# Tags
#తెలంగాణ

‘దేశ్‌పాండే ఫౌండేషన్’ కు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సామాజిక సేవలో పేరుపొందిన ప్రఖ్యాత స్వచ్ఛంద సంస్థ ‘దేశ్‌పాండే ఫౌండేషన్’ తెలంగాణలో సేవలను విస్తరించడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

దేశ్‌పాండే ఫౌండేషన్ సభ్యులు ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, సేవా కార్యక్రమాల విస్తృతిపై చర్చించారు.

రాష్ట్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాల నిర్వహణలో దేశ్‌పాండే ఫౌండేషన్ పాలుపంచుకుంటే సముచితంగా ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.

అలాగే, మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను దత్తత తీసుకోవాలని కోరారు. సీఎం సూచనలను దేశ్‌పాండే ఫౌండేషన్ వారు అంగీకరించారు.

ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, దేశ్‌పాండే ఫౌండేషన్ వ్యవస్థాపకులు గురురాజ్ దేశ్‌పాండే, జయశ్రీ దేశ్‌పాండే, దేశ్‌పాండే స్టార్టప్స్ రాజు రెడ్డి, ప్రతినిధి జి.అనిల్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

దేశ్‌పాండే ఫౌండేషన్ అమెరికాతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక పరిస్థితుల మార్పు కోసం పని చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఆంగ్లంలో శిక్షణ ఇవ్వడం, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.