరే.. మీరు పడిన శ్రమ, మీరు చూపిన చొరవ జిల్లా కలెక్టర్, ఎస్పీ మార్గ నిర్దేశనంలో 33 శాఖలకు చెందిన అటెండర్ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్కరూ మూడు నెలలు కష్టపడ్డారు. పుష్కరాలను విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించారు అని జిల్లాస్థాయి అధికారులను ప్రశంసించారు.

భద్రత, నీటి సరఫరా, అన్నదానం, మెడికల్ సౌకర్యాలు, శౌచాలయాలు, విద్యుత్, పారిశుధ్యం ఇలా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేశామన్నారు. మీ చొరవ వల్లే తెలంగాణలో తొలిసారిగా కాశీ పండితుల చేతుల మీదుగా ప్రతి రోజు సాయంత్రం నిర్వహించిన “సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమం మొత్తం పుష్కరాలకే ప్రధాన ఆకర్షణగా నిలిచిందని కొనియాడారు.

ఈ పుష్కరాల ద్వారా ఆర్టీసీకి సుమారు రూ.10 కోట్ల ఆదాయం వచ్చిందని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అవకాశాన్ని వినియోగించుకొని లక్షలాది మంది సోదరీమణులు, మాతలు పుష్కరాలకు విచ్చేశారన్నారు.

కొందరు సరస్వతి పుష్కరాలు విజయవంతం కాకుండా చేయాలని కుట్రలు పన్నారని ఆరోపించారు. చిన్న చిన్న అంశాలను భూతద్దంలో చూపించి మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

ఇది మొదటి అడుగు మాత్రమేనని, 2027 లో రానున్న గోదావరి పుష్కరాలను మరింత వైభవంగా నిర్వహించాలన్నదే మా ప్రభుత్వ సంకల్పమన్నారు. ఈ విషయంలో అసలు రాజీ పడబోం. ఈ పుష్కరాల్లోని లోటుపాట్లను గుర్తించి… అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవా ల్సిన గురుతర బాధ్యత మనపై ఉంది. ముఖ్యం లాగా మీ పాత్ర కీలకం. ప్రభుత్వం మీ వెంటఉంటుందని భరోసానిచ్చారు. 

కాళేశ్వరానికి వెళ్లే జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 

త్వరలో కాళేశ్వరం, ఇతర ప్రాంతాల్లో కొత్త బస్సుడిపోల నిర్మాణానికి శ్రీకారం చుడతామని చెప్పారు. 

ఓవైపు అభివృద్ధి… మరోవైపు సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే తొలిస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. 

అందులో భాగంగానే రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి లాంటి అనేక ప్రతిష్ఠాత్మక పథకాలకు శ్రీకారం చుట్టామని, అయినా… కొందరు పనిగట్టుకొని మేమేం చేయడం లేదంటూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ పుష్కరాల స్ఫూర్తితో అధికారులు మరింత ఉత్సాహంతో… టీం వర్క్ తో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆలోచనలు, ప్రాధాన్యాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని ఆయన అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *